
పసల కనక సుందరరావును అభినందిస్తున్న పాలకవర్గ సభ్యులు, అధికారులు
ఏలూరు(మెట్రో): ఏలూరు కలెక్టర్ చాంబర్‌లో మంగళవారం వీరబాల దివస్ నిర్వహించారు. దీనిలో భాగంగా నిర్వహించిన డ్రాయింగ్, పెయింటింగ్ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ సాధికారత అధికారి కేఏవీఎల్ పద్మావతి, జిల్లా బాలల సంరక్షణ అధికారి డాక్టర్ సీహెచ్ సూర్య చక్రవేణి, శిశు గృహ మేనేజర్ కె.భార్గవి తదితరులు పాల్గొన్నారు.
ఏఆర్ కానిస్టేబుళ్లకు ఎస్సై ఉద్యోగాలు
ఏలూరు టౌన్: ఏలూరు జిల్లాలో యాంటీ నక్సల్స్ స్వ్కాడ్‌లో విధులు నిర్వర్తిస్తున్న నలుగురు ఏఆర్ కానిస్టేబుళ్లు ఇటీవలి ఎస్సై రిక్రూట్‌మెంట్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్లుగా ఉద్యోగాలు పొందారు. ఎస్పీ డీ మేరిప్రశాంతిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందచేశారు. ఉద్యోగాలు సాధించిన కానిస్టేబుళ్లను ఎస్పీ అభినందించారు. ఒకరికి ఆర్‌ఎస్‌ఐగా, మరో ముగ్గురు సివిల్ ఎస్సైలుగా ఉద్యోగాలు పొందారు. గుడివాడ నానాజీ ఆర్‌ఎస్‌ఐగా ఎంపికకాగా, హనుమంతు మల్లికార్జునరావు, దొంగల చక్రధరరావు, కొవ్వాడ గణేష్‌వర్మ సివిల్ ఎస్సైలుగా ఉద్యోగాలు సాధించారు. ఈ సందర్భంగా ఎస్పీ వారిని అభినందించారు. రోజువారి విధి నిర్వహణలో బాధితులకు అండగా నిలవాలని సూచించారు. చిత్తశుద్ధితో మెరుగైన సేవలందించాలన్నారు. శిక్షణలో మరింత పరిజ్ఞానాన్ని సంపాదించి ప్రజలకు సేవలందించేందుకు వినియోగించాలని సూచించారు.
పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్‌గా పసల
పెంటపాడు: జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ కార్యాలయ నూతన చైర్మన్‌గా పడమర విప్పర్రుకు చెందిన గూడెం మాజీ ఎమ్మెల్యే పసల కనకసుందర్రావు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా మంగళవారం పెంటపాడులోని కార్యాలయం వద్ద చైర్మన్ ఎన్నిక జరిగింది. జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ టి.గోవిందరాజు సమక్షంలో జరిగిన ఈ ఎన్నిక అనంతరం నియామక పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా మరో ఏడుగురు పాలకవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు. పల్లెం అరుణకుమారి(సిద్దాపురం, ఆకివీడు మండలం), కాకులపాటి మల్లేశ్వరి (తోగుమ్మి, కొవ్వూరు), కురుసం బేబి(గార్లగొయ్యి, పోలవరం), గంటా సుమంత్‌కుమార్ (భీమవరం), మరీదు బాలస్వామి(భోగాపురం, పెదవేగి), షేక్ రహీం(సమిశ్రగూడెం, నిడదవోలు), గేదల సూర్యప్రకాష్‌రావు(పోణంగి) ఎన్నికయినట్లు తెలిపారు.
నేటి నుంచి డిపార్ట్‌మెంట్ పరీక్షలు ప్రారంభం
ఏలూరు(మెట్రో): ఈ నెల 27 నుంచి జనవరి 4 వరకు డిపార్ట్‌మెంట్ టెస్ట్‌లు నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ పరీక్షల సమన్వయ అధికారి, ఏలూరు జిల్లా డీఆర్‌వో ఎం.వెంకటేశ్వర్లు తెలిపారు. మంగళవారం పరీక్షా పరిశీలకులు, సంబంధిత శాఖల అధికారులతో కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు పరీక్షా కేంద్రాలను ముందుగానే సందర్శించేలా ఏర్పాటు చేయాలన్నారు. ఏపీ ఆన్‌లైన్ ద్వారా జిల్లాలో ఏర్పాటుచేసే కేంద్రాలు, మౌలిక సదుపాయాలు, సీటింగ్ ఏర్పాట్లు ప్రణాళికా బద్ధంగా ఉన్నాయో లేదో ధ్రువీకరించాలని ఆదేశించారు. ఉదయం జరిగే పరీక్షకు సంబంధించి ఉదయం 8 నుంచి 9 గంటల వరకు, మధ్యాహ్నం జరిగే పరీక్షకు సంబంధించి మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు మాత్రమే అనుమతిస్తారన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment