నేటి నుంచి సిలువగట్టు తిరునాళ్ల
నూజివీడు: పట్టణంలోని విజయవాడ రోడ్డులో ఉన్న సిలువ గట్టు పుణ్యక్షేత్రం తిరునాళ్లు నేటి నుంచి మూడురోజుల పాటు జరగనున్నాయి. ఈ తిరునాళ్ల నిర్వహణకు సంబంధించి చేస్తున్న ఏర్పాట్లు పూర్తయ్యాయి. సిలువగట్టు పుణ్యక్షేత్రం రెక్టార్ రెవరండ్ ఫాదర్ గొర్రుముచ్చు జోసఫ్ పర్యవేక్షణలో సిలువగట్టు కమిటీ సభ్యులు, పెద్దలు ఏర్పాట్లు చేశారు. ఈనెల 26, 27, 28 తేదీల్లో ఇక్కడ ప్రత్యేక పూజాధికాలు, దివ్యబలిపూజ, ప్రార్థనలు జరగనున్నాయి. పెద్ద ఎత్తున వచ్చే క్రైస్తవ సోదరులకు సౌకర్యవంతంగా ఉండేందుకు గాను రహదారికి మరమ్మతులు చేయడంతో పాటు వాహనాల పార్కింగ్‌కు ఏర్పాటు చేశారు. అలాగే రహదారికి ఇరువైపులా రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరణ చేశారు. గట్టుపైకి ఎక్కి సిలువును దర్శించుకునేందుకు వీలుగా గట్టుచుట్టూ ఉన్న రహదారిని సైతం బాగుచేశారు. భక్తి విశ్వాసాలతో కులమత బేధాలు లేకుండా భక్తులు పుణ్యక్షేత్రాన్ని సందర్శించి ప్రభువు దీవెనలను పొందాలని ఫాదర్ జోసఫ్ విజ్ఞప్తి చేశారు. దీనిని గుణదల తరువాత రెండో పెద్ద పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దేందుకు క్రైస్తవ భక్తులు తమ వంతు కృషిచేస్తున్నారు. అలాగే ఇక్కడకు వచ్చే భక్తులకు, పిల్లలకు వినోదంగా ఉండేందుకు పలు వినోద కార్యక్రమాలకు సంబంధించిన ఏర్పాట్లు సైతం చేస్తున్నారు. ప్రతిరోజూ సిలువ ప్రార్థనలు, ప్రసంగాలు, సిలువతేరు ప్రదక్షిణ, దివ్య ఆరాధన, దివ్యబలిపూజ కార్యక్రమాలు నిర్వహిస్తారు. అంతేగాకుండా కోలాటం, బుర్రకథ, గానకచేరి, నాటకాలు తదితర సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అఖరిరోజున సాయంత్రం విజయవాడ పీఠాధిపతి ఆధ్వర్యంలో దివ్యబలిపూజ కార్యక్రమం నిర్వహించనున్నారు. మూడురోజుల తిరునాళ్లు ప్రశాంతంగా జరిగేలా పోలీసు అధికారులు బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment