సబ్ జూనియర్ కబడ్డీ జట్ల ఎంపిక
తణుకు అర్బన్: పశ్చిమగోదావరి జిల్లా సబ్ జూనియర్ అండర్–16 బాలురు, బాలికల కబడ్డీ సెలక్షన్స్ తణుకు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో ఆదివారం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి 200 మంది క్రీడాకారులు హాజరుకాగా వారిలో 12 మంది బాలురు, 12 మంది బాలికలను ఎంపిక చేసినట్లు కబడ్డీ అసోసియేషన్ సెక్రటరీ యలమరెడ్డి శ్రీకాంత్ తెలిపారు. ఎంపికై న జట్లు ఈ నెల 14 నుంచి 16 వరకు కడప జిల్లాలోని పులివెందులలో నిర్వహించే 39వ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు జిల్లా తరపున ఆడనున్నట్లు ఆర్గనైజర్ సంకు సూర్యనారాయణ తెలిపారు. ముందుగా బాలుర జట్టు ఎంపికను ఏఎంసీ మాజీ చైర్మన్ బసవ రామకృష్ణ, బాలికల జట్టు ఎంపికను తణుకు పట్టణ బీజేపీ అధ్యక్షుడు బొల్లాడ నాగరాజు ప్రారంభించారు. వ్యాయామ ఉపాధ్యాయులు కె.షణ్ముఖం, కేవీఆర్ సుబ్బారావు, బి.ప్రదీప్, జి.రవి, కే.మంగ, వి.సత్యవేణి, సి.రాణి తదితరులు పాల్గొన్నారు.
మార్షల్ ఆర్ట్స్‌లో ప్రపంచ రికార్డు
తణుకు అర్బన్: తణుకు జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో ఆదివారం చిన్నారులు మార్షల్ ఆర్ట్స్ నాన్ చాక్ తిప్పుతూ వేసిన యోగాసనాలు యునైటెడ్ వరల్డ్ రికార్డును సాధించాయి. కేఎస్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ చైర్మన్ డాక్టర్ కె.శ్రీనివాస్ ఆధ్వర్యంలో 250 మంది కరాటే విద్యార్థులు 22 రకాల యోగాసనాలు వేస్తూ మార్షల్ ఆర్ట్స్ నాన్ చాక్ తిప్పుతూ వినూత్నంగా చేసిన ప్రదర్శన అలరించింది. ఈ కార్యక్రమానికి న్యాయనిర్ణేతగా వి.ఆర్యన్ వ్యవహరించారు. ముఖ్య అతిథిగా హాజరైన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ మార్షల్ ఆర్ట్స్‌లో చిన్నారులు రాణిస్తున్న తీరు అభినందనీయమని, విద్యతోపాటు క్రీడల్లో కూడా పట్టు సాధించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. క్రీడాకారులను తీర్చిదిద్దుతున్న అకాడమీ చైర్మన్ శ్రీనివాస్‌ను అభినందించారు. శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రపంచంలోనే మొదటిసారిగా 250 మంది మార్షల్ ఆర్ట్స్ విన్యాసాల మధ్య యోగాసనాలు వేయడం జరిగిందన్నారు.
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
జంగారెడ్డిగూడెం : రోడ్డు ప్రమాదంలో మహిళ మృతిచెందిన ఘటన ఆదివారం జంగారెడ్డిగూడెం పట్టణంలో చోటు చేసుకుంది. ఎస్సై షేక్ జబీర్ తెలిపిన వివరాల ప్రకారం లక్కవరం గ్రామానికి చెందిన చుక్కా మహాలక్ష్మి కాకర్ల వై.జంక్షన్ వద్ద కిళ్లీ కొట్టు నడుపుతోంది. ఆదివారం ఉదయం మహాలక్ష్మి తన స్కూటీపై కిళ్లీ కొట్టుకు వెళ్తుండగా.. అశ్వారావుపేట వైపు నుంచి కొయ్యలగూడెం వైపు వస్తున్న లారీ ఢీకొంది. ఈ ఘటనలో మహాలక్ష్మి తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతిచెందింది. మృతురాలి కుమారుడు చుక్కా సూర్యప్రకాష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
సబ్ జూనియర్ కబడ్డీ జట్ల ఎంపిక
Comments
Please login to add a commentAdd a comment