
అపారమైన వనరులున్నా ఏనాడూ కంటి నిండా కునుకు లేని మెక్సికో ప్రజానీకం అధ్యక్ష ఎన్నికల్లో వరసగా రెండోసారి సైతం వామపక్ష మొరెనా పార్టీకి పట్టంగట్టారు. ఆరుపదుల వయసుగల యూదు మహిళ క్లాడియా షీన్‌బామ్‌ను అధ్యక్ష పీఠానికి ఎన్నుకున్నారు. రెండు శతాబ్దాల రిపబ్లిక్ చరిత్రలో మహిళ దేశాధినేత కావటం ఇదే ప్రథమం. జనాభాలో యూదులు అత్యల్ప సంఖ్యాకులు కావటం గమనించదగ్గది. వచ్చే అక్టోబర్‌లో ఆమె పదవీబాధ్యతలు చేపడతారు. ఆకలి,నిరుద్యోగం, డ్రగ్స్ విజృంభణ, వ్యక్తుల అదృశ్యం... ఒకటి కాదు, మెక్సికోను సవాలక్ష సమస్యలు పీడిస్తున్నాయి. అంతటా నిరాశా నిస్పృహలు అలుముకున్న తరుణంలో అంతవరకూవున్న రెండు పార్టీల వ్యవస్థను బద్దలుకొడుతూ మొరెనా పార్టీ రంగంలోకొచ్చింది. 2018లో ఆరేళ్లకాలానికి అధ్యక్షుడైన ఆండ్రస్ మ్యాన్యువల్ లొపెజ్ అబ్రడార్ (ఆమ్లో) ఆశించిన స్థాయిలో పాలించకపోయినా శాంతిభద్రతలను కాస్త అదుపు చేయగలిగారు.
అదే సమయంలో సంక్షేమపథకాలు అందించటం, మౌలిక సదుపాయాలు పెంచటం మొరెనా పార్టీని రెండోసారి అందలం ఎక్కించింది. అలాగని అంతా సవ్యంగా ఉందని కాదు. ఏడాదికి సగటున 30,000 హత్యలు జరగటం, అందులో 90 శాతం మిస్టరీగా మిగిలిపోవటం మెక్సికో ప్రత్యేకత. ఈ హత్యల్లో డ్రగ్స్ మాఫియాల వాటాతోపాటు, వాటిని అదుపు చేసే సాకుతో పారా మిలిటరీ దళాలు సాగించే నరమేధమూ ఉంటుంది. మారుమూల పల్లెల్లో ఏదో ఒకచోట హఠాత్తుగా ఖననం చేసిన శవాల గుట్టలు లేదా మాదకద్రవ్యాల డంప్‌లు బయటపడతాయి. అమెరికాకు చాటుగా వలసదారుల తరలింపు మరో పెద్ద వ్యాపారం. మూడునెలలక్రితం అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కొండ ప్రాంత ఆవాసాలపై మాదకద్రవ్య ముఠాలు డ్రోన్లతో బాంబుల వర్షం కురిపించి వందలాది పౌరులను హతమార్చటంతోపాటు ఇళ్లను దహనం చేశారు.
గ్రామస్థులు తమ సమాచారం పారా మిలిటరీ దళాలకు చేరేస్తున్నారన్నది వారి అనుమానం. ఈ అధ్యక్ష ఎన్నిక సందర్భంగా దాదాపు డజనుమంది అభ్యర్థుల్ని మాదకద్రవ్యాల ముఠా కాల్చిచంపింది. ఇన్ని సమస్యలతో సతమతమయ్యే దేశానికి అధ్యక్షురాలు కావటం నిజానికి కత్తి మీద సామే. చిత్రమేమంటే అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ఆమె శాంతిభద్రతల అదుపు కోసం ఏం చేస్తానన్నది చెప్పలేదు. కానీ మెక్సికో నగర మేయర్‌గా పనిచేసిన అనుభవం ఆమెకు అక్కరకొస్తుందన్న ఆశ జనానికి ఉంది. నగరాన్ని సీసీ కెమెరాలతో నింపడం, నేరాలు తరచూ జరిగే ప్రాంతాల్లో నిరంతరం పోలీసు బలగాలను మోహరించటం వంటివి హత్యలను గణనీయంగా తగ్గించాయని గణాంకాలు చెబుతున్నాయి. అయితే ఈ సంఖ్య వాస్తవాలను ప్రతిబింబించటం లేదన్నది విపక్షాల ఆరోపణ.
నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాగిన 1968 నాటి విద్యార్థి ఉద్యమంతో సహా అనేక సామాజికోద్యమాల్లో పాల్గొన్న యూదు కుటుంబంలో జన్మించటం వల్ల అటు రాజకీయాలపైనా, ఇటు పర్యావరణంపైనా ఆమెకు ఆది నుంచీ ఆసక్తి. అందుకే ఆ రంగంలో ఆమె పీహెచ్‌డీ చేయటంతోపాటు క్యాలిఫోర్నియా యూనివర్సిటీలో తన అధ్యయనాన్ని కొనసాగించి నైపుణ్యానికి పదును పెట్టుకున్నారు. పర్యావరణ పరిరక్షణకు కృషి చేసినందుకు 2007లో నోబెల్ పురస్కారాన్ని గెల్చుకున్న శాస్త్రవేత్తల బృందంలో క్లాడియా ఒకరు. 2018లో తెరపైకొచ్చిన మొరెనా పార్టీ ఆమెను సహజంగానే ఆకర్షించింది. వెంటనే మెక్సికో మేయర్ పదవి కూడా వరించింది.
ఆ పదవికి మహిళ ఎన్నిక కావటం కూడా అదే ప్రథమం. 31 రాష్ట్రాలూ, 13 కోట్ల జనాభాగల దేశంలో నేరాలను అరికట్టడం మెక్సికో నగరాన్ని దారికి తెచ్చినంత సులభం కాదు. చాలా రాష్ట్రాల్లో మాదకద్రవ్య ముఠాలు వాహన సముదాయాల్లో ఏకే–47 తుపాకులతో సంచరించటం, పోలీసులు సమాచారం అందుకుని వచ్చేలోపే హత్యాకాండ ముగించి నిష్క్రమించటం తరచు కనబడే దృశ్యాలు. తల్లిదండ్రుల ఆలనా పాలనాలేని పిల్లల్ని, యువతను చేరదీస్తామని వారిలో అమాయకంగా కనబడేవారికి ప్రాధాన్యమిచ్చి ఏళ్లతరబడి ఆయుధ శిక్షణ ఇచ్చి మాదకద్రవ్యాల పంపిణీకీ హత్యలకూ వినియోగిస్తామని మాదకద్రవ్య ముఠా నాయకుడొకరు చెప్పాడు. ఆ కోణంలో దృష్టి సారించి పాఠశాల విద్య నుంచే స్కాలర్‌షిప్‌లిచ్చే పథకాన్ని ఆమ్లో అమలుచేశారు. కానీ పెద్దగా ఫలించలేదు.
ఇవన్నీ అంతర్గత సమస్యలు. పొరుగునున్న అమెరికాతో అనేక పేచీలున్నాయి. ఆ దేశంలో ట్రంప్ తిరిగి అధికారంలోకి రాబోతున్నారన్న కథనాలు మెక్సికోకు ఇబ్బందిగానే ఉన్నాయి. ఆ దేశంనుంచి వలసలను అరికట్టడానికీ, మాదకద్రవ్యాలను కట్టడి చేయటానికీ సరిహద్దుల్లో గోడ నిర్మిస్తానని గతంలో ట్రంప్ ప్రకటించి పని మొదలెట్టినా బైడెన్ వచ్చాక ఆగిపోయింది. మరోపక్క లాటిన్ అమెరికా దేశాల్లో అమెరికాతో వాణిజ్యం నెరపే దేశాల్లో మెక్సికోయే నంబర్ వన్. అందువల్ల ఆ దేశాన్ని అంత సులభంగా అమెరికా వదులుకోలేదు.
పైగా మెక్సికో పరిశ్రమల్లో ఉత్పత్తయ్యే కార్ల విడిభాగాల వల్లే అమెరికాలోని డెట్రాయిట్‌లో కార్ల పరిశ్రమలు సజావుగా సాగుతున్నాయి. మెక్సికో పవన విద్యుత్‌తోనే అమెరికా తయారీరంగ పరిశ్రమలు లక్షలమంది అమెరికన్లకు ఉపాధినిస్తున్నాయి. హృద్రోగులకు వాడే పేస్‌మేకర్లు మొదలుకొని పండ్లు, కూరగాయలు, ఆహారధాన్యాల వరకూ చాలా భాగం మెక్సికో నుంచి రావాల్సిందే. అందుకే ఇరుదేశాల వాణిజ్యమూ నిరుడు 80 వేల కోట్ల డాలర్ల వరకూ సాగింది. కనుక నేరస్థముఠాలను అరికట్టి శాంతిభద్రతలు తీసుకురాగలిగితే మెక్సికో సుసంపన్న దేశాల్లో ఒకటై నిలుస్తుంది. క్లాడియా ఆ పని చేయగలరా అన్నదే పెద్ద ప్రశ్న.