ప్రయాణమంటే... సుఖవంతంగా సాగాలని కోరుకుంటాం. సుఖంగా, సౌకర్యంగా, సత్వరంగా, సకాలంలో చేరడం కోసమే విమాన ప్రయాణాలను ఎంచుకుంటాం. కానీ, మన దేశంలో ఇప్పుడు అవి నరకప్రాయంగా మారుతున్నాయా? కొండవీటి చేంతాడంత క్యూలు... బోర్డింగ్ కోసం గంటల కొద్దీ నిరీక్షణ... చీకాకుపరిచేటన్ని చెకింగ్‌లు... నిలిచే జాగా లేని రద్దీ... ఎటుచూసినా లగేజ్... ట్రాలీల కొరత... విమానాల జాప్యం... ఇదీ ఇప్పుడు పరిస్థితి.
రోజూ 1200 విమానాలతో, ఏటా 6.9 కోట్ల ప్రయాణికులతో దేశంలోకెల్లా బిజీగా ఉండే ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో గత వారంగా ఇవే దృశ్యాలు. ఎయిర్‌పోర్ట్ కాస్తా చేపల బజారులా తయారైందంటూ ఫోటోలు సోషల్ మీడియాలో వెల్లువెత్తాయి. సాక్షాత్తూ పౌర విమానయాన మంత్రి సోమవారం ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకొని, రద్దీ నివారణ చర్యలపై చర్చించాల్సి వచ్చింది. దేశవ్యాప్తంగా విమానాశ్రాయాల్లోని లోటుపాట్లపై దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని గుర్తు చేసింది.
ప్రస్తుతం గంటలో గమ్యం చేరే దేశీయ విమాన ప్రయాణికులు సైతం గడువు కన్నా కనీసం మూడున్నర గంటల ముందే ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో రిపోర్ట్ చేయాల్సిన దుఃస్థితి. వేరే లగేజ్ లేకుండా, 7 కిలోల హ్యాండ్ బ్యాగేజీ ఒక్కటే తెచ్చుకొమ్మని ఇండిగో లాంటి విమానయాన సంస్థలు సూచి స్తున్న పరిస్థితి. దేశంలోకెల్లా అతి పెద్దదైన ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో టీ1, టీ2, టీ3 అని మూడు టెర్మినల్స్ ఉన్నాయి.
అంతర్జాతీయ విమాన సర్వీసులతో పాటు కొన్ని దేశీయ సర్వీసులూ టీ3 నుంచే నడు స్తుంటాయి. తాజా పరిణామాలతో రద్దీ ఎక్కువగా ఉండే కీలక సమయాలైన ఉదయం, సాయంత్ర వేళల్లో విమానాల సంఖ్యను తగ్గించాలనే యోచన చేస్తున్నారు. కొన్ని సర్వీసులను టీ3 నుంచి ఇతర టెర్మినల్స్‌కు మార్చాలని భావిస్తున్నారు. అయితే, ఇవన్నీ తాత్కాలిక ఉపశమనాలే. పది రోజుల్లో సమస్యలన్నీ పరిష్కరిస్తామంటున్న మంత్రివర్యులు దృష్టి పెట్టాల్సింది శాశ్వత పరిష్కారాలపైన!
ఒక్క ఢిల్లీలోనే కాదు... పుణే, ముంబయ్, బెంగళూరుల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి. హైదరాబాద్‌లో సైతం మొన్నటిదాకా వేర్వేరుగా ఉన్న జాతీయ, అంతర్జాతీయ ప్రయాణికుల నిష్క్రమణ మార్గాన్ని ఇటీవల టెర్నినల్ విస్తరణ కోసమంటూ ఒకేచోటకు మార్చారు. అలా ఒకేచోట జనం కేంద్రీకృతమై, ఒత్తిడి పెరిగినట్లు వార్త. ప్రపంచీకరణతో పెరుగుతున్న రద్దీకి తగ్గట్టు కొన్నేళ్ళుగా దేశంలో పలు విమానాశ్రయాల ఆధునికీకరణ సాగింది.
తీరా ఢిల్లీ వ్యవహారంతో అవన్నీ భవిష్యత్ అవసరాలకు తగ్గట్టు జరగలేదని అనుమానం కలుగుతోంది. కొత్తగా గోవాలో మోపా వద్ద కట్టిన ఎయిర్ పోర్ట్ యాత్రిక సామర్థ్యం 44 లక్షలే. అది ఇప్పటికే ఉన్న డాబోలిమ్ ఎయిర్‌పోర్ట్ కన్నా తక్కువ సత్తా కావడం విడ్డూరం.
అనేక దేశాల్లో కోవిడ్ నిర్బంధాలు ఎత్తివేసేసరికి దేశీయంగా, అంతర్జాతీయంగా కసికొద్దీ ప్రయాణాలు చేయడం పెరిగింది. ఇబ్బడిముబ్బడైన ఈ జనంతో ఎయిర్‌పోర్టుల్లో, ఎయిర్‌లైన్స్‌లో ఇప్పుడున్న వసతులపై ఒత్తిడి అధికమైంది. గత ఆదివారం ఒక్క ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ నుంచే 4.27 లక్షల మందికి పైగా ప్రయాణించారనేది పరిస్థితికి చిరు సూచన.
కోవిడ్ నిబంధనలు ఎత్తేశాక ఈ ఏడాది జూలైలో యూరప్‌లోని పలు విమానాశ్రయాల్లో ఇలాంటి గందరగోళమే నెలకొంది. లండన్‌లోని ప్రసిద్ధ హీత్రూ విమానాశ్రయంలోనూ ఇదే కథ. కరోనా కాలంలో విస్తరణ ప్రణాళిక లకు బ్రేకులు పడ్డ విమానాశ్రయాలు ఇప్పుడు మళ్ళీ ఆ పనులను పట్టాలెక్కించాల్సి ఉంది.
ప్రయాణికుల చెకింగ్ పద్ధతి ప్రకారం సాగకపోవడం, విమానాశ్రయ అధికారుల్లో అలసత్వం లాంటి కారణాలతో ఢిల్లీలో గందరగోళం నెలకొంది. ఎయిర్‌లైన్స్ చెక్–ఇన్ కౌంటర్లలో సిబ్బంది లేకపోవడం, ఉన్నా అరకొరగా ఉండడం రద్దీకి దారి తీస్తోంది. సెక్యూరిటీ చెక్ చేయాల్సిన నిపుణు లైన కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్‌ఎఫ్) సిబ్బంది కూడా తక్కువున్నారు.
సీఐఎస్‌ఎఫ్ ఉద్యోగాలను 3 వేలకు పైగా రద్దు చేసి, వాటి స్థానంలో అనుభవం లేని 2 వేల కన్నా తక్కువ ప్రైవేట్ భద్రతా సిబ్బందిని పెట్టడం లాంటి స్వీయ తప్పిదాలు సవాలక్ష. వీటిని తక్షణం సరిదిద్దాలి. బ్యాగేజ్, బిల్లింగ్ నుంచి బోర్డింగ్ దాకా అన్నిటా 5జి సహా ఆధునిక సాంకేతికతను ఆశ్రయించడం ఓ మార్గం. అంతర్జాతీయ ప్రయాణం చేసి వస్తున్నవారి ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ ఇప్పటికీ గంటన్నర నుంచి రెండు గంటలు పడుతోంది. ప్రస్తుతానికి విమానంలోనే వివరాలు నింపే పద్ధతి పెడతా మంటున్నా, డిజిటలీకరణ మంచి పరిష్కారం.
సంవత్సరాంతపు సెలవులు, పండగలతో రానున్నది ప్రయాణాల కాలం. దాంతో, రానున్న రోజుల్లో పరిస్థితి మరింత దిగజారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు కావాల్సింది సరైన వ్యూహరచన, ప్రణాళికాబద్ధంగా ప్రాథమిక వసతులు. కౌంటర్లనూ, సిబ్బందినీ పెంచాలి. స్మార్ట్ సిటీల్లా స్మార్ట్ ఎయిర్‌పోర్ట్‌లు కావాలి. ప్రపంచశ్రేణి టెర్మినల్స్ ఏర్పాటు చేయాలి.
ఇప్పటికైనా ఢిల్లీ, హైదరాబాద్, ముంబయ్ – ఇలా ఊరికో రకం కాక అన్నిచోట్లా ఒకే ప్రామాణిక సెక్యూరిటీ ప్రోటోకాల్ తేవాలి. ముఖం చూసి గుర్తించే బయోమెట్రిక్ పద్ధతే అదే బోర్డింగ్ పాస్‌గా ‘డిజి యాత్ర’ విధానాన్ని ఇటీవలే 3 ఎయిర్‌పోర్టుల్లో తెచ్చారు. మొక్కుబడిగా కాక దాన్ని అన్నిచోట్లా విస్తరించడం, అవగాహన పెంచడం అవసరం. ప్రపంచంలోని 10 రద్దీ విమానాశ్రయాల్లో ఢిల్లీ, ముంబయ్ చేరనున్న వేళ ఇలాంటి క్షేత్రస్థాయి అంశాలపై శ్రద్ధ కీలకం. అలసత్వం వహిస్తే, పదేపదే ఢిల్లీ కథే!
ఈ ప్రయాణం నరకప్రాయం!
Published Wed, Dec 14 2022 12:36 AM | Last Updated on Wed, Dec 14 2022 12:36 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment