అనుకున్నంతా అయింది. ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంక తమ సింహళ నూతన సంవత్సరాదికి ఒక రోజు ముందర అధికారికంగా చేతులెత్తేసింది. చేతిలో డబ్బులు లేవు గనక విదేశీ రుణాలను వెనక్కి చెల్లించడం తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు మంగళవారం ప్రకటించింది. ఉన్న అరకొర విదేశీ మారకద్రవ్య నిల్వలు ముడి చమురు లాంటి అత్యవసరాల దిగుమతులకు అవసరం. అందుకనే అప్పులు తీర్చడం ఆపేస్తోందన్న మాట.
దీంతో, కనివిని ఎరుగని ఆర్థిక కష్టాల్లో ఉన్న శ్రీలంక అంతర్జాతీయ యవనికపై తమ కష్టనష్టాలను చెప్పుకున్నట్టూ, ఒప్పుకున్నట్టూ అయింది. ఈ కష్టాలను కడతేర్చేందుకు ప్రభుత్వం అహరహం శ్రమిస్తోందనీ, ప్రజలు వీధికెక్కి నిరసన తెలిపే ప్రతి నిమిషం దేశానికి మరిన్ని డాలర్ల నష్టం తెస్తుందనీ ఆ దేశ ప్రధాని మహిందా రాజపక్స చేసిన అభ్యర్థన బేలతనానికి పరాకాష్ఠ. దేశ పునర్నిర్మాణానికి ప్రభుత్వం ఓ ప్రణాళికను సిద్ధం చేస్తోందని ఆయన నమ్మబలుకుతున్నారు. కానీ, కష్టాల కడలి నుంచి ఈ ద్వీపదేశం బయటపడేదెట్లా?
శ్రీలంక చరిత్రలోనే తొలిసారిగా 2020 నాటి పార్లమెంట్ ఎన్నికల్లో రాజపక్స కుటుంబీకులు మూడింట రెండొంతుల మెజారిటీ సాధించారు. ఎన్నడూ లేనంతటి బలమైన ప్రభుత్వం ప్రజల్లో ఆశలు రేపింది. ఆచరణలో మాత్రం దేశాధ్యక్షుడు గొటబయ, ఆయన అన్నయ్య ప్రధాని మహిందా, మంత్రులుగా కుటుంబ సభ్యులు – ఇలా రాజపక్స కుటుంబం దేశాన్ని సొంత జాగీరులా నడిపింది. అవినీతి, బంధుప్రీతి, ఇష్టారాజ్యపు ప్రభుత్వ ఆర్థిక విధానాలు – అన్నీ కలసి దేశానికి అశనిపాత మయ్యాయి. గమనిస్తే, కోవిడ్ తలెత్తినప్పటి నుంచి శ్రీలంక ఆర్థిక వ్యవస్థ రోజురోజుకూ దిగ జారుతూ వచ్చింది. ఆహార, ఇంధన కొరత సహా తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోయింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్)తో రుణాల పునర్నిర్మాణ కార్యక్రమాన్ని కూడా ప్రస్తుతానికి పక్కనపెట్టేయాల్సి వచ్చిందంటే, ఆర్థికంగా దేశం నిండా మునిగిందన్న మాట!
ఆహారం, ఇంధనం, విద్యుత్ – ఇలా అన్నీ ఇప్పుడు కొరతే. అధ్యక్షుడు, మంత్రుల నివాసాలకు తప్ప దేశవాసులందరికీ కరెంట్ కష్టాలు, రేషన్ క్యూలు. గమనిస్తే, 2021–22లో శ్రీలంకలో వరి ఉత్పత్తి 13.9 శాతం మేర పడిపోయింది. గత అయిదేళ్ళలో ఎన్నడూ లేనంతగా దిగుమతులు హెచ్చాయి. ఇదీ స్వయంకృతమే. గొటబయ ప్రభుత్వం నిరుడు మే మొదట్లో సేంద్రియేతర ఎరువులు, ఆగ్రో– కెమికల్స్ దిగుమతిని నిషేధించింది. ఆరు నెలల పైచిలుకు తర్వాత నవంబర్ చివరలో నిషేధం ఎత్తేసింది. కానీ, జరగాల్సిన నష్టం జరిగిపోయింది. వరి ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. ప్రస్తుత ఆహార కొరతకు ఇదీ ఓ కారణమైంది. దక్షిణాసియా మిత్రదేశాలు భారత, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ల వైపు ద్వీపదేశం ఆశగా చూస్తున్నదందుకే. రెండు, మూడేళ్ళలో తిరిగి చెల్లించే పద్ధతిలో ఆహార ధాన్యాలను అప్పుగానైనా తీసుకోవాలన్న ప్రతిపాదనలు వస్తున్నదీ అందుకే.
పొరుగుదేశం శ్రీలంకను ఆదుకొనేందుకు ఇప్పటికే భారత్ తన వంతుగా ముందుకొచ్చింది. గడచిన ఒక్క వారంలోనే 16 వేల ఎం.టీల బియ్యం అందించింది. అది ఏ మూలకు అన్నది వేరే చర్చ. శ్రీలంక మాజీ ప్రధాని రనిల్ విక్రమసింఘే సూచించినట్టు, ఐఎంఎఫ్‌తో చర్చలు ముగిసి, అప్పుల ఊబి నుంచి ఆ దేశాన్ని బయటపడేసే పని ఆచరణలోకి వచ్చే వరకు భారత్ – జపాన్ – చైనా – దక్షిణ కొరియా – ఐరోపా సమాజాల కన్సార్టియమ్ సాయం తీసుకోవడం మేలు. ఇప్పటికే భారత, చైనాల నుంచి కొలంబో రుణాలు తీసుకుంది. అది చాలదు. ఈ జూలైలో కాలపరిమితి తీరే 100 కోట్ల డాలర్ల అంతర్జాతీయ సార్వభౌమ బాండ్లతో సహా దాదాపు 400 కోట్ల డాలర్ల రుణాలను ఈ ఏడాదే కొలంబో తీర్చాల్సి ఉంది. అది వల్ల కాదని గ్రహించే, ఇప్పుడు హ్యాండ్సప్ అన్నది.
ఔషధాల కొరతతో శస్త్రచికిత్సలను సైతం ఆపేసిన దేశంలో రానున్న రోజుల్లో ఆరోగ్య సంక్షోభం తలెత్తనుందని వార్త. కుటుంబ అవినీతి, అపసవ్య ప్రభుత్వ విధానాలు, అనేకానేక తప్పిదాలతో శ్రీలంక ఇలా వీధిన పడింది. నిజమే. ఆ పాత కథను పక్కనపెట్టి, నూతన ఉషోదయానికి బాటలు వేయడమే ఇప్పుడు ఎవరైనా తక్షణం చేయాల్సిన పని. ఆర్థికంగా దివాళా తీసినట్టు ప్రకటించినంత మాత్రాన శ్రీలంకలో సహజ వనరులు, మానవ వనరులు మృగ్యమయ్యాయని కాదు కదా! వాటి సవ్యమైన వినియోగంతో, దేశాన్ని మళ్ళీ గాడిలో పెట్టడమే ఇప్పుడు కావాల్సింది. అనేక రంగాల్లో సత్తా ఉన్నా, చతికిలబడ్డ సాటి దేశాన్ని ఆదుకోవడమే అంతర్జాతీయ సమాజ కర్తవ్యం.
అప్పుల్లో కూరుకుపోయిన శ్రీలంకను ఆదుకుంటామంటూ చైనా మంగళవారం పునరుద్ఘాటిం చింది. కానీ, రుణాల రీషెడ్యూలింగ్‌కి కొలంబో చేసిన అభ్యర్థనపై మాత్రం నోరు మెదపలేదు. ఇస్తా మని మాట ఇచ్చిన 250 కోట్ల అమెరికన్ డాలర్ల సాయం పైనా పెదవి విప్పలేదు. పొరపాటునో, గ్రహపాటునో ఎప్పుడైనా సరే వీధినపడ్డ పొరుగు దేశాలను ఆదుకొనేందుకు నిర్దిష్ట పరస్పర సహకార విధాన రూపకల్పన అవసరం అనిపిస్తోంది. ఐఎంఎఫ్ లాంటి వేదికలే ఇప్పుడు శ్రీలంకకు మిగిలిన ఆశలు. గతంలో 16 సార్లు ఐఎంఎఫ్ సాయంతో బయటపడినా, ఈసారి అత్యంత కీలకం. ఎల్టీటీఈతో 30 ఏళ్ళ యుద్ధం నుంచి బయటకొచ్చినట్టే, తాజా ఆర్థిక సంక్షోభం నుంచీ తేరుకుంటా మని శ్రీలంక పెద్దలు చెబుతున్నారు కానీ, అది మాటలు చెప్పినంత సులభం కాదు. కఠోరమైన రాజకీయ, ఆర్థిక సంస్కరణలు చేపట్టాలి. ద్రవ్య స్వీయ క్రమశిక్షణతో పాటు అంతర్జాతీయ ఆపన్న హస్తాలూ తక్షణ అవసరమే. ప్రస్తుతం కొలంబోకు కావాల్సింది సానుభూతి కాదు... సహాయం!
Comments
Please login to add a commentAdd a comment