నూజివీడు: ట్రిపుల్ ఐటీ విద్యార్థులందరూ సాంస్కృతిక మహోత్సవం సిగ్నస్ 25లో పాల్గొని వారి నైపుణ్యాలను పెంపొందించుకోవాలని నూజివీడు ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్ పేర్కొన్నారు. సిగ్నస్ 25లో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాల పోటీల నిర్వహణను మంగళవారం డైరెక్టర్ ప్రారంభించారు. సిగ్నస్‌లో భాగంగా విద్యార్థులకు మిస్టర్ అండ్ మిస్ ట్రిపుల్ ఐటీ, రంగోలి, కిచెన్ క్రానికల్స్, షార్ట్ ఫిలిం పోటీలు నిర్వహిస్తారన్నారు. తొలిరోజున విద్యార్థులకు డిబెట్ పోటీలను నిర్వహించారు. కార్యక్రమంలో ఏఓ బీ లక్ష్మణరావు, డీన్ అకడమిక్స్ చిరంజీవి, డీఎస్‌డబ్ల్యూఓ టీ దుర్గాభవాని, ఫ్యాకల్టీ, విద్యార్థులు పాల్గొన్నారు.
టెక్‌జైట్–25 వాయిదా
నూజివీడు: నూజివీడు ట్రిపుల్ ఐటీలో నిర్వహించాల్సిన సాంకేతిక సంబరం టెక్‌జైట్–25ను వచ్చేనెల 10, 11, 12 తేదీలకు వాయిదా వేసినట్లు ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. తొలుత ఈనెల 25 నుంచి 27 వరకు నిర్వహించాలని నిర్ణయం తీసుకోగా శివరాత్రి పర్వదినంతో పాటు ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కూడా ఉండటంతో టెక్‌జైట్ నిర్వహణను వాయిదా వేసినట్లు పేర్కొన్నారు.
గంజాయి కేసులో ఇద్దరి అరెస్ట్
జంగారెడ్డిగూడెం: గంజాయి సేవిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు జంగారెడ్డిగూడెం సీఐ వి.కృష్ణబాబు తెలిపారు. తమకు అందిన సమాచారం మేరకు స్థానిక రామచంద్రాపురంలో తనిఖీలు నిర్వహిస్తుండగా పిరమిడ్ సమీపంలో గంజాయి సేవిస్తూ శివరాత్రి వీరవెంకట దుర్గాప్రసాద్, తుంపాల సాయి పట్టుబడ్డారన్నారు. వారిని తనిఖీ చేయగా వారి వద్ద 2 కేజీల 335 గ్రాముల గంజాయి గుర్తించినట్లు చెప్పారు. నిందితులను అదుపులోకి తీసుకుని గంజాయి ప్యాకెట్లతో పాటు, రెండు సెల్‌ఫోన్‌లు, పల్సర్ బైక్, రూ. 280 నగదు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. కాగా నిందితులపై మంగళవారం కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచామన్నారు. ఈ తనిఖీల్లో జంగారెడ్డిగూడెం ఇన్‌చార్జి ఎస్సై, లక్కవరం ఎస్సై శశాంక, సిబ్బంది పాల్గొన్నారు.
నిద్రిస్తున్న వ్యక్తిపై
ట్రాక్టర్ ఎక్కడంతో..
లింగపాలెం: లారీ రివర్స్ చేస్తుండగా ట్రాలీట్రాక్టర్‌ని ఢీకొనడంతో దాని కింద నిద్రిస్తున్న వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ధర్మాజీగూడెంలో విజయలక్ష్మి మొక్కజొన్న ఫ్యాక్టరీలో ముసునూరుకు చెందిన బడిపాటి ఆగస్టీన్ ట్రాలీ ట్రాక్టర్‌లో మొక్కజొన్న లోడు వచ్చాడు. ఫ్యాక్టరీ లోపల బండి సీరియల్‌లో పెట్టి ట్రాలీ కింద నిద్రిస్తుండగా ఒక లారీ రివర్స్‌లో వచ్చి ట్రాలీని ఢీకొట్టింది. దీంతో కింద నిద్రిస్తున్న ఆగస్టీన్‌పై ట్రాలీ ఎక్కి అక్కడికక్కడే మృతి చెందాడు. సొమవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈసంఘటన చోటుచేసుకొంది. మృతునికి భార్య, కుమార్తె ఉన్నారు. ధర్మాజీగూడెం పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై వెంకన్న చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment