ఒకప్పుడు ఎన్నికలొస్తున్నాయంటే జరగబోయే హింసను తలుచుకుని సాధారణ పౌరులు వణికి పోయేవారు. ప్రచార సమయంలోనేకాక, ఎన్నికలు పూర్తయ్యాక కూడా అవి నిరంతరాయంగా కొనసాగేవి. ముఖ్యంగా బిహార్, ఉత్తరప్రదేశ్ వంటివి ప్రచార సమయంలోనేకాక పోలింగ్ రోజునా, అనంతరకాలంలో కూడా హింసాత్మక ఘటనలు జరిగేవి. యథేచ్ఛగా రిగ్గింగ్ కొనసాగేది. అయితే టీఎన్ శేషన్ ప్రధాన ఎన్నికల కమిషనర్ అయిన తర్వాత అటువంటి హింసను గణనీయంగా తగ్గించగలిగారు. ఆ రాష్ట్రాల్లో పరిస్థితులు ఎంతో కొంత మెరుగుపడ్డాయి. అయితే అప్పటికీ, ఇప్ప టికీ మారనిది పశ్చిమ బెంగాల్. రాష్ట్రంలో ఎవరు అధికారంలోవున్నా అక్కడ ఈ హింస యథా తథంగా సాగుతోంది.
కొంత హెచ్చుతగ్గులే తప్ప పరస్పర దాడులు, విధ్వంసం వగైరాలు అదే బాణీలో కొనసాగుతున్నాయి. గత మూడు రోజులుగా దక్షిణ బెంగాల్ ప్రాంతంలోని బీర్‌భూమ్, హౌరా, బసీర్హత్, సోనార్‌పూర్, బర్థమాన్... ఉత్తర ప్రాంతంలోని దిన్హతా, సీతల్‌కుచిల్లో విచ్చల విడిగా హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. హత్యలు చేయడం, తలలు పగులకొట్టడం, ఇళ్లపై దాడులు అక్కడ నిత్యకృత్యమయ్యాయి. బీజేపీ, సీపీఎం, కాంగ్రెస్‌లు మూడూ ఈ విషయంలో తృణ మూల్ కాంగ్రెస్‌ను నిందిస్తున్నాయి. ఫలితాలు వెలువడినప్పటినుంచి మంగళవారం వరకూ 17 మంది హింసాకాండకు బలయ్యారు. తమ పార్టీకి చెందిన తొమ్మిదిమంది చనిపోయారని బీజేపీ అంటున్నది. కానీ తమ శ్రేణులనే లక్ష్యం చేసుకుని వేరే పార్టీలవారు దాడులు చేస్తున్నారన్నది తృణమూల్ ప్రత్యారోపణ.
మృతుల్లో ఆ పార్టీకి చెందినవారు ఆరుగురు చనిపోయిన మాట వాస్త వమే. మరో ఇద్దరు కాంగ్రెస్–సీపీఎంల సంయుక్త మోర్చాకి చెందినవారు. బెంగాల్‌లో అధికారమే లక్ష్యంగా మొన్నటి ఎన్నికల్లో హోరాహోరీ పోరాడిన బీజేపీ హింసాకాండను తీవ్రంగానే తీసుకుంది. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఘర్షణల్లో ప్రాణాలు కోల్పోయిన, గాయపడిన కార్యకర్తల కుటుం బాలను పరామర్శించటం, ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర గవర్నర్‌కు ఫోన్ చేసి హింసను ఆపడానికి చర్యలు తీసుకునేలా చూడాలని కోరారు. అటు కాంగ్రెస్ నేతలు, ఇటు సీపీఎం నేతలు సైతం మమతపై ఆగ్రహిస్తున్నారు. కేంద్ర బలగాలను శాంతిభద్రతల పరిరక్షణకు వినియోగించాలని, జరుగుతున్న ఘటనలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని సుప్రీంకోర్టులో రెండు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు కూడా దాఖలయ్యాయి.
తృణమూల్ కాంగ్రెస్ సాధించిన విజయం సామాన్యమైనది కాదు. ఎన్నో అవాంతరాలమధ్య ఆ పార్టీ మెజారిటీ ప్రజల ఆమోదం పొందగలిగిందనడంలో సందేహం లేదు. అయితే నెగ్గిన పక్షం ఆ విజయాన్ని వినమ్రంగా స్వీకరించాలి. లేనట్టయితే ఓటేసినవారు సైతం ఎందుకు వేశామా అని చింతించే పరిస్థితి వస్తుంది. అవతలి పార్టీవారు రెచ్చగొట్టి దాడులు చేయడం వల్ల తమ శ్రేణులు ప్రతిదాడులు చేస్తున్నాయన్న తర్కం చెల్లదు. తమ శ్రేణుల్ని చెప్పుచేతల్లో పెట్టుకోవాల్సిన బాధ్యత నాయకులకు వుంటుంది. ఎందుకంటే హింస ఎటువైపు మొదలైనా, దాన్ని మొగ్గలోనే తుంచకపోతే చెడ్డపేరు వచ్చేది అధికార పక్షానికే. గెలుపు దానికదే అంతిమ కర్తవ్యం కాదు. గెలిచాక ఎంత మెరు గైన పాలన అందిస్తున్నామన్నది, సాధారణ పౌరుల జీవనం సజావుగా, ప్రశాంతంగా సాగేందుకు ఏం చేస్తున్నామన్నది ప్రధానం. ఎన్నికలై అధికారంలోకొచ్చిన ప్రభుత్వంపైనా, అధికార పార్టీపైనా తొలినాళ్లలో ప్రత్యేక దృష్టి వుంటుంది.
వారి అడుగులు ఎటు పడుతున్నాయో, ఎలాంటి విధానాలు, కార్యక్రమాలు అమలు చేయబోతున్నారో అందరూ చూస్తుంటారు. మమత వరసగా మూడోసారి బుధవారం ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. సాంకేతికంగా మంగళవారం వరకూ శాంతి భద్రతలతోసహా ప్రభుత్వ వ్యవహారాలన్నీ ఎన్నికల సంఘం పర్యవేక్షణలోనే కొనసాగాయి. అయితే తమ పార్టీవారిని నిరోధించడానికి అదేమీ అడ్డంకి కాదు. ఫలితాలు వెలువడిన వెంటనే తమిళ నాడులో డీఎంకే కార్యకర్తలు రోడ్లపైకొచ్చి అమ్మ క్యాంటీన్లు రద్దు చేయాలంటూ వీరంగం వేస్తే పార్టీ అధ్యక్షుడు, కాబోయే ముఖ్యమంత్రి స్టాలిన్ అందుకు కారకులైనవారిని పార్టీనుంచి సస్పెండ్ చేస్తు న్నట్టు ప్రకటించారు. ఆ పనే మమత కూడా చేయొచ్చు. ప్రశాంతంగా వుండాలని ఆమె కోరిన మాట వాస్తవమే అయినా పార్టీ పరంగా ఏం చర్యలు తీసుకున్నారన్నది కూడా ముఖ్యం. అటు బీజేపీ సైతం దీన్ని తన ప్రయోజనాల కోసం వాడుకోవడానికి ప్రయత్నిస్తోంది.
రాష్ట్రపతి పాలన విధించడానికి ఇదంతా చేస్తున్నారన్న తృణమూల్ ఆరోపణల్లో నిజానిజాల మాటలావుంచి, బాధితుల గురించి మతప్రాతిపదికన ప్రస్తావించటం బీజేపీకి తగదు. మృతుల్లో, గాయపడినవారిలో అన్ని మతాలవారూ వున్నారు. బాధ్యతాయుత నేతలు నోరు జారితే అవి శాశ్వత విద్వేషాలకు బీజాలవుతాయి. ఇంతవరకూ బెంగాల్‌లో పార్టీల మధ్య కొట్లాటలున్నాయి, హత్యలు జరిగాయి. అయితే అదృష్టవశాత్తూ ఏవీ మతం రంగు పులుముకోలేదు. ఎప్పుడో దేశ విభజన సమయంలో దేశంలోని ఇతర ప్రాంతాలతోపాటు బెంగాల్ కూడా ఎన్నో విషాదాలను చవిచూసింది. అవి మళ్లీ తలెత్తకూడదు. అసెంబ్లీ ఎన్నికల పర్వంలో అందరూ కలిసి రాజేసిన విద్వేషాలు చాలు. వాటినుంచి బయటపడటానికి చాలా సమయం పడుతుంది. ఇప్పుడు బెంగాల్‌కు కావలసింది ఉపశ మనం. జరుగుతున్న హింసపై నిష్పాక్షికంగా విచారణ జరిపించి కారకులెవరైనా కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment