మూలిగే నక్క మీద తాటిపండు పడడమంటే ఇదే! ఉత్తర అట్లాంటిక్ సైనిక కూటమి (నాటో)లో చేరడానికి ఉక్రెయిన్ ఉత్సాహపడుతోందని కోపగించి, కదనానికి కత్తి దూసిన రష్యాకు ఆ తలనొప్పి తగ్గకపోగా, ఇప్పుడు ఫిన్లాండ్ రూపంలో కొత్త తలనొప్పి వచ్చి పడింది. అమెరికా సహా మొత్తం 30 పాశ్చాత్య దేశాల కూటమి ‘నాటో’లో 31వ దేశంగా మంగళవారం ఫిన్లాండ్ అధికారికంగా చేరింది. దీంతో, రష్యాకు కంటి మీద కునుకు పట్టనివ్వకుండా ఆ దేశంతో ‘నాటో’ సభ్య దేశాల సరిహద్దు రెట్టింపయింది.
పాశ్చాత్య ప్రపంచంతో దీర్ఘకాలంగా ఘర్షణలో ఉన్న మాస్కో విషయంలో ఇన్నేళ్ళుగా తటస్థంగా ఉన్న ఫిన్లాండ్ ఇప్పుడిలా ప్రత్యర్థితో జట్టు కట్టడం రష్యాకూ, ఆ దేశాధినేత వ్లాదిమిర్ పుతిన్‌కూ పెద్ద ఎదురుదెబ్బ. కానీ, ఉక్రెయిన్‌తో ఏడాది పైగా ఎగతెగని పోరు చేస్తూ, ముందుకు పోలేక వెనక్కి రాలేక సతమతమవుతున్న మాస్కో మేకపోతు గాంభీర్యం ప్రదర్శించింది. ఫిన్లాండ్ చేసినపనికి తగురీతిలో ప్రతిచర్యలు ఉంటాయని హూంకరించింది.
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత భవిష్యత్తులో ఇతర దేశాల నుంచి తమను తాము రక్షించుకొనేందుకు అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ, నార్వే, నెదర్లాండ్స్, కెనడాలు స్థాపించిన సైనిక కూటమి ‘నాటో’. 1949లో సంతకం చేసిన ఉత్తర అట్లాంటిక్ ఒప్పందాన్ని ఇది అమలు చేస్తుంది. ‘నాటో’లోని ఏ సభ్యదేశం పైన అయినా బయట దేశాలు దాడికి దిగితే, మిగతా సభ్యదేశాలన్నీ సాయం చేయాలి.
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్‌లో సోవియట్ రష్యా విస్తరణ ముప్పును అడ్డుకోవడమూ ‘నాటో’ లక్ష్యం. తన ప్రయోజనాలకు విరుద్ధంగా పాశ్చాత్య ప్రపంచం కూడగట్టిన ఈ కూటమి అంటే రష్యాకు అందుకే ఒళ్ళు మంట. 1990ల ద్వితీయార్ధం నుంచి తన పొరుగు దేశాలను ‘నాటో’లో చేర్చుకొని, పక్కలో బల్లెంలా మార్చడాన్ని రష్యా తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తోంది.
‘నాటో’ విస్తరణ విషయంలో ఉక్రెయిన్‌కు సంబంధించి ఇచ్చిన మాట తప్పేందుకు పాశ్చాత్య ప్రపంచం సిద్ధపడడాన్ని మాస్కో జీర్ణించుకోలేకపోయింది. అందుకే, రష్యా అధ్యక్షుడు పుతిన్ ఏడాది క్రితం ఉక్రెయిన్‌పై పూర్తిస్థాయి యుద్ధానికి దిగారు.
సరిహద్దు వెంట ‘నాటో’ బెడద తగ్గించుకోవాలనీ, యూరప్‌లో మరే దేశమూ ‘నాటో’లో చేర కుండా చేయాలనీ ఉక్రెయిన్‌తో పోరాటం ప్రారంభించిన పుతిన్ సఫలం కాలేదు. పైపెచ్చు, అందుకు పూర్తి విరుద్ధంగా ఆ సైనికకూటమి విస్తరణకు కారణమయ్యారు. ఇది విరోధాభాస. మాస్కో చేపట్టిన యుద్ధంతో ‘నాటో’ పట్ల ఆకర్షణ పెరిగింది.
రష్యాతో తిప్పలు తప్పవనే అనుమానంతో, ‘నాటో’ సైనిక కూటమిలో సభ్యత్వానికి మరిన్ని మధ్యయూరప్ దేశాలు క్యూ కట్టాయి. ఆ క్రమంలో ఫిన్లాండ్, స్వీడన్‌లు ‘నాటో’ సభ్యత్వానికి దరఖాస్తు చేసుకున్నాయి. నిజానికి, ఫిన్లాండ్ దాదాపు 1,340 కిలోమీటర్ల తూర్పు సరిహద్దును రష్యాతో పంచుకుంటోంది. ఆ దేశం ఎన్నడూ రష్యా వ్యతిరేకి కాదు.
పైగా, రెంటికీ మధ్య ఎన్నడూ విభేదాలు లేవు. అలాంటిది– ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణతో ‘నాటో’లో చేరేందుకే ఫిన్లాండ్‌లో 80 శాతం మేర ప్రజాభిప్రాయం మొగ్గింది. చివరకు అదే జరిగింది. సభ్యత్వానికి ఫిన్లాండ్ పెట్టుకున్న దరఖాస్తు రికార్డు సమయంలో ఆమోదం పొందింది.
ఫిన్లాండ్ అధికారికంగా ‘నాటో’లో చేరినా, స్వీడన్‌కు మాత్రం ఆటంకాలు ఎదురవుతూనే ఉన్నాయి. సభ్యత్వానికి స్వీడన్ అంగలారుస్తున్నా, టర్కీ, హంగరీలు అడ్డంగా నిలిచాయి. టర్కీలో మానవ హక్కుల ఉల్లంఘనలు, ప్రజాస్వామ్య ప్రమాణాల గురించి స్వీడన్ వ్యాఖ్యలు చేయడంతో ఆ దేశం కినుక వహించింది. మే 14న టర్కీలో ఎన్నికల తర్వాత కానీ ఆ దేశం స్వీడన్ దరఖాస్తుకు ఆమోదముద్ర వేయకపోవచ్చని విశ్లేషకుల అంచనా.
హంగరీ విషయానికొస్తే, స్వీడన్ అనేక సంవత్సరాలుగా హంగరీ పట్ల వైరభావంతో వ్యవహరిస్తోంది. పైగా, హంగరీలో న్యాయం క్షీణించిందంటూ స్వీడన్ ప్రధాని ఆ మధ్య వ్యాఖ్యానించారు. దాంతో, హంగరీకి పుండు మీద కారం రాసినట్లయింది. టర్కీ లాగా డిమాండ్ల జాబితా లేకున్నా, తన సాధకబాధకాలను తీరిస్తే హంగరీ సైతం ‘నాటో’లో స్వీడన్ ప్రవేశానికి ఓకే అంటుంది.
మొత్తానికి, అమెరికా సారథ్యంలోని ద్వితీయ ప్రపంచ యుద్ధానంతర కూటమి బలోపేతమవుతోంది. బోలెడన్ని నిధులందిన ఆధునిక రక్షణ దళాలతో కూడిన ఫిన్లాండ్ ‘నాటో’కు బలమైన చేర్పు.
రేపు ఉక్రెయిన్ యుద్ధం ఎటు తిరిగి ఎలా ముగిసినా, రష్యా మాత్రం బలహీనపడింది. ఏదైతే జరగరాదని పుతిన్ ఆశించారో, అదే జరిగి సరిహద్దు వెంట ‘నాటో’ దేశాల సంఖ్య, సత్తా ఇనుమడించాయి. ఈ పాపపుణ్యాలు పూర్తిగా పుతిన్‌వే. దేశాల సార్వభౌమాధికారాన్ని గౌరవిస్తూ, నియమాను సారం సాగే అంతర్జాతీయ క్రమాన్ని ఆయన తోసిపుచ్చారు.
పాశ్చాత్య ప్రపంచం ఉలిక్కిపడి, కార్యా చరణకు ఉద్యుక్తమయ్యేలా చేశారు. ఇకపై రష్యా – యూరప్‌ల మధ్య బంధం మునుపటిలా ఉండబోదు. మరోపక్క చైనా సైతం నిత్యం ఎవరో ఒకరితో కయ్యానికి కాలుదువ్వుతోంది. వీటన్నిటి దృష్ట్యా ‘నాటో’ లాంటి సైనిక కూటములు మరింత విస్తరించడం ఖాయం. ఇప్పటికే ప్రచ్ఛన్న యుద్ధ కాలం నుంచి తటస్థంగా ఉన్న ఫిన్లాండ్, స్వీడన్‌లు పాశ్చాత్య ప్రపంచ మిత్రపక్షాలుగా మారాయి.
రష్యాతో చేతులు కలిపి ఆర్కిటిక్‌లో చైనా తన ప్రాబల్యం పెంచుకుంది. ఈ పరిస్థితుల్లో ధ్రువవృత్తం దాటి, ఆర్కిటిక్ ప్రాంతమంతటా సైనికీకరణ తప్పకపోవచ్చు. భారత్ సైతం ఆర్కిటిక్‌లో తలెత్తే పరిణామాలనూ, ప్రభావాన్నీ జాగ్రత్తగా గమనించక తప్పదు. వెరసి, ఆర్కిటిక్ ప్రాంతం మరింత సమస్యాత్మకం కానుంది. పుతిన్‌తో పాటు ప్రపంచానికీ తలనొప్పి పెరగనుంది!
పుతిన్‌కు పెరిగిన తలనొప్పి
Published Fri, Apr 7 2023 2:30 AM | Last Updated on Fri, Apr 7 2023 2:30 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment