నెలలు నిండని కాన్పు! | Sakshi Editorial On TRS And BJP Politics In Telangana | Sakshi
Sakshi News home page

నెలలు నిండని కాన్పు!

Published Sun, Oct 30 2022 12:12 AM | Last Updated on Sun, Oct 30 2022 12:12 AM

Sakshi Editorial On TRS And BJP Politics In Telangana

మీడియాలో కనిపించినంత సంచలనం జనంలో కనిపించ లేదు. ఫామ్‌హౌస్‌ ఎపిసోడ్‌ను చూసి ప్రజలు ఆశ్చర్యచకితు లైనట్టుగా దాఖలాలు ఎక్కడా దొరకలేదు. సంతలో పశువుల బేరానికి దీటుగా ప్రజా ప్రతినిధుల్ని వేలం వేసినా ఎవరూ అవాక్కయ్యే పరిస్థితి లేదు. రచ్చబండ మీద ప్రజాస్వామ్యాన్ని తులాభారం వేసినా ఎవరూ దిగ్భ్రాంతికి గురయ్యే అవకాశమే లేదు. సమస్త జనావళి హృదయాల్లోంచి సున్నితత్వాన్ని పారద్రోలి దిటవు గుండెలు ప్రసాదించిన మన రాజకీయ పార్టీలకు జేజేలు. తమ మాటల ద్వారా, చేతల ద్వారా మన పార్టీలు ప్రజలకు స్థితప్రజ్ఞతను అనుగ్రహించాయి.

తాండూరు శాసనసభ్యుడు పైలట్‌ రోహిత్‌రెడ్డి ద్వారా వేయించిన ఫామ్‌హౌస్‌ బాంబు నుంచి పొగ మాత్రమే వచ్చింది. అది సరిగ్గా పేలకపోవడానికి చాలా కారణా లున్నాయి. ఫిరాయింపుల అండతో రాజ్య విస్తరణ చేసుకోవ డానికి భారతీయ జనతా పార్టీ తహతహలాడుతున్నదనేది బహిరంగ రహస్యం. అప్రజాస్వామికమైన పద్ధతులతో, అపవిత్రమైన ఎత్తుగడలతో అనేక రాష్ట్ర ప్రభుత్వాలను అది కూల్చివేసిందన్న విషయం కూడా అక్షరసత్యం. రాజ్యాంగం ప్రసాదించిన ఫెడరల్‌ వ్యవస్థకూ, ఈ నేల తల్లి వెదజల్లే సహజ సుగంధమైన లౌకికత్వానికీ కేంద్రం ఉరితాళ్లు పేనుతున్న సంగతి కూడా ముమ్మాటికీ నిజం.

తన రాజ్య విస్తరణ కాంక్షలో భాగంగా తెలంగాణను తదుపరి టార్గెట్‌గా ఎంచుకున్నదని రాష్ట్ర ప్రజలందరికీ ఇప్పటికే అర్థమైంది. ఈ మహత్తర కార్యసాధన కోసం కూడా అది ఫిరాయింపుల బాటనే ఎంచుకున్నది. అతి త్వరలోనే తమ పార్టీలో కొందరు అధికార పార్టీ ప్రముఖులు చేరబోతున్నారని రాష్ట్ర బీజేపీ నాయకులు పలు సందర్భాల్లో ప్రకటించారు. కనుక మొన్నటి ఎపిసోడ్‌ పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు. ఇటువంటి ఫిరాయింపుల బాగోతాన్ని ఎండగట్టాలని అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ భావించడంలో తప్పేమీ లేదు. అందుకోసం అది ఎటు వంటి ట్రాప్‌ విసిరినా సమర్థనీయమే. అయితే ఈ వ్యవహారాన్ని ట్రాప్‌ చేశారా లేక డిజైన్‌ చేశారా అన్నదానిపై భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి.

బుధవారం సాయంత్రం జరిగిన ఘటనపై శనివారం మధ్యాహ్నం వరకూ ‘లీకు’లపైనే మీడియా ఆధారపడవలసి వచ్చింది. పోలీసులు దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ఒక్కటే అధికారిక పత్రం. మిగిలినవన్నీ లీకులే. నిందితుల రిమాండ్‌ను తిరస్క రిస్తూ ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పును శనివారం మధ్యాహ్నం హైకోర్టు కొట్టివేసింది. ఆ తర్వాతనే రాష్ట్ర మంత్రి, టీఆర్‌ఎస్‌ కీలక నాయకుడైన కేటీఆర్‌ మీడియాతో మాట్లాడతారన్న సమాచారం వచ్చింది. కానీ, కేసు దర్యాప్తు జరుగుతున్న దశలో దానిపై స్పందించడానికి ఆయన నిరాకరించారు. బుధవారం నాటి వ్యవహారానికి కార్యస్థలం మొయినాబాద్‌ సమీపంలోని రోహిత్‌రెడ్డి ఫామ్‌హౌస్‌. రాత్రి 7–8 గంటల మధ్యన సైబరా బాద్‌ పోలీసులు ఈ ఫామ్‌హౌస్‌పై దాడి చేశారు. ఇంకో గంట తర్వాత మీడియాకు ఉప్పందింది.

ఫామ్‌హౌస్‌లో వంద కోట్ల రూపాయల నగదు దొరికిందని మీడియాకు లీకులందాయి. దాన్ని కొంతసేపు ప్రసారం చేసిన తర్వాత దొరికిన నగదును 15 కోట్లకు తగ్గిస్తూ మరోసారి ‘లీక్‌’ వచ్చింది. చివరకు అర్ధరాత్రి సమయంలో సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర మీడియాతో మాట్లాడినప్పుడు డబ్బుల ప్రస్తావన రాలేదు. ఈ కప్పదాట్లకు కారణమేమిటో పోలీసులు వివరణ ఇవ్వకపోగా తప్పంతా మీడియాదేనని దులిపేసుకున్నారు. ఇప్పటివరకు లీకుల ద్వారా వచ్చిన సమా చారాన్ని బట్టి అక్కడ డబ్బేమీ దొరకలేదని అనుకోవాలి. నిందితులుగా పేర్కొంటున్న ఆ ముగ్గురి సంభాషణల్లో ‘వంద’ అనే మాట మాత్రం దొర్లింది.

ఆ ముగ్గురిలో స్థానిక బ్రోకర్‌గా చెబుతున్న నందు అనే వ్యక్తికి కచ్చితమైన రాజకీయ విధేయత ఏమీ లేనట్టు తెలుస్తున్నది. అన్ని పార్టీల నాయకులతో పరిచయాలు పెంచు కొని, ఫోటోలు దిగి, ప్రచారం చేసుకునే తరహా వ్యక్తిగా అర్థ్ధమవుతున్నది. మిగిలిన ఇద్దరు కూడా బీజేపీ నాయకులుగా అంతగా గుర్తింపు పొందినవారు కాదు. వాళ్ల మాటల్లో బీజేపీ అగ్రనేతల పేర్లు దొర్లినంత మాత్రాన అది సాక్ష్యంగా పనికి వస్తుందా? సమాజంలో చాలామంది మోసగాళ్లు తమకు వీవీఐపీలతో దగ్గరి పరిచయముందని అమాయకులను బురిడీ కొట్టిస్తుంటారు. మోసపోయిన అమాయకులు సదరు వీవీఐపీ లపై కేసు పెడతానంటే ఒప్పుకుంటారా? ఇప్పటి వరకు బయట కొచ్చిన వివరాలను బట్టి ఈరకంగా ఆలోచించవలసి వస్తున్నది. ఇంతకుమించిన సాక్ష్యాలు ఇంకేమన్నా ఉన్నాయా? ఉంటే ఆ ‘లీకు’లు ఎప్పుడు ఎలా బయటకు వస్తాయో తెలియదు.

ఇది నిజంగా బీజేపీ ఆపరేషన్‌లో భాగమే అనుకుందాము. ఆ ‘నిందితులు’ బీజేపీ కేంద్ర నాయకత్వం పనుపునే పని చేస్తున్నారని అనుకుందాము. వారి మాటల ప్రకారం ఈ నలు గురి చేరిక పక్కా అయితే పార్టీ అగ్ర నాయకులు రంగంలోకి వస్తారు. ఇంకో రెండు మూడు రోజులు వేచి ఉంటే ఆ కన్నపు దొంగల్ని కన్నంలోనే పట్టేసుకొని ఉండేవారు కదా? అంతటి అద్భుతమైన, అమూల్యమైన అవకాశాన్ని ఎందుకు జారవిడుచుకున్నారు? జాతీయ స్థాయిలో బీజేపీని దోషిగా నిలబెట్టే తిరుగు లేని సందర్భాన్ని ఎందుకు కాలదన్నుకున్నారు? ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ రాష్ట్రం తరువాత రాష్ట్రాన్ని కబళిస్తూ వస్తున్న బీజేపీ దండయాత్రకు ముకుతాడు వేయడం కోసం మరో రెండు రోజులు ఎందుకు ఓపిగ్గా ఉండలేకపోయారు? సీబీఐ, ఐటీ, ఈడీల త్రిశూల ప్రహారంతో గిట్టని రాజకీయ పక్షాలపై కక్ష సాధిస్తున్న కాషాయ పార్టీని బోనెక్కించగల బంగారు ఘడియల కోసం ఎందుకు ఎదురుచూడలేకపోయారు?

