పంచారామంలో ఏర్పాట్లు పూర్తి
బలివే (ముసునూరు): మహాశివరాత్రి పర్వదినానికి శైవక్షేత్రాలు ముస్తాబయ్యాయి. భక్తుల రద్దీ దృష్ట్యా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని సోమారామం, పంచారామం, పట్టిసం, బలివే క్షేత్రాల్లో పట్టిష్ట ఏర్పాట్లు చేశారు. ఈ ఏర్పాట్లను అధికారులు పరిశలించారు. దక్షిణ కాశీగా ప్రసిద్ధి గాంచిన బలివేలోని మహా శివరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గ్రామ సర్పంచ్ రావు ప్రవీణ సుధాకర్, నోడల్ అధికారి, తహసీల్దార్ కె.రాజ్‌కుమార్, ఈఓ పామర్తి సీతారామయ్య మంగళవారం సాయంత్రం ఉత్సవాల ఆరంభాన్ని ప్రకటించారు. ఉత్సవాల ప్రత్యేకాధికారి నూజివీడు సబ్ కలెక్టర్ స్మరణ్‌రాజ్, డీఎస్పీ కేవీవీఎన్‌వీ ప్రసాద్ ప్రత్యేక పర్యవేక్షణలో ఏర్పాట్లు చేశారు. ఆలయ, ఉత్సవ ప్రాంగణాల్లో క్యూలైన్లు బారికేడ్లు, లడ్డూ, చక్రపొంగలి, పులిహోరా ప్రసాద కేంద్రాలు, భక్తుల పుణ్యస్నానాల కోసం జల్లు స్నానాలు ఏర్పాటు చేశారు. మహిళల దుస్తుల మార్పిడి కోసం మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. రెండు వైద్య శిబిరాలు, అత్యవసర సేవలకోసం రెండు 108 వాహనాలను, అగ్నిమాపక శకటాలను, స్నాన ఘాట్‌ల వద్ద గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచారు. నూజివీడు, ఏలూరు ఆర్టీసీ డిపో యాజమాన్యాలవారు మంగళవారం అర్ధరాత్రి నుంచే ప్రతి 10 నిమిషాలకు ఒక బస్సు ఉండేలా నడుపుతున్నారు. మొత్తం 400 మంది సిబ్బంది పోలీసింగ్ నిర్వహిస్తారని డీఎస్పీ తెలిపారు. పలు స్వచ్ఛంద సేవా సంస్థలు, దాతల సహకారంతో లక్షలాదిగా తరలిరానున్న భక్తులకు ఉచిత అన్నదాన శిబిరాలు, చక్రపొంగలి, పులిహోరా, మజ్జిగ, మంచినీళ్ల ఏర్పాట్లు చేశారు.
వీరంపాలెంలో...
తాడేపల్లిగూడెం రూరల్: వీరంపాలెం శ్రీబాలాత్రిపుర సుందరి విద్య, ఆధ్యాత్మిక పీఠంలో మంగళవారం మహాశివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలుత చక్కా వెంకటరామ రమణమూర్తి, కర్రి వెంకట రామకృష్ణారెడ్డి కలశ స్థాపన చేశారు. పీఠం వ్యవస్థాపకులు గరిమెళ్ల వెంకటరమణ శాస్త్రి పర్యవేక్షణలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. బుధవారం మహాదేవునికి పవిత్ర జలాలతోనూ, పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించనున్నట్లు పీఠం వ్యవస్థాపకులు గరిమెళ్ల వెంకటరమణ శాస్త్రి తెలిపారు. భక్తులు పాల్గొని స్పటిక లింగాన్ని దర్శించి తరలించాలని విజ్ఞప్తి చేశారు.
శ్రీవారి క్షేత్రంలో నేడు శివ కల్యాణం
ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయానికి ఉపాలయమై, క్షేత్రపాలకునిగా విరాజిల్లుతోన్న శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామివారి ఆలయంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు కన్నులపండువగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఆలయంలో మంగళవారం స్వామివారికి అభిషేకాలు, అమ్మవార్లకు కుంకుమార్చనలను నిర్వహించారు. సాయంత్రం గంగా, పార్వతీ సమేత శివదేవుని ఉత్సవమూర్తులను నంది వాహనంపై క్షేత్ర పురవీదుల్లో ఊరేగించారు. బుధవారం రాత్రి శివ కల్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
సోమారామంలో పటిష్ట ఏర్పాట్లు
భీమవరం: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రాల వద్ద కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ అద్నాన్ నయీం చెప్పారు. మంగళవారం భీమవరం పట్టణం గునుపూడిలోని సోమేశ్వరజనార్దనస్వామి ఆలయం వద్ద శివరాత్రి ఉత్సవ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ముందుగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తుల దర్శన నిమిత్తం ఏర్పాటు చేసిన ప్రవేశ, నిష్క్రమణ ద్వారాలు, క్యూలైన్లు, ఘాట్లు, పార్కింగ్ ప్రదేశాలు పరిశీలించి సామాన్య భక్తులకు ఇబ్బందులు లేకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. స్వామి వారి రధోత్సవం, తెప్పోత్సవం సమయాల్లో అత్యంత అప్రమత్తతతో వ్యవహరించాలని ఆదేశించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లాల్లోని వివిధ ఆలయాల వద్ద సుమారు 600 మంది పోలీసులతో భద్రత కల్పిస్తున్నామన్నారు. ఏఎస్పీ వి భీమారావు, డీఎస్పీ జయసూర్య జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ వి.పుల్లారావు, భీమవరం వన్ టౌన్ సీఐ ఎం నాగరాజు, దేవాలయ ఈవో డి రామకృష్ణంరాజు తదితరులున్నారు.
పంచారామం, సోమారామం, పట్టిసం, బలివేలో పటిష్ట ఏర్పాట్లు
ఏర్పాట్లు పరిశీలించిన అధికారులు
పట్టిసంలో ఏర్పాట్ల పరిశీలన
పోలవరం రూరల్: పట్టిసంలో మహాశివరాత్రి ఉత్సవ ఏర్పాట్లను జాయింట్‌కలెక్టర్ పి.ధాత్రిరెడ్డితో కలిసి ఎస్పీ కె.ప్రతాప్ శివకిషోర్ పరిశీలించారు. నదిలో పంట్లు దాటే ప్రదేశం, ఇసుక తిన్నెలపై, దేవస్థానం వద్ద బందోబస్తు ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. దేవస్థానం వద్ద శ్రీ భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వెళ్లే భక్తులు సౌకర్యార్ధం చేసిన ఏర్పాట్లపై ప్రత్యేక అధికారి విశ్వనాధరాజు, ఈవో సురేష్‌నాయుడు, ఫౌండర్‌ఫ్యామిలీ మెంబర్ కె.వీరభద్రరరావు వివరించారు. డ్రోన్ కెమేరాలు, సీసీ కెమేరాల ద్వారా ఎప్పటికప్పుడు భక్తుల రద్దీని అంచనా వేస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ విధులు నిర్వహించాలని సూచనలు చేశారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఉత్సవ కమిటీ చైర్మన్, జంగారెడ్డిగూడెం ఆర్డీవో ఎంవీ రమణను జాయింట్ కలెక్టర్ ధాత్రి రెడ్డి ఆదేశించారు. క్యూలైన్‌ల వద్ద తొక్కిసలాటలు లేకుండా చూడాలన్నారు. ఉత్సవాలకు 500 మంది పోలీసులకు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ కె.ప్రతాప్‌శివకిషోర్ తెలిపారు. డీఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు, సీఐ బాల సురేష్, ఎస్సై పవన్‌కుమార్, తహసీల్దార్ సాయి రాజు పాల్గొన్నారు.
పాలకొల్లు సెంట్రల్: మహాశివరాత్రి ఉత్సవాలకు పంచారామక్షేత్రం శ్రీ క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయంలో విద్యుద్దీపాలంకరణలు, ప్రత్యేక పుష్పాలంకరణ చేశారు. భక్తుల కోసం ఉచిత, ప్రత్యేక దర్శనార్థం క్యూలైన్లను ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి స్వామివారికి అభిషేకాలు చేయించుకునే భక్తుల సౌకర్యార్థం ఆలయం వెనుకభాగంలో అలాగే పక్కనే ఉన్న అభిషేకాల మండపంలోను ఏర్పాట్లు చేశారు. స్వామివారికి లింగోద్భవ సమయంలో ఏర్పాటుచేసే మల్లన్న పాగాను బుధవారం సాయంత్రం 5 గంటలకు ఆలయం చుట్టూ ఉన్న మాడ వీధుల్లో ప్రదక్షిణ చేయించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ ప్రక్రియ నూతనంగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. భక్తులకు ట్రాఫిక్ సమస్యలు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు సీఐ రజనీకుమార్ తెలిపారు. తాగునీటి ప్యాకెట్లు, వైద్య సదుపాయం కల్పించారు. మంగళవారం రాత్రి ఆలయంలో ఏర్పాట్లపై పర్యవేక్షణ చేశారు. వేకువజామున నాలుగు గంటల నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేసినట్లు ఈవో ముచ్చర్ల శ్రీనివాసరావు తెలిపారు. మద్యాహ్నం 12 నుంచి రాత్రి 11 గంటల వరకూ స్వామివారికి అభిషేకాలు జరుగుతాయన్నారు. లింగోద్భవ సమయం అనంతరం స్వామివారికి లక్షపత్రి పూజ నిర్వహించనున్నట్లు తెలిపారు.
శివరాత్రి మహోత్సవాలు ప్రారంభం
శివరాత్రి మహోత్సవాలు ప్రారంభం
శివరాత్రి మహోత్సవాలు ప్రారంభం
శివరాత్రి మహోత్సవాలు ప్రారంభం
Comments
Please login to add a commentAdd a comment