భోగం మీది, త్యాగం మాదా? | Sakshi Editorial On G 7 Meeting | Sakshi
Sakshi News home page

భోగం మీది, త్యాగం మాదా?

Published Tue, Jun 15 2021 3:05 AM | Last Updated on Tue, Jun 15 2021 12:21 PM

Sakshi Editorial On G 7 Meeting

పేద దేశాల పట్ల ప్రకృతికే కాదు, అభివృద్ధి సమాజాలకూ జాలి ఉండదా? మానవ చేష్టల వల్ల పుట్టిన ‘వాతావరణ మార్పు’ దుష్ప్రభావాలు పేద దేశాలపై ఉన్నంతగా సంపన్న దేశాలపైన లేవు. ప్రకృతి వనరుల్ని అసాధారణ రీతిలో పిండుకొని ఎదిగిన ‘అభివృధ్ధి చరిత్ర’ కొన్ని సమాజాలది! పైగా వాతావరణ మార్పులకు కారణమౌతున్న నేటి కర్భన ఉద్గారాలు, ఇతరేతర కాలుష్యాలు, భూతాపోన్నతి వంటివి ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాల సృష్టే! అప్పుడు, ఇప్పుడు, తాజా ఆంక్షల వల్ల శీఘ్రప్రగతి కుంటుబడి రేపు.. బలవుతున్నది మాత్రం పేద దేశాలే! సదరు నష్టాన్ని పూడుస్తామని... ఎన్ని అంతర్జాతీయ సదస్సుల్లో వాగ్దానాలిచ్చి చివరకు ఒప్పంద రూపు సంతరింపజేసినా, ఆశించినట్టు అవి ఆచరణకు నోచుకోవు. పేద, మధ్య తరహా దేశాలు వాతావరణ మార్పు విపరిణామాల నుంచి, ప్రకృతి వైపరిత్యాల నుంచి బయటపడలేక... మరింత ప్రాణ, ఆస్తి నష్టాల్ని చవిచూస్తున్నాయి.

అభివృద్ధి చెందిన సంపన్నదేశాలకు, అభివృద్ధి చెందని పేద దేశాలకు మధ్య అంతరాలను పూడ్చే సంగతెలా ఉన్నా... మానవ ప్రమేయం వల్ల కాలక్రమంలో జరిగిన తప్పిదాలను సరిదిద్దే చర్యల్లోనూ పురోగతి మిథ్య!  పేద దేశాలను ఆదుకునేందుకు అభివృద్ధి చెందిన దేశాలు వెచ్చిస్తామని చెప్పిన ‘వాతావరణ ఆర్థిక సహాయం’ పుష్కర కాలం దాటినా ఇంకా ఓ రూపు సంతరించుకోకపోవడం శాపమే! ప్రపంచంలోని ఏడు అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలైన జి–7 (అమెరికా, కెనెడా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్‌) దేశాల సదస్సు, ఈ ‘సహాయం’పై మరోమారు చేసిన తాజా వాగ్దానమే ఇందుకు నిదర్శనం! యునైటెడ్‌ కింగ్డమ్‌ (యూకే) కార్బిస్‌బే లో ఆదివారం ముగిసిన ఈ సదస్సు వేదిక నుంచి మరోమారు హామీ అయితే లభించిది కానీ, లిఖిత పత్రంలో స్పష్టత కొరవడింది. ఎవరెంత వెచ్చిస్తారో నిర్దిష్ట ఆర్థిక సహాయం, నగదు గురించిన వివరాలేమీ లేవు.

అందుకే పర్యావరణ పోరాట సంఘాలు పెదవి విరుస్తున్నాయి. ఏటా వంద బిలియన్‌ డాలర్ల (రూ.7.32 లక్షల కోట్లు) వాతావరణ ఆర్థిక వనరుల్ని సమకూర్చే పాత హామీ నెరవేరుస్తామని, ఈ వారమే కార్యాచరణ ప్రారంభిస్తామని సదస్సు పేర్కొంది. ‘ఇది మా బాధ్యత’ అని ఆతిథ్య దేశం బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ చెప్పారు. ప్రపంచ కర్బన ఉద్గారాల్లో అయిదో వంతు (20%) జి–7 దేశాల పుణ్యమే! అని కూడా ఆయన అంగీకరించారు. ‘మా వంతు కేటాయింపులు పెంచుతాం, ఇతర అభివృద్ది చెందిన దేశాలనూ పెంచమని అడుగుతూ... ఉమ్మడిగా ఈ హామీ నెరవేర్చడానికి కృషి చేస్తాం’ అని సదస్సు పేర్కొంది. అతిథిగా పాల్గొన్న భారత్‌ కూడా, హామీ నిలబెట్టుకోవాలని జి–7 ను అంతకు ముందు కోరింది.

కర్బన ఉద్గారాలు, ఇతర కాలుష్యాల వల్ల భూతాపోన్నతి పెరిగి, ధృవాల మంచు కరిగి సముద్రమట్టాలు పెరుగుతున్నాయి. పలు దీవులు, సముద్ర తీరనగరాలు మునిగే ప్రమాదంతో పాటు ఇంకెన్నో ప్రకృతి అనర్థాలు ఈ వాతావరణ మార్పు వల్ల ముంచుకొస్తున్నాయి. ఉష్ణాగ్రత తదుపరి పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్‌కే నియంత్రించడం ఇప్పుడు ప్రపంచ దేశాల ముందున్న లక్ష్యం. వాతావరణ మార్పు వల్ల పుట్టే విపత్తుల్ని తట్టుకునే సన్నద్దత, ఎదుర్కొనే సమర్ధత, మార్పులకు అనుగుణంగా జీవనాన్ని దిద్దుకునే సంసిద్ధత అవసరం! పెట్రోల్, బొగ్గు వంటి శిలాజ ఇంధన వినియోగాల్ని తగ్గించి, ప్రత్యామ్నాయ పునర్వినియోగ, సుస్థిర ఇంధనాల్ని సమకూర్చుకోవాలి. ఈ క్రమంలో ప్రగతి మందగించినా పేద దేశాలు భరించాలి.

అవసరమైన ఆధునిక టెక్నాలజీని సమకూర్చుకోవాలి. అందుకు గాను అభివృద్ధి చెందిన, సంపన్న దేశాలు సహకారం అందించాలి. ఇదివరకే ప్రకృతిని పిండుకొని ఎదిగిన సమాజాలు కనుక, ‘అందరి కోసం అందరు, కొందరికి ప్రత్యేక బాధ్యత’ నినాదంతో కర్తవ్యాన్ని నెత్తినెత్తుకోవాలి. ఈ స్ఫూర్తితో అభివృద్ధి చెందిన దేశాలు ఏటా 100 బిలియన్‌ డాలర్లను ‘క్లైమెట్‌ ఫైనాన్స్‌’కి వెచ్చిస్తామని, ఐక్యరాజ్యసమితి 2009 (కొపన్‌హెగెన్‌)లో నిర్వహించిన సదస్సులో నిర్దిష్టంగా హామీ ఇచ్చాయి. 2020 నాటికి కేటాయింపులు మొదలు కావాలి. ఆర్థిక సహాయంతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని పేద దేశాలకు బదలాయించాలి. తర్వాత జరిగిన పలు సదస్సుల్లో ఈ హామీని నొక్కి చెప్పాయి. పారిస్‌ భాగస్వామ్య పక్షాల సదస్సు (2015)లోనూ ఈ అంశం సుదీర్ఘంగా చర్చించి, ఒప్పందాలపై సంతకాలు చేశారు. కార్యాచరణ మాత్రం లేదు. తాజా హామీ ప్రకారమూ 2025 నాటికి తొలి కేటాయింపులు జరుగొచ్చనేది ఆశ!

సంపన్న దేశాల సహాయం లభించినా... మౌలికసదుపాయాలు కల్పించే ఏ పెట్టుబడిదారో, కాంట్రాక్టరో, రాబడి పలు రెట్లు పెంచుకుంటారు. పేదలకు దక్కేది పరోక్ష ప్రయోజనాలే! అసాధారణ ఎండకు వడదెబ్బ తగిలి ఓ నడివయస్కుడు శ్రీకాకుళంలో మరణిస్తాడు. అప్పుతెచ్చిన పెట్టుబడితో పండిన పంట వడగళ్ల వానకు నాశనమైతే మహబూబ్‌నగర్‌ రైతొకరు ఆత్మహత్య చేసుకుంటాడు. మూడేళ్ల వరుస కరువుకు బతుకు గడువక వలస కూలీగా ఉత్తర్‌ప్రదేశ్‌ వెళ్లిన అనంతపురం జిల్లా కదిరి పరిధి పల్లె గృహిణి, విధివక్రించి అక్కడ పడుపు వృత్తిలోకి జారి ఎయిడ్స్‌ సోకి మరణిస్తుంది.... ఇవన్నీ ‘వాతావరణ మార్పు’ మరణాలే! ఏ అభివృద్ధి చెందిన దేశపు ఆర్థిక సహాయం ఈ చావుల్ని ఆపుతుంది?  సమాధానం లేని ప్రశ్నలే! 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement