సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో పలుచోట్ల ర్యాపిడ్ యాంటిజెన్ కిట్లు బ్లాక్‌లో అమ్ముడవుతున్నాయి. హైదరా బాద్ నుంచే కొన్ని కంపెనీల డీలర్ల ద్వారా క్లినిక్‌లకు, ల్యాబ్‌లకు, చివరకు వ్యక్తి గతంగా కొందరి చేతుల్లోకి చేరుతు న్నాయి. ఆపై వీటిని ‘బ్లాక్’ చేస్తూ, వాస్తవ ధర కంటే రెండింతలకు అమ్ముతూ కోట్లు గడిస్తున్నారు. ప్రభుత్వా స్పత్రులకు వెళ్లి పరీక్షలు చేయించుకోవడానికి చాలామంది భయపడుతుండటం, ఒకవేళ చేయించుకున్నా ట్రేసింగ్, వైద్య సిబ్బంది హడావుడితో నలుగురికి తెలిస్తే బాగుం డదన్న భావనతో చాలామంది యాంటిజెన్ టెస్టులకు మొగ్గు చూపుతున్నారు. దీంతో ఈ కిట్లకు డిమాండ్ పెరిగి బ్లాక్ అవుతున్నాయి. ఇది జిల్లా వైద్యాధికారుల దృష్టికొచ్చినా పట్టించు కోవట్లేదనే ఆరోపణలున్నాయి.
ర్యాపిడ్ టెస్టులకు ప్రైవేట్‌లో అనుమతే లేదు
తెలంగాణలో ప్రైవేట్ ఆసుపత్రులకు, లేబొరేటరీలకు ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలు చేసేందుకు అనుమతి లేదు. కేవలం ఆర్‌టీ–పీసీఆర్ పరీక్షలు చేసేందుకే 23 ప్రైవేట్ లేబొరేటరీలకు, కొన్ని ఆసుపత్రులకు అనుమతి ఉంది. అలాగే ప్రభుత్వ ఆధ్వర్యంలో 16 చోట్ల ఆర్‌టీ–పీసీఆర్ పరీక్షలు చేస్తున్నారు. అయితే ఈ పరీక్ష ఫలితాల వెల్లడికి ఒక్కోసారి వారం వరకు సమయం పడుతోంది. దీంతో ప్రభుత్వ ఆసుపత్రులు, లేబొరేటరీలకు కేంద్రం ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులకు అనుమతినిచ్చింది. దీనిద్వారా కరోనా నిర్ధారణ అరగంటలోపే జరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా కిందిస్థాయి వరకు వందలాది కేంద్రాల్లో ప్రభుత్వమే యాంటిజెన్ టెస్టులు చేస్తోంది. పైగా ఈ టెస్టు చేయడం చాలా తేలిక. గొంతు లేదా ముక్కులోంచి స్వాబ్ నమూనాలు తీసి, సంబంధిత ద్రావణంలో ముంచి కిట్టుపై పెడితే నిమిషాల్లో పాజిటివా? నెగెటివా? అనేది తెలుస్తుంది. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనుమతి లేకపోవడంతో కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు, క్లినిక్‌లు, ల్యాబ్‌లకు కొన్ని కంపెనీలు డీలర్ల ద్వారా అక్రమంగా కిట్లను బ్లాక్‌లో విక్రయిస్తున్నాయి. జిల్లాల్లోని చాలా ప్రైవేట్ క్లినిక్‌లు, లేబొరేటరీలకు కూడా వీటిని సరఫరా చేస్తున్నారు. ఆర్‌టీ–పీసీఆర్ పరీక్ష చేసే కొన్ని ల్యాబ్‌లు, ఆసుపత్రులు గుట్టుగా యాంటిజెన్ టెస్టులు చేస్తూ భారీగా వసూలు చేస్తున్నాయి.
ఆచితూచి యాంటిజెన్ టెస్ట్
ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్‌లో శాంపిళ్ల సేకరణ కీలకం. గొంతు/ముక్కులోంచి స్వాబ్ నమూనా సరిగా తీయకుంటే ఫలితం తారుమారవుతుంది. శిక్షణ కలిగిన టెక్నీషియన్లు మాత్రమే స్వాబ్ నమూనాలు తీయాలి. తీసిన శాంపిళ్లను గంటలోపే పరీక్షించాలి. లేదంటే ఆ శాంపిల్ పనికిరాదు. కొందరైతే ఇళ్లలో తామే స్వాబ్ తీసుకొని పరీక్షించుకుంటున్నారు. ఇదింకా ప్రమాదకరం. దీనివల్ల ఫలితం తారుమారయ్యే ప్రమాదమూ లేకపోలేదు. ఇక యాంటిజెన్ టెస్ట్‌కు ఉన్న ప్రధాన లోపం నెగెటివ్ వస్తే దాని కచ్చితత్వం 50 నుంచి 70 శాతమే. పాజిటివ్‌కు మాత్రమే కచ్చితత్వం ఉంది. నెగెటివ్ వచ్చి లక్షణాలుంటే తప్పనిసరిగా ఆర్‌టీ–పీసీఆర్ పరీక్ష చేయాలన్నది ఐసీఎంఆర్ కీలక నిబంధన. కానీ నెగెటివ్ వచ్చిన చాలామంది లక్షణాలున్నా కూడా తమకు వైరస్ సోకలేదంటూ జనంలో తిరిగేస్తున్నారు. దీంతో వైరస్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది.
వరంగల్‌కు చెందిన జయరాం.. కరోనా వ్యాప్తి నేపథ్యంలో అక్కరకొస్తుందని భావించి తనకు తెలిసిన ఓ ప్రైవేట్ ల్యాబ్ యజమాని వద్ద నాలుగు యాంటిజెన్ ర్యాపిడ్ టెస్ట్ కిట్లు కొన్నాడు. వాటి వాస్తవ ధర ఒక్కోటి రూ. 500 కాగా రూ. 800 చొప్పున వెచ్చించాడు.
హైదరాబాద్‌లో క్లినిక్ నడిపే డాక్టర్ రఘురామయ్య (పేరు మార్చాం).. కరోనా లక్షణాలతో క్లినిక్‌కు వస్తున్న వారికి తన టెక్నీషియన్ ద్వారా స్వాబ్ శాంపిల్ తీసి పరీక్షలు చేయిస్తున్నాడు. బ్లాక్‌లో ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ కిట్లను కొని ఒక్కో పరీక్షకు రూ.1,500 తీసుకుంటున్నాడు. పావుగంటకే ఫలితం వస్తుండటంతో జనం ఎగబడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment