గాల్లో దీపం మాదిరి మినుకు మినుకుమంటూ ఎప్పుడేమవుతుందోనన్న సంశయాల మధ్యే నెట్టుకొస్తున్న ఇజ్రాయెల్ ప్రభుత్వం చిట్టచివరకు కుప్పకూలింది. పార్లమెంటు కెన్సెట్‌ను రద్దు చేయాలని ఆ చట్టసభ గురువారం ఏకగ్రీవంగా తీర్మానించడంతో దాదాపు నాలుగేళ్ల వ్యవధిలో అయిదోసారి ఆ దేశంలో సాధారణ ఎన్నికలు రాబోతున్నాయి. వచ్చే నవంబర్ 1న ఈ ఎన్నికలుంటాయి. చట్టసభల్లో బలాబలాలతో నిమిత్తం లేకుండానే, ఎన్నికల బెడద రాకుండానే రాష్ట్ర ప్రభుత్వాల ఉత్థానపతనాలు రివాజైపోయిన మన దేశంలో ఇజ్రాయెల్ పరిణామాలు సహజంగానే ఆసక్తి రేకెత్తిస్తాయి.
నిబంధనల ప్రకారమైతే పార్లమెంటు కాల వ్యవధి నాలుగేళ్లు. లికుడ్ పార్టీ అధినేత, మితవాది అయిన బెంజమిన్ నెతన్యాహూ వరసగా మూడు దఫాలు ఎన్నికై, ఇతర పార్టీల సహకారంతో పన్నెండేళ్లపాటు అధికారం నిలబెట్టుకుని రికార్డు సృష్టించారు. అయితే 2019 ఏప్రిల్ ఎన్నికల నాటినుంచీ దేశంలో అస్థిరత తప్పడం లేదు. 120 మంది సభ్యులుండే పార్లమెంటులో కనీస మెజారిటీ 61 ఎవరికీ రాలేదు. దాంతో పొసగని పార్టీలు కూటములుగా ఏర్పడి ప్రభుత్వాలు ఏర్పాటు చేయక తప్పలేదు. 2018 నుంచి బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేని స్థితి ఏర్పడింది.
నెతన్యాహూ ఎప్పటికప్పుడు అనామతు ఖాతాలతో నెట్టుకొచ్చారు. చివరకు ఆయనపై అవినీతి ఆరోపణలు రావడం, వాటికి ప్రాథమిక సాక్ష్యాధారాలు లభించడంతో నెతన్యాహూ అధికారం నుంచి వైదొలిగారు. నిరుడు జూన్‌లో ఎన్నికల అనంతరం ప్రధానిగా ప్రమాణం చేసిన నఫ్తాలీ బెనెట్ పూర్తి స్థాయి బడ్జెట్ సమర్పించారు. అయితే కూటమిలోని వివిధ పక్షాలను సంతృప్తి పరిచేందుకు రాజీపడటం స్వపక్షమైన యామినా పార్టీలో ముసలం పుట్టించింది. ఆ పార్టీ ఎంపీ గత ఏప్రిల్‌లో రాజీనామా చేశారు. పర్యవసానంగా బెనెట్ ప్రభుత్వం కొన ఊపిరితో సాగుతోంది.
సైద్ధాంతిక సారూప్యతలేని పార్టీలు అధికారం కోసమే దగ్గరైనప్పుడు విభేదాలు తప్పవు. కలిసి పనిచేసే క్రమంలో కొన్నిసార్లు పరస్పర అవగాహన ఏర్పడుతుందనీ, ఆ పార్టీల వైఖరుల్లో మార్పు వస్తుందనీ కొందరి వాదన. కానీ నిలువునా చీలిన ఇజ్రాయెల్ సమాజంలో అది సాధ్యపడలేదు. అధికార కూటమిలో ఎనిమిది పార్టీలుండగా అందులో మధ్యేవాద, కుడి, ఎడమ పక్షాలతోపాటు స్వతంత్ర అరబ్ పక్షం రాహంబా పార్టీ కూడా ఉంది. అరబ్బులకు ప్రాతినిధ్యం వహించే పార్టీల్లో ఒకటి పాలనలో భాగస్వామ్యం తీసుకోవడం ఇజ్రాయెల్ చరిత్రలో అదే తొలిసారి.
అందువల్లే ఈ కూటమిపై మొదట్లో అందరూ ఆశలు పెట్టుకున్నారు. దేశాన్ని పట్టిపీడిస్తున్న సమస్యలకు పరి ష్కారం దొరుకుతుందనుకున్నారు. కానీ యూదులకూ, పాలస్తీనా ప్రాంత ప్రజలకూ మధ్య విద్వే షాలు రేకెత్తించడంలోనే దశాబ్దాలుగా మనుగడ వెదుక్కునే పార్టీల పుణ్యమా అని ఈ ప్రయోగం బెడిసికొట్టింది. నెతన్యాహూపై అవినీతిపరుడన్న ముద్ర ఉన్నా ఆయన్ను పదవీచ్యుతుణ్ణి చేయ డానికి ఒక అరబ్ పక్షం ప్రయత్నించి విజయం సాధించిందన్న వాస్తవాన్ని ఇజ్రాయెల్ సమాజం జీర్ణించుకోలేకపోయింది. అందుకే వారితో చేతులు కలిపి అధికారంలో కొనసాగిన మితవాద పక్షం యామినా పార్టీకి పౌరుల్లో పరపతి అడుగంటింది. రాబోయే ఎన్నికల్లో నెతన్యాహూను సమర్థించే మితవాద పక్షాలకు అధిక స్థానాలు వస్తాయని సర్వేలు చెబుతున్నాయి.
అంతో ఇంతో వామపక్షాల వైపు సానుభూతిగా ఉండేవారు సైతం ఈసారి మితవాదంవైపు మొగ్గుచూపుతున్నారని సర్వేలంటు న్నాయి. ఈ సర్వేల విశ్వసనీయత సంగతలావుంచి ఇజ్రాయెల్ దురాక్రమణలో ఉన్న వెస్ట్‌బ్యాంక్‌లో అయిదు లక్షలమంది యూదులకు 120 ఆవాసాలు ఏర్పరిచారు. అక్కడున్న 30 లక్షలమంది పాల స్తీనా పౌరులు ఈ విషయంలో ఆగ్రహంతో ఉన్నారు. ఆ కాలనీలను ఇజ్రాయెల్‌లో విలీనం చేసేం దుకు మొన్న ఏప్రిల్‌లో అధికార కూటమి ప్రయత్నించినప్పుడు పాలస్తీనా వాసులకు ప్రాతినిధ్యం వహించే రహంబా పార్టీ తీవ్ర అభ్యంతరం తెలిపింది.
తాత్కాలికంగా ప్రభుత్వం నుంచి తప్పు కుంది. దాంతో ప్రధాని బెనెట్ రాజీపడక తప్పలేదు. యూదు కాలనీలపై చట్టం వస్తే ఆ ప్రాంతం ఇజ్రాయెల్‌లో భాగంగా మారుతుందన్నది పాలస్తీనా వాసుల వాదన. ఇప్పటికే యూదులకూ, పాల స్తీనా వాసులకూ అక్కడ వేర్వేరు చట్టాలు అమలవుతున్నాయి. అటు యూదులకు సైతం ఇదొక సంకటంగా మారింది. ప్రస్తుతం ఆ కాలనీల్లో సైనిక పాలన ఉన్నందువల్ల ఇతర ఇజ్రాయెల్ పౌరుల మాదిరి వారు పూర్తి స్థాయి హక్కులు పొందలేకపోతున్నారు. ఈనెల 1వ తేదీతో గడువు ముగు స్తున్న దశలో ఈ చట్టం కోసం రూపొందించిన బిల్లు గత నెల 10న పార్లమెంటులో వీగిపోయింది.
ఇలా పరస్పర విరుద్ధ ప్రయోజనాలున్నచోట ‘అందరి ప్రభుత్వం’ ఏర్పాటు చేయడం, అది నాలుగేళ్లూ మనుగడ సాగించటం సహజంగానే అసాధ్యం. నెతన్యాహూ అధికారంలో ఉండగా ఈ వైషమ్యాలను మరింత పెంచి, భవిష్యత్తులో మళ్లీ అందరూ విధిగా తనవైపే చూడకతప్పని స్థితి కల్పించారు. ఆర్థికాభివృద్ధికి పాటుపడటం, శాంతి సాధనకు ప్రయత్నించడం వంటి ఆదర్శాలకు కాలం చెల్లి, వైషమ్యాలే ఎన్నికల ఫలితాలను నిర్దేశించే స్థాయికి చేరుకోవడం ఆందోళనకరమే. ఈసారి ఎన్నికైతే యూదులకు ఉజ్వల భవిష్యత్తు కల్పిస్తాననడంతోపాటు ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసి, నిత్యావసరాల ధరలను తగ్గిస్తానని నెతన్యాహూ వాగ్దానం చేస్తున్నారు. తదుపరి ఏర్పడ బోయేది ‘పటిష్టమైన’ జాతీయవాద ప్రభుత్వమా... అరబ్ పార్టీల పలుకుబడి కొనసాగే ‘యూదు వ్యతిరేక’ ప్రభుత్వమా అన్నది నవంబర్ 1 తర్వాత తేలుతుంది.
Comments
Please login to add a commentAdd a comment