Editorial Special Story About Terrorists Attack On Jammu-Kashmir January 1st 2023 - Sakshi
Sakshi News home page

ఈ తోక వంకర తీసేదెట్లా?

Published Wed, Jan 4 2023 12:16 AM | Last Updated on Wed, Jan 4 2023 9:54 AM

Editorial About Terrorists Attack On Jammu-Kashmir January 1st 2023  - Sakshi

కొత్త ఏడాది ఇలా ఆరంభమవుతుందని కశ్మీర్‌ ప్రజలు ఊహించలేదు. అందరూ శాంతి, సంతోషాలను కోరుకుంటున్న వేళ జమ్ములో తీవ్రవాదం జడలు విప్పి, 12 గంటల్లో ఆరుగురిని పొట్టనబెట్టుకున్న తీరు మనసును కలచివేస్తుంది. కశ్మీర్‌ లోయతో పోలిస్తే ప్రశాంతమైన జమ్ములో ఇలాంటి ఘటన జరగడం విషాదం. 2019లో ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసి, కేంద్ర పాలిత ప్రాంతంగా భారత్‌ ప్రకటించిన జమ్ము– కశ్మీర్‌లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించి, ఎన్నికల ప్రక్రియను పునరుద్ధరించకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా తీవ్రవాదులు ఈ దుశ్చర్యలకు దిగినట్టు కనిపిస్తోంది.

ఇది పాక్‌ ప్రేరేపిత తీవ్రవాద చర్య అని అర్థం చేసుకోవడం బ్రహ్మవిద్యేమీ కాదు. కాకపోతే, భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ ఐక్యరాజ్య సమితిలో మాట్లాడుతూ, తీవ్రవాద కేంద్రస్థానంగా పాకిస్తాన్‌ను ప్రస్తావించి, ఈ ధోరణిని మార్చుకోవాలంటూ హితవు చెప్పిన పక్షం రోజులకే ఈ ఘాతుకం జరగడం శోచనీయం. మారని పాక్‌ వక్రబుద్ధికి మరో తార్కాణం. 

తాజా ఘటన పూర్వాపరాలు దిగ్భ్రాంతికరం. జమ్ము–కశ్మీర్‌ సరిహద్దు జిల్లాలో రజౌరీ పట్నానికి 8 కిలోమీటర్ల దూరంలోని ధాంగ్రీలో జనవరి 1 సాయంత్రం 7 గంటల వేళ ఖాకీ దుస్తులు ధరించిన తీవ్రవాదులు అక్కడి అల్పసంఖ్యాక వర్గానికి చెందిన మూడు ఇళ్ళలోకి జొరబడ్డారు. విచక్షణారహితంగా కాల్పులు జరిపి, నలుగురు పౌరుల ప్రాణాలు తీశారు. పలువురిని గాయపరిచి, అక్కడ నుంచి ఉడాయించారు. ఆ తుపాకీ దాడులు ముగిసిన కొద్ది గంటల్లోనే ఆ ఇళ్ళ దగ్గరే ఒక చోట తీవ్రవాదులు ఉంచిన బాంబులు పేలి ఇద్దరు చిన్నారులు బలయ్యారు. దర్యాప్తుకు వచ్చే భద్రతాదళ ఉన్నతాధికారులే లక్ష్యంగా ఆ బాంబులు పెట్టడం, ఆధార్‌ కార్డుల ద్వారా గుర్తుపట్టి మరీ ఎంపిక చేసినవారినే తుపాకీ కాల్పులతో చంపడం తీవ్రవాదుల కక్షను తేటతెల్లం చేస్తోంది. 

కశ్మీర్‌లో తీవ్రవాదం వైపు కొత్తగా ఆకర్షితులవుతున్నవారిని వేగంగా నిర్వీర్యం చేస్తున్నామని అక్కడి ఉన్నతాధికారుల ఉవాచ. నిన్న గాక మొన్న ముగిసిన 2022లో 100 మంది కొత్తగా తీవ్రవాద మార్గంలోకి రాగా, 65 మందిని ఎన్‌కౌంటర్‌ చేశామనీ, వారిలోనూ 58 మందిని (89 శాతం) చెడు దోవ తొక్కిన తొలి నెలలోనే మట్టికరిపించామనీ లెక్కలు చెబుతున్నారు. ఎంతమంది తీవ్ర వాదులు కొత్తగా వస్తున్నదీ, పోతున్నదీ మన పాలకులు, పోలీసులు ఇంత నిర్దుష్టంగా చెప్పగలగడం ఆశ్చర్య మైతే, వారి ప్రతి అడుగూ ఇంత తెలిసినవారు అడ్డుకట్ట వేయలేకపోవడం అమితాశ్చర్యం. పైగా, ఆదివారం దాడి తర్వాత ఆ రాత్రి అణువణువూ జల్లెడ పట్టామని భద్రతా దళాలు చెప్పినా, ఆ దగ్గరే దుండగులు పెట్టిన బాంబులు మర్నాడు పేలి మృతులు పెరగడం మన పనితీరును ప్రశ్నిస్తోంది.  

రజౌరీ జిల్లాలో కొన్నిచోట్ల ముప్పుందని కొంతకాలంగా అనుమానిస్తున్నారు. గాలింపులూ జరిగాయి. అయినా సరే ఇలా ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని దాడులు సాగడం అటు తీవ్రవాదుల తెగింపుకూ, ఇటు మన భద్రతా వైఫల్యానికీ నిలువుటద్దం. జిల్లాలో ఓ సైనిక శిబిరం బయట కాల్పుల్లో ఇద్దరు పౌరుల ప్రాణాలు పోయిన రెండు వారాల్లోనే ఈ ఘటన జరగడం గమనార్హం. సరిహద్దులోని అల్పసంఖ్యాకులే గురిగా పాకిస్తాన్‌ ప్రేరేపిత తీవ్రవాదులు చేస్తున్న ఈ అరాచకం దాయాది దేశం సాధించదలుచుకున్నదేమిటో చెప్పకనే చెబుతోంది. పొరుగు దేశాలన్నిటితో భారత్‌ సదా సత్సంబంధాలే కోరుకుంటుంది. అలాగని తీవ్రవాదాన్ని బూచిగా చూపించి మనల్ని చర్చలకు తలొగ్గేలా చేయాలనుకుంటే కుదిరేపని కాదు. ఆ మాటే ఆ మధ్య జైశంకర్‌ కుండబద్దలు కొట్టారు. 

జైశంకర్‌ సోమవారం వ్యాఖ్యానించినట్టు, అనేక దశాబ్దాలుగా సీమాంతర తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్‌ పద్ధతులను యూరోపియన్‌ దేశాలు సహా అంతర్జాతీయ సమాజం నిర్ద్వం ద్వంగా ఖండించకపోవడం మరీ ఘోరం. తీవ్రవాదాన్ని సహించబోమని జబ్బలు చరిచే అమెరికా సైతం భారత్‌తో భుజం భుజం కలుపుతూనే, పాక్‌తోనూ మంచిగా ఉంటోంది. 2018లో ట్రంప్‌ హయాంలో పెట్టిన నిషేధాన్ని తొలగిస్తూ, బైడెన్‌ హయాంలో అమెరికా గత ఏడాది పాక్‌తో ఎఫ్‌16 విమానాల ఒప్పందం పునరుద్ధరించింది. తీవ్రవాద వ్యతిరేక పోరాటంలో పాక్‌ భాగస్వామి గనకనే ఈ సైనిక, రక్షణ సాయమన్న అమెరికా మాట అతి పెద్ద జోక్‌. ఇక, ఇటీవలే భారత్, పాక్‌లలో దేన్నీ తాము వదులుకోలేమంటూ విదేశాంగ ప్రతినిధి చేసిన వ్యాఖ్య అగ్రరాజ్యపు నైజానికి తార్కాణం. 

మాదక ద్రవ్యాలు, అక్రమ ఆయుధాల వ్యాపారం సహా అంతర్జాతీయ నేరాలెన్నో ముడిపడిన సీమాంతర తీవ్రవాదాన్ని కేవలం ఫలానా దేశపు తలనొప్పి లెమ్మని ఊరకుంటే ముప్పు మీదకొ స్తుంది. రోజూ తీవ్రవాదుల్ని భారత్‌కు ఎగుమతి చేస్తున్న పొరుగుదేశం పక్కలో పాము లాంటిదే. గతంలో హిల్లరీ క్లింటన్‌ అన్నట్లు, ‘పెరట్లో పాములను పెట్టుకొని, అవి కేవలం పొరుగువాణ్ణే కాటేస్తాయనుకుంటే పొరపాటే!’ ఆ సంగతి అమెరికా సహా అంతర్జాతీయ దేశాలన్నీ గ్రహించాలి.

భారత్‌  సైతం పాక్‌పై అంతర్జాతీయ వేదికలపై ధ్వజమెత్తుతూనే, అమెరికా పైనా కన్నేసి ఉంచాలి. మన పాలకులు కశ్మీర్‌ లోయలో పండిట్లు సహా స్థానికులపై తీవ్రవాద దాడులు 2019 తర్వాత పెరిగిన చేదునిజాన్ని గుర్తించాలి. తీవ్రవాదుల్ని కాక తీవ్రవాదాన్ని అంతం చేసే పనికి దిగాలి. స్థానికుల ఆశలు, ఆకాంక్షలకు పెద్ద పీట వేస్తూ, వారే పాలకులయ్యేలా చూడాలి. సానుకూల వాతావరణం కల్పించి, ఇప్పటికే అపరిమితంగా ఆలస్యమైన అసెంబ్లీ ఎన్నికలను జరిపించి, స్థానిక ప్రభుత్వ ఏర్పాటుతో ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. ఇప్పుడు అదే మార్గం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement