ఇంటి దీపమని ముద్దాడితే మీసాలు తెగకాల్చిందని సామెత. మణిపుర్‌లో కల్లోలం జాడలు కనబడి నప్పుడు అక్కడున్నది ‘డబుల్ ఇంజన్’ సర్కారే కదా అని ఉపేక్షించిన కేంద్ర ప్రభుత్వానికి తదుపరి కర్తవ్యం బోధపడటం లేదని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి.
సోమవారం ప్రారంభం కావాల్సిన మణిపుర్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల గురించి 24 గంటలు గడిచినా అతీగతీ లేకపోవటం దాన్నే సూచిస్తోంది. ఆగస్టు మూడోవారంలో అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నామని గత నెల 27న కేబినెట్ భేటీ తర్వాత ముఖ్యమంత్రి ఎన్. బీరేన్ సింగ్ ప్రకటించారు. అందుకు సంబంధించిన సిఫార్సును ఈనెల 4న లాంఛనంగా గవర్నర్ అనసూయ ఊకే ఆమోదానికి పంపారు.
అసెంబ్లీ ప్రోరోగ్ అయింది గనుక నిబంధనల ప్రకారం పక్షం రోజుల ముందు అసెంబ్లీ సమావేశాలపై రాజ్‌భవన్ నుంచి నోటిఫికేషన్ వెలువడాలి. కానీ ఆశ్చర్యకరంగా అలాంటిదేమీ జరగలేదు. హింసాకాండ మొదలై నాలుగు నెలలు గడిచినా ఇంతవరకూ రాష్ట్రంలో ప్రశాంతత ఏర్పడలేదన్నద వాస్తవం. హత్యాకాండలో 160 మందికి పైగా మరణించగా వందలాది మంది పౌరులు గాయ పడ్డారు. బాధితులు ఇప్పటికీ సహాయ శిబిరాల్లో తలదాచుకునే పరిస్థితులే ఉన్నాయి. భద్రతా బల గాలు సోదాలు నిర్వహిస్తూ పోలీస్ స్టేషన్ల నుంచి అపహరించిన మారణాయుధాలు, మందుగుండు స్వాధీనం చేసుకుంటున్నాయి. వివిధ నేరాలతో సంబంధమున్నదని భావిస్తున్న దాదాపు 1,500 మందిని అరెస్టు చేశారు. అయినా చెదురుమదురుగా ఎక్కడో ఒకచోట హింసాత్మక ఘటనలు జరుగు తూనే ఉన్నాయి.
మరోపక్క కొండ ప్రాంతాలకు నిత్యావసర సరుకులు సరఫరా కాకుండా ప్రత్యర్థి మైతేయి తెగ అడ్డుకుంటున్నదని ఆరోపిస్తూ ఇంఫాల్–అస్సాంలోని సిల్చార్‌ల మధ్య ఉన్న 37వనంబర్ జాతీయ రహదారిని కుకీలు దిగ్బంధించారు. ఇంఫాల్–నాగాలాండ్‌లోని దిమాపూర్ మధ్య గల రెండో నంబర్ జాతీయ రహదారిపై సైతం ఉద్యమకారుల దిగ్బంధంతో వందలాది వాహనాలు నిలిచిపోయాయి. భద్రతా బలగాలు రంగంలోకి దిగినా పరిస్థితి ఇంకా పూర్తిగా మెరుగుపడలేదని మీడియా కథనాలు చెబుతున్నాయి.
సమస్యల వలయం నుంచి మణిపుర్ ఇంకా బయటపడలేదన్నది నిజం. అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తే భద్రతా కారణాల రీత్యా తాము హాజరుకావటం అసాధ్యమని వివిధ పార్టీల్లోని కుకీ తెగ శాసనసభ్యులు పదిమంది గవర్నర్‌కు విడివిడిగా వినతిపత్రాలు పంపిన మాట కూడా వాస్తవం.
ఇందులో ఇద్దరు సభ్యులున్న అధికార కూటమి భాగస్వామ్య పార్టీ కుకీ పీపుల్స్ అలయెన్స్ కూడా ఉంది. నాగా తెగకు చెందిన మరో పదిమంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరు కావొద్దని మణిపుర్‌లోని యునైటెడ్ నాగా కౌన్సిల్ (యూఎన్‌సీ) కోరడాన్ని విస్మరించలేం. అంతేకాదు, అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించి రాష్ట్ర సమగ్రత పరిరక్షణకు తీర్మానం చేయాలని మైతేయిలకు ప్రాతినిధ్యం వహిస్తున్న మణిపుర్ సమగ్రత సమన్వయ కమిటీ (కొకోమీ) గత జూలైలో జరిపిన ర్యాలీలో మాండ్ చేయటం కూడా వాస్తవమే. అలాగని కేబినెట్ సిఫార్సుపై గవర్నర్ మౌనం వహించటం సరికాదు.
రాష్ట్రంలో ప్రజలెన్నుకున్న ప్రభుత్వం ఉనికిలో ఉంది. 60 మంది సభ్యులుండే అసెంబ్లీలో ముఖ్యమంత్రి బీరేన్ సింగ్‌కు ఇప్పటికైతే మెజారిటీ ఉంది. ఆయనకు మద్దతు ఉపసంహరించుకుంటున్నామని ఎమ్మెల్యేలు ఎవరూ ప్రకటించలేదు. అసెంబ్లీ కూడా రద్దు కాలేదు. మణిపుర్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గత మార్చిలో జరిగాయి.
రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఆరు నెలల్లోగా వర్షా కాల సమావేశాలు నిర్వహించాల్సివుంది. అంటే వచ్చే నెల 2లోగా అసెంబ్లీ సమావేశం కావాలి. అటువంటప్పుడు నోటిఫికేషన్ విడుదల చేయకపోతే అది రాజ్యాంగ సంక్షోభానికి దారితీయదా? గవర్నర్ విధి నిర్వహణ మంత్రివర్గం సలహాలకు లోబడివుంటుందని రాజ్యాంగంలోని 163వ అధి కరణ చెబుతోంది. అసెంబ్లీ సమావేశాల నోటిఫికేషన్ లేదా దాని ప్రోరోగ్, అసెంబ్లీ రద్దు అధికా రాలు గవర్నర్‌కు ఉంటాయని 174వ అధికరణ వివరిస్తోంది. అయితే మంత్రివర్గాన్ని సంప్రదించి మాత్రమే ఈ అధికారాలను వినియోగించాల్సి వుంటుందని హిమాచల్ ప్రదేశ్ స్పీకర్ దాఖలు చేసిన కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం 2016లో తీర్పునిచ్చింది.
మణిపుర్‌లో రాజ్యాంగసంక్షోభం ఏర్పడిందని గవర్నర్ భావించివుండొచ్చు. ప్రభుత్వానికి తగిన మెజారిటీ లేదని అనుకొని వుండొచ్చు. అదేమిటో ప్రకటించి, తదనుగుణంగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత గవర్నర్‌కు లేదా? అంతా సవ్యంగా ఉందనుకుంటే సమావేశాల నోటిఫికేషన్ విడుదలకు అభ్యంతరం దేనికి?
సమస్యలున్నప్పుడే ప్రజలెన్నుకున్న సభల ప్రాధాన్యత పెరుగుతుంది. చుట్టుముట్టిన ఉద్రిక్త పరిస్థితులను ఉపశమింపజేయడానికి అనుసరించాల్సిన మార్గాలపై చర్చిస్తే, సభ్యుల అభిప్రా యాలు పరిగణనలోకి తీసుకుని నిర్దిష్టమైన కార్యాచరణ రూపొందిస్తే, ఏకగ్రీవ తీర్మానం ద్వారా ప్రజానీకానికి భరోసా ఇవ్వగలిగితే దాని ప్రభావం ఎంతో ఉంటుంది.
అందుకు భిన్నంగా గవర్నర్ వ్యవహరించటం రాజ్యాంగ విరుద్ధం మాత్రమే కాదు, రాజ్యాంగ సంక్షోభానికి దారి తీసే చర్య కూడా. చిత్రమేమంటే రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సిద్దార్థ్ మృదుల్‌ను నియమించాలన్న జూలై 5 నాటి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు ఫైలును మణిపుర్ సర్కార్ ఆమోదానికి కేంద్రం పంపింది. అదేమైందో తెలియదు. మణిపుర్‌లో సర్కారు ఉంటే అది సక్రమంగా పని చేస్తున్నదో లేదో తేల్చవలసిన బాధ్యత కేంద్రంపై ఉంది. నిరవధిక అనిశ్చితి మణిపుర్‌ను మరింత సంక్షోభంలోకి నెడుతుందని అందరూ గుర్తించాలి.
Comments
Please login to add a commentAdd a comment