‘‘ముందింత పని పెట్టుకుని ఇప్పుడు మంత్రివర్గ విస్తరణేంటి బొమ్మై.. ఎన్నికలు కానివ్వు..’’ అని విసుగ్గా ముఖం పెట్టారు అమిత్‌షా. నేను నవ్వుముఖం పెట్టాను. ఇచ్చేవాళ్లు ఏ ముఖమైనా పెట్టొచ్చు. అడిగి తీసుకోడానికి వెళ్లినవాళ్లు ముఖాన్ని సెల్ఫ్ కంట్రోల్‌లో పెట్టుకోవాలి. ‘‘పీక్కుతింటున్నారు అమిత్‌జీ! ‘2023లో ఎలక్షన్స్ పెట్టుకుని ఇంకా ఎప్పుడు మంత్రి పదవులు ఇస్తారు? ఎప్పుడు మమ్మల్ని ప్రజాసేవ చేయనిస్తారు?’ అని అడుగుతున్నారు..’’ అన్నాను.. నవ్వుముఖంతోనే. ‘‘ఎవరు ఆ ప్రజాసేవకులు?’’ అని అడిగారు అమిత్‌షా. అసెంబ్లీలో అందరూ ప్రజా సేవకులే అయినప్పుడు నేను బసనగౌడ పేరో, రేణుకాచార్య పేరో ఎందుకు చెప్పాలి? ‘‘ముప్పై నాలుగులో నాలుగు ఖాళీగా ఉన్నాయి అమిత్‌జీ! ఆ నాలుగూ భర్తీ చేసి, పనిలో పనిగా చిన్న చిన్న మార్పులు చేర్పులు చేస్తే ఎవరి నియోజకవర్గాలకు వాళ్లు వెళ్లి, ఎవరి పనుల్లో వాళ్లు పడతారు’’ అన్నాను.
‘‘ఇప్పుడదా స్టేట్‌లో సమస్య బొమ్మై?!’ అన్నారు అమిత్‌షా. ‘‘ఇంకో సమస్య కూడా ఉంది అమిత్‌జీ! అయితే ఆ సమస్యని హైకోర్టు చూసు కుంటోంది. సుప్రీంకోర్టు చూసుకుంటా నంటోంది. ఇంకా.. ఒవైసీ చూసుకుంటు న్నారు. పాకిస్తాన్ మంత్రులు చూసు కుంటున్నారు. యూపీలో ప్రియాంకా గాంధీ చూసుకుంటున్నారు. ఢిల్లీలో కపిల్ సిబాల్ చూసుకుంటున్నారు. చెన్నైలో కమలహాసన్ చూసుకుంటున్నారు’’ అన్నాను. అమిత్‌షా చేతివాచీ చూసుకున్నారు. ‘‘సమస్యను మన దగ్గర్నుంచి ఎవరైనా లాగేసుకుంటే అది మన సమస్య కాకుండా పోతుందా బొమ్మై! పీక మీద రెండు సమస్యలు ఉన్నప్పుడు పీకకు ఏది ముఖ్యమైన సమస్యో నాయకుడికి తెలిసుండాలి. పీక మీద ఒకే సమస్య ఉన్నప్పుడు ఆ ఒక్క సమస్యా పీకకు ఎందుకు ముఖ్యం కాదో తెలుసుకోగలిగి ఉండాలి..’’ అన్నారు! ‘‘అలాగే అమిత్‌జీ’’ అన్నాను. అమిత్ షా దగ్గర్నుంచి నేరుగా జేపీ నడ్డా దగ్గరికి వెళ్లాను. ‘‘అరె! ఇంతక్రితమే నడ్డాజీ ఉత్తరాఖండ్ వెళ్లారే..’’ అన్నారు ఢిల్లీ పార్టీ ఆఫీస్‌లో.
నడ్డాకు ఫోన్ చేశాను. ‘‘హా.. బొమ్మైజీ! క్యాంపెయిన్‌లో బిజీగా ఉన్నాను. మీరెప్పుడన్నారూ.. ఢిల్లీకి వస్తున్నది?’’ అన్నారు!! నేను ఢిల్లీలోనే ఉన్నానని చెప్పకుండా.. ‘‘ఢిల్లీ వచ్చే ముందు ఫోన్ చేస్తాను నడ్డాజీ..’’ అన్నాను. ‘‘అవునా. గుడ్ గుడ్’’ అన్నారు. ఆ వెంటనే.. ‘‘ఎలా ఉంది బొమ్మైజీ.. మీ స్టేట్‌లో ప్రాబ్లమ్?’’ అని అడిగారు.‘‘నో ప్రాబ్లమ్ నడ్డాజీ..’’ అన్నాను. బెంగళూరు తిరిగి వచ్చేటప్పటికి నాకోసం బసనగౌడ, రేణుకాచార్య ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు! ‘‘కబురేమైనా ఉందా బొమ్మై సర్?’’ అని రేణుకాచార్య, బసనగౌడ అడిగారు. ‘‘ఉంది. ‘రెండు సమస్యలు ఉన్నప్పుడు రెండింటిలో ఏది ముఖ్యమైన సమస్యో నాయకుడికి తెలిసుండాలి. ఒకటే సమస్య ఉన్నప్పుడు ఆ ఒక్క సమస్య ఎందుకు ముఖ్యం కాదో తెలుసుకోగలిగి ఉండాలి..’ అని అమిత్‌షా నా భుజం తట్టి చెప్పారు..’’ అన్నాను. ‘‘ మరి.. రెండు సమస్యల్లో ఏది ముఖ్యమైనదో తెలిసి ఉండటం వల్ల, లేక.. ఉన్న ఒక్క సమస్యా అది ఎందుకు ముఖ్యమైనది కాదో తెలుసుకోగలిగి ఉండటం వల్ల మూడో సమస్య వస్తేనో..?’’ అన్నారు రేణుకాచార్య! ఒక నిర్ఘాంతపు దిగ్భ్రమతో ఆయన వైపు చూశాను.‘‘నడ్డాజీ ఏమైనా చెప్పారా బొమ్మై సర్?’’ అని బసనగౌడ. ‘‘చెప్పేవారేనేమో.. నా భుజం తట్టి చెప్పేంత దగ్గర్లో ఉన్నట్లయితే..’’ అన్నాను.
Comments
Please login to add a commentAdd a comment