సామాన్యుల మెదళ్లలో ఇటువంటి ప్రశ్నలు మొలకెత్తడం సహజం. రేపోమాపో ఈ సందేహాలను పటాపంచలు చేయగల మరిన్ని ఆడియో వీడియో సాక్ష్యాలు బయటకొస్తాయేమో చూడాలి. అప్పటిదాకా ఈ లీకుల వ్యవహారాన్ని ప్రీ మెచ్యూర్‌ డెలివరీగానే పరిగణించవలసి ఉంటుంది. ఈ నెలలు నిండని కాన్పు కార్యక్రమాన్ని టీఆర్‌ఎస్‌ పెద్దలు ఎందుకు ఎంచుకొని ఉంటారు? మునుగోడు ఉపఎన్నికను ప్రభావితం చేయడం అనేది తప్ప మరో తక్షణ కారణం కనిపించడం లేదు.

అధికారంలో ఉండి, అనేక జనరంజక కార్యక్రమాలను అమలుచేస్తున్న పార్టీ ఒక ఉపఎన్నికలో గెలవడం కోసం బ్రహ్మాస్త్రాలను ఆశ్రయించవలసిన అగత్యం ఉంటుందా? ఇప్పటికే రెండూళ్లకో ఎమ్మెల్యే, పదూళ్లకో మంత్రి చొప్పున మోహరించి నెలరోజు లుగా కోరిన వరాలను తీరుస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ప్రమాదకరమైన శత్రువు బలంగా దూసుకొస్తున్నాడన్న అభిప్రాయం కలిగినప్పుడు అవసరమైన జాగ్రత్తలు తీసు కోవడం తప్పులేదని అనుకుందాము. కానీ ఆ జాగ్రత్తలు ఏ మేరకు సత్ఫలితాలనిస్తున్నాయనే గ్రహింపు కూడా అవసరం.

క్షేత్రస్థాయి సమాచారాన్ని బట్టి, వివిధ సంస్థలు చేపట్టిన సర్వేలను బట్టి చూస్తే ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిన దగ్గర్నుంచీ నేటివరకూ అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ మెరుగైన స్థితిలోనే ఉన్నట్టు తెలుస్తున్నది. ఆధిక్యతలో హెచ్చుతగ్గులుంటు న్నాయే తప్ప పూర్తిగా ఎప్పుడూ దిగజారలేదు. పదిరోజుల కింద ఉన్నంత మెరుగైన పరిస్థితి ఆడియో టేపుల లీకుల తర్వాత ఈరోజున లేదు. ఆ టేపుల్లో ఉన్న బాగోతం జనంలోకి పూర్తిగా చేరలేదా? చేరినా ప్రయోగం ఫలించలేదా? అన్నది తేలవలసి ఉన్నది. ఒక ఉపఎన్నికలో ఇంతగా సర్వశక్తులు ఒడ్డి పోరాడు తున్నప్పటికీ యాభై శాతం ఓట్లను సంపాదించే పరిస్థితిలో మాత్రం టీఆర్‌ఎస్‌ లేదని చెప్పవచ్చు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోణంలో ఆలోచిస్తే ఇది ఆ పార్టీకి ఆందోళన కలిగించే విషయమే. రెండు ప్రధాన ప్రతిపక్షాల మధ్య వ్యతిరేక ఓటు చీలిపోతే తాము సులభంగా గట్టెక్కగలమనే ఆలోచన ఆ పార్టీ పెద్దలకు ఉండవచ్చు. ఇటువంటి అంచనాలు తప్పనిసరిగా నిజం కావాలనే రూలేమీ లేదు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు బలంగా ఉంటే ఈ రూల్‌ మారవచ్చు. ఇప్పటికే రెండు సార్లు అధికారంలో ఉన్నారు కాబట్టి కొంత వ్యతిరేకత సహజం గానే ఉంటుంది.

అది తీవ్రంగా ఉంటే ఒక ప్రతిపక్షం పూర్తిగా బలహీనపడి మరొకటి బలపడవచ్చు. దుబ్బాక, హుజూరాబాద్‌ లలో జరిగింది అదే. ఆ రెండుచోట్లా ప్రభుత్వ వ్యతిరేకత కంటే గెలిచిన అభ్యర్థుల పట్ల సానుభూతి ఈ పోలరైజేషన్‌కు కారణ మైంది. మునుగోడులో కూడా మూడో పార్టీ అభ్యర్థి, ఆ పార్టీకి ఉన్న పలుకుబడి స్థాయిలో ఓట్లు రాబట్టలేక పోవచ్చన్న అంచనాలున్నాయి. ఇక్కడ సింపతీ ఫ్యాక్టర్‌ లేదు. కనుక మూడో ప్రతి పక్షం ఓట్లు రెండో ప్రతిపక్షానికి బదిలీ అయితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు పెరుగుతున్నట్టుగానే పరిగణించాలి.

ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో గెలిచి టీఆర్‌ఎస్‌ హ్యాట్రిక్‌ కొట్టాలంటే, జాతీయ స్థాయిలో కేంద్రానికి వ్యతిరేకంగా పోరాడ టంతో సమానంగా ఇల్లు చక్కదిద్దుకోవడానికి ప్రాధాన్య మివ్వాల్సి ఉంటుంది. టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఉండే ఓటు కూడా బలంగానే ఉన్నది. కుల, మత, జాతి భేదాలకతీతంగా పెన్షనర్ల ఓట్లు గుండుగుత్తగా కారు గుర్తుకే పడతాయి. రైతుబంధు పథకం ఫలితంగా రైతుల్లో సానుకూలత ఉన్నది.

ఖరీఫ్‌ కాలంలో గరిష్ఠంగా సాగుచేసిన రైతు కుటుంబాల సంఖ్య 60 లక్షలు. వీరిలో రమారమి 20 లక్షలమంది కౌలు రైతులు. ఇందులో సొంత భూమి కొంత ఉండి కొంత కౌలుకు తీసుకునేవారిని మినహాయిస్తే కౌలు మీదనే ఆధారపడే వారి సంఖ్య పది పన్నెండు లక్షలుండవచ్చు. వీరికి ప్రభుత్వంపై అసంతృప్తి ఉన్నది. మిగిలిన 50 లక్షలమందిలో 15 లక్షలమంది ధరణి వల్ల చిక్కులు ఎదుర్కొంటున్నారు. మొత్తంగా రైతుల్లో మూడింట రెండొంతుల మంది అనుకూలంగా, ఒక వంతు మంది వ్యతిరేకంగా ఉండవచ్చు.

ప్రధానంగా యువతరం నుంచి టీఆర్‌ఎస్‌ ఛాలెంజ్‌ను ఎదుర్కోవలసి ఉంటుంది. బలహీనవర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజలను ఎంపవర్‌ చేయడం ఎజెండాలో తొలి అంశం కావాలి. అందుకు మొదటి మెట్టు విద్యారంగం. బలహీనవర్గాల పిల్లలు చదివే పాఠశాల లపై ప్రభుత్వం సరైన ఫోకస్‌ పెట్టలేదు. గురుకులాలను మినహాయిస్తే రాష్ట్రంలో 25 వేల ప్రభుత్వ పాఠశాలలున్నాయి. వీటిలో 22 వేల స్కూళ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉన్నది. వీటిని బాగుచేయడానికి చేపట్టిన ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమం ముందుకు సాగడం లేదు. డీఈవోలు, ఎంఈవోల పోస్టుల్లో ఎక్కువ భాగం ఖాళీగానే ఉన్నాయి.

విద్యా వలంటీర్ల సంఖ్య 18 వేల నుంచి 12 వేలకు పడిపోయింది. టీచర్లకు చిరకాలంగా పదోన్నతులు లేవు. పాఠశాల విద్యాశాఖలో 20 శాతం ఖాళీలు న్నాయని ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి. ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంటెక్‌ల ఫీజులు భారీగా పెరిగాయి. సీఎమ్‌ఐఈ లెక్కల ప్రకారం రాష్ట్రంలో తాజా నిరుద్యోగితా రేటు 8.35 శాతం. భారతదేశపు సగటు నిరుద్యోగితా రేటు 6.43 శాతం. విద్యా–ఉపాధి కల్పన అంశాలపై దృష్టిపెట్టకపోతే వచ్చే ఎన్ని కల్లో యువతరాన్ని ఆకర్షించడం కష్టమే. భావోద్వేగ అంశాలతో ఈసారి వారు ప్రభావితం కాకపోవచ్చు.

వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement