మన పొరుగున వాణిజ్యకూటమి | Editorial About RCEP Trade Agreement Shape Global Economics Politics | Sakshi
Sakshi News home page

మన పొరుగున వాణిజ్యకూటమి

Published Wed, Nov 18 2020 12:26 AM | Last Updated on Wed, Nov 18 2020 12:36 AM

Editorial About RCEP Trade Agreement Shape Global Economics Politics - Sakshi

ఎనిమిదేళ్లుగా చర్చలకే పరిమితమైన ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య(ఆర్‌సెప్‌) ఒప్పందంపై ఆదివారం సంతకాలయ్యాయి. ఆసియా–పసిఫిక్‌ ప్రాంతంలోని 15 దేశాల అధినేతలు ఆన్‌లైన్‌లో సమావేశమయ్యాక ఒప్పందం సాకారమైంది. అయితే సభ్య దేశాలన్నీ తమ తమ చట్టసభల్లో ఈ ఒప్పందాన్ని ధ్రువీకరించాక ఇది అమల్లోకొస్తుంది. 2012లో చైనా ప్రతిపాదించిన ఈ ఒప్పందంలో ఆ దేశంతోపాటు జపాన్, ఆస్ట్రేలియా. దక్షిణ కొరియా, న్యూజిలాండ్‌వంటి సంపన్న దేశాలు.. ఆగ్నే యాసియా దేశాల సంఘం(ఆసియాన్‌)లోని బ్రూనై, కంబోడియా, ఇండోనేసియా, లావోస్, మలే సియా, మయన్మార్, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయ్‌లాండ్, వియత్నాంలు కూడా వున్నాయి. మరి కొన్ని దేశాలు కూడా చేరతాయంటున్నారు.

ఈ ఒప్పందంపై ఆదినుంచీ జరిగిన చర్చల్లో ఇతర దేశా లతోపాటు మన దేశం కూడా పాల్గొంది. యూపీఏ ప్రభుత్వం దీనిపై ఎంతో ఆసక్తి కనబరిచింది. 2014లో ఎన్‌డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక కూడా మన దేశం చర్చల్లో పాలుపంచుకుంది. అయితే ఆ చర్చల వివరాలేమిటో, ఏఏ అంశాలపై ఎవరి అభిప్రాయమేమిటో అధికారికంగా ఎప్పుడూ వెల్లడి కాలేదు. ఫలానా అంశాలపై చర్చ జరిగిందని అడపా దడపా కథనాలు వెలువడటమే తప్ప అవి నిజ మనో, కాదనో అధికారికంగా చెప్పేవారెవరూ లేరు. అటు వామపక్ష సంస్థలు, ఇటు సంఘ్‌ పరివార్‌ అనుబంధ సంస్థలు కూడా ఆర్‌సెప్‌లో చేరడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు నిర్వహించాయి. చివరకు అందులో భాగస్వామ్యం కాదల్చుకోలేదంటూ నిరుడు నవంబర్‌లో మన దేశం ప్రకటించింది. 

ఆర్‌సెప్‌ ఉనికిలోకొస్తే అది విరజిమ్మగల ధగధగల గురించిన కథనాలు చాలానే వెలువడుతున్నాయి. ప్రపంచ జనాభాలో ఈ దేశాల జనాభా మూడోవంతు. అలాగే ప్రపంచ జీడీపీలో 30శాతం. అమలుకావడం మొదలయ్యాక ప్రపంచ ఆర్థికవ్యవస్థను అది మరింత బలోపేతంచేసి, మరో 18,600 కోట్ల డాలర్ల మేర పెంచుతుందని ఆర్థిక నిపుణుల అంచనా. ఇందులో చేరిన దేశాల మధ్య ఇప్పటికే వున్న వాణిజ్య ఒప్పందాలు కూడా ఆర్‌సెప్‌లో విలీనమవుతాయి. యూరప్‌ యూని యన్‌ (ఈయూ) వాణిజ్యమండలి, ఉత్తర అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(నాఫ్టా) మాదిరే ఇది తూర్పు ఆసియా, ఆగ్నేయాసియా దేశాలన్నిటినీ ఒకే గొడుగు కిందకు తెస్తుందని నిపుణులు చెబు తున్నారు.

ఇందులో చేరిన జపాన్, దక్షిణకొరియా, ఆస్ట్రేలియా వంటి దేశాలకు చైనాతో ఇతరేతర అంశాల్లో తీవ్ర విభేదాలున్నాయి. అయినా వాణిజ్యం విషయంలో చేతులు కలపడానికి అవి అడ్డురాలేదు. చైనాకు వ్యతిరేకంగా అమెరికా ప్రతిపాదిస్తున్న ఇండో–పసిఫిక్‌ దేశాల కూటమిలో, క్వాడ్‌లో భారత్, జపాన్, ఆస్ట్రేలియా భాగస్వామ్య దేశాలు. మన దేశానికి కూడా సరిహద్దుల విషయంలో, అది పాకిస్తాన్‌కు అండదండలందిస్తున్న విషయంలో చైనాపై తీవ్ర అభ్యంతరాలున్నాయి. అయితే ఆర్‌సెప్‌ ఒప్పందం నుంచి తప్పుకోవడానికి అదే ప్రధాన కారణమని చెప్పడం అతిశయోక్తి అవుతుంది.

మౌలికంగా ఆర్‌సెప్‌ ఒప్పందం తయారీ రంగ పరిశ్రమలున్న దేశాలకు, ఎగుమతులుచేయగల దేశాలకు ఉత్తమమైంది. దిగుమతులపై ఆధారపడే దేశాలకు ప్రాణసంక టమైనది. సరుకుల్ని ఉత్పత్తి చేసే దేశాలు సులభంగా వాటిని సభ్య దేశాల మార్కెట్లకు తరలిస్తాయి. అవే సరుకులు తమ దేశంలో ఉత్పత్తవుతున్నా ఒప్పందంలోని నియమాల ప్రకారం భాగస్వామ్య దేశాలు దిగుమతి చేసుకోక తప్పదు. చైనాలో వున్న కార్మిక చట్టాల వల్ల, అక్కడుండే పని పరి స్థితులవల్ల వేరే దేశాలతో పోలిస్తే అది చవగ్గా సరుకుల్ని ఉత్పత్తి చేసి ఎగుమతి చేయగలుతుంది.

అవి మార్కెట్లను ముంచెత్తినప్పుడు జనం వాటికోసమే ఎగబడతారు. స్థానికంగా ఉత్పత్తయ్యే సరుకంతా అమ్ముడు కాక  పరిశ్రమలు భారీగా నష్టాలు చవిచూడాల్సి రావొచ్చు. ఉదాహరణకు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ దేశాల పాల ఉత్పత్తులు మన దేశంతో పోలిస్తే బాగా చవక. ఆర్‌సెప్‌ ఒప్పందం కింద అవి మన మార్కెట్లకొస్తే ఇక్కడి ఉత్పత్తులవైపు ఎవరూ కన్నెత్తి చూడరు. పర్యవసానంగా వేలాది పరిశ్రమలు మూతపడే ప్రమాదం వుంటుంది. ప్రస్తుతం విదేశీ పాల ఉత్పత్తులపై మన దేశం 35 శాతం సుంకం విధిస్తోంది. ఆర్‌సెప్‌లో చేరితే అది అసాధ్యం. సుంకాలు నిర్దిష్ట పరిమితిని దాట కూడదు.

ఔషధ ఉత్పత్తులది వేరే సమస్య. ప్రాణావసరమైన మందులపై ఆర్‌సెప్‌ ఒప్పందం కింద కనీసం ఇరవై య్యేళ్లపాటు పేటెంట్‌ వుంటుంది. అదే ఔషధాన్ని అంతకన్నా చవగ్గా ఉత్పత్తి చేయగల సామర్థ్యం మన పరిశ్రమలకున్నా ఆ పని చేయడానికి పేటెంట్‌ హక్కులు అడ్డుపడతాయి. కనుక రోగులు మార్కెట్లో లభ్యమయ్యే ఖరీదైన విదేశీ ఔషధాలపైనే ఆధారపడాలి. 

దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాలను గంపగుత్తగా వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. సభ్య దేశాలన్నిటికీ లాభం చేకూర్చేవిధంగా రూపొందితే వాణిజ్య ఒప్పందాలపై ఎవరికీ అభ్యంతరం వుండదు. ఆచరణలో ఒక దేశానికి ప్రయోజనం కలిగేలా, ఆ దేశానిదే పైచేయి అయ్యేలా వున్నప్పుడే సమస్యంతా. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్‌సెప్‌ దేశాలను ప్రధానంగా చైనా, ఆ తర్వాత జపాన్, దక్షిణ కొరియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా శాసించగలుగుతాయి. ఆ విషయంలో తగిన రక్షణలకు హామీ ఇవ్వడానికి ముందుకొస్తే వేరే సంగతి.

ఉదాహరణకు దిగుమతులు నిర్దిష్ట పరిమితిని దాటిన వెంటనే సుంకాలు పెరిగే విధమైన ఏర్పాటుండాలని మన దేశం కోరింది. దీనికి ఆర్‌సెప్‌ నిర్వాహక దేశాలు అంగీకరించలేదు. నేరుగా కాక మూడో దేశం ద్వారా ఉత్పత్తులను ఎగుమతిచేసే కుయుక్తులను అడ్డుకునే నిబంధనలు కూడా సరిగా లేవన్నది మన దేశం ఆరోపణ. సంపదలో, ఉత్పత్తిలో దేశాల మధ్య అసమానతలు తీవ్ర స్థాయిలో వున్న పరిస్థితుల్లో ఇలాంటి ఒప్పందాలు కొన్ని దేశాలకే ప్రయో జనం కలిగిస్తాయి. అన్ని దేశాల సమస్యలనూ, ఆందోళనలనూ పరిగణనలోకి తీసుకుంటే, తగిన మినహాయింపులిస్తే ఇదే కాదు... ఏ వాణిజ్య ఒప్పందానికైనా అభ్యంతరాలుండవు. కానీ అందుకు సిద్ధపడేదెవరు?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement