మహాయజ్ఞానికి శ్రీకారం.. గణపతి హోమం
ద్వారకాతిరుమల: సుందరగిరిపై స్వయంభూగా కొలువైన శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం నిర్వహించనున్న అతిరుద్ర ప్రయోగ సహిత మహా సుదర్శన నృసింహ 31వ మహా యజ్ఞానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రతి ఏటా వలె ఈ ఏడు కూడా మహా శివరాత్రి నాడు సాయంత్రం మొదలు తెల్లవార్లు ఈ మహా యజ్ఞాన్ని ఎంతో వైభవంగా నిర్వహించనున్నారు. అందులో భాగంగా హైదరాబాద్‌కు చెందిన కొచ్చర్లకోట సత్యవెంకట లక్ష్మీనరసింహ గురూజీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ యజ్ఞ ఏర్పాట్లను సీహెచ్ కుటుంబరావు పర్యవేక్షిస్తున్నారు. ఈక్రమంలో మంగళవారం ఆలయ యాగశాలలో భారీ ఏర్పాట్లు చేశారు. ముందుగా నరసింహ గురూజీ గర్భాలయంలో కొలువైన స్వామివారి మూలవిరాట్ వద్ద కంకణధారణ చేశారు. అనంతరం యాగశాలలో పండితులు, రుత్వికుల వేద మంత్రోచ్ఛరణల నడుమ మహాగణపతి పూజ, హోమాన్ని నిర్వహించారు. అలాగే శాలిగ్రామ అభిషేకం, శాలిగ్రామ అర్చన, అదేవిధంగా ప్రధాన హోమగుండ ప్రతిష్ఠతో పాటు విశేష పూజా కార్యక్రమాలను శాస్త్రోక్తంగా జరిపారు. లోకశాంతి కోసం పలు వనమూలికలు, భక్ష్యాలు, వివిధ రకాల ద్రవ్యాలు, 9 రకాల సమిదులు, ఖరీదైన ద్రవ్యాలతో బుధవారం రాత్రి నిర్వహించనున్న ఈ యజ్ఞం భక్తులను పరవశింప జేయనుంది. ఈ క్రతువును భక్తులు యూట్యూబ్ ఛానల్ లింక్ https:www. youtube.com/@SriNrusimhaKrupa ద్వారా ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించవచ్చని కుటుంబరావు తెలిపారు.
నేటి రాత్రి సుందరగిరిపై..
అతిరుద్ర ప్రయోగ సహిత మహా సుదర్శన నృసింహ 31వ మహా యజ్ఞం
క్రతువుకు పూర్తయిన ఏర్పాట్లు
Comments
Please login to add a commentAdd a comment