మోడ్రన్ దుస్తుల్లో రజని చాంది
తెలుగు సినిమాల్లో హీరోయిన్ పెళ్లికి ముందు మోడ్రన్ డ్రస్సుల్లో పాటలు పాడుతుంది. పెళ్లయ్యాక తప్పని సరిగా చీరల్లోకి మారుతుంది. హీరో పెళ్లికి ముందు... తర్వాత కూడా ప్యాంట్‌లోనే ఉంటాడు. మన దేశంలో స్త్రీలు యాభై దాటాక మన సంస్కృతి సంప్రదాయాలకు తగినట్టుగా దుస్తులు ధరించాలనే ఒక అప్రకటిత నిబంధనకు నిబద్ధులుగా ఉంటారు. యాభై దాటాక వారు తమ మనసు ఎలా ఉన్నా తప్పనిసరిగా వృద్ధాప్యాన్ని ప్రదర్శించాల్సిందేనా? కేరళలో 69 ఏళ్ల నటి రజని చాంది తన సరదా మేరకు మోడ్రన్ దుస్తుల్లో దిగిన ఫొటోలు ఆమెకు ప్రశంసలతో పాటు శాపనార్థాలు కూడా తెచ్చి పెట్టాయి. ‘ఈ వయసులో ఇదేం పని’ అన్నవారే ఎక్కువ. 29 ఏళ్ల మహిళా ఫొటోగ్రాఫర్ అతిరా రాయ్ ఈ ఫొటోలు తీసింది. టీ షర్ట్ జీన్స్ ప్యాంట్ వేసుకున్న వృద్ధులు ఉండొచ్చు.. టీ షర్ట్ జీన్స్ ప్యాంట్ వేసుకున్న వృద్ధ స్త్రీలు ఉండకూడదా అని ఇప్పుడు చర్చ.
‘నేను మా అమ్మను చూశాను. 60 ఏళ్లు రావడంతోటే ఆమె జీవితం అంతా ముగిసిపోయినట్టుగా తయారైంది. 60 తర్వాత వచ్చే ఆరోగ్య సమస్యలన్నింటిని ఎదుర్కొనడానికి సిద్ధపడింది. 60 దాటాక మన దేశంలో స్త్రీలు అమ్మమ్మలుగా, నానమ్మలుగా తమ శరీరాల మీద శ్రద్ధ, అలంకరణ పట్ల ఆసక్తీ లేకుండా ఉండటం అలవాటు చేసుకున్నారు. కాని రజని చాందిని చూసినప్పుడు నాకు మా అమ్మ కంటే భిన్నంగా అనిపించారు. ఆమె తన శరీరాన్ని చక్కగా చూసుకుంటున్నారు. రూపాన్ని కాపాడుకుంటూ వచ్చారు. ఉత్సాహంగా హుషారుగా జీవితాన్ని ఏ వయసులో అయినా గడపొచ్చు అన్నట్టుగా ఉంటారు. ఇలా మిగిలిన స్త్రీలు కూడా ఉండొచ్చు కదా అనిపించింది. అందుకే ఆమెతో డిఫరెంట్‌గా ఫొటోషూట్ చేద్దామని అనుకున్నాను. చేశాను’ అంది ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్ అతిరా రాయ్. ఈమె సంప్రదాయ ఫొటోషూట్‌లకు కొంచెం ఆవల భిన్నమైన ఫొటోలు తీస్తుంటుంది అన్న పేరు తెచ్చుకుంది. అదే విధంగా ఇప్పుడు రజని చాందికి తీసిన ఫొటోలతో కూడా వార్తల్లోకి ఎక్కింది.
ఎవరీ రజని చాంది?
రజని చాందిది కేరళలోని కొచ్చి. ఇప్పుడు ఆమె వయసు 69 సంవత్సరాలు. జీవితంలోని చాలా భాగం ముంబైలో గడిచింది భర్త బ్యాంకు ఉద్యోగం వల్ల. అతను రిటైర్ అయ్యాక కొచ్చికి వచ్చి స్థిరపడ్డారు. అయితే ముంబైలో గడిపి వచ్చిన రజని ఆ నగర ధోరణికి తగిన దుస్తులు ధరిస్తూ అక్కడి స్త్రీలను భృకుటి ముడిపడేలా చేస్తూ వచ్చారు. ‘నేను స్లీవ్‌లెస్ వేసుకొని వెళితే ఒకలాగా చూశారు’ అని రజని చెప్పుకున్నారు. అయినా సరే రాజీ పడుకుండా తనకు నచ్చిన దుస్తులు ధరిస్తూ వచ్చారు. అంతేనా? 65 ఏళ్ల వయసులో నటిగా అవతారం ఎత్తి ‘ఒరు ముత్తాసి గాధ’ అనే మలయాళ సినిమాలో నటించారు. ఇంకా జనాన్ని ఆశ్చర్యపరుస్తూ మలయాళం బిగ్‌బాస్‌లో పాల్గొన్నారు. ‘నా వయసు వారు లిప్‌స్టిక్ రాసుకున్నా తప్పేనా?’ అంటారు రజని.
విమర్శలు రేపిన ఫొటోషూట్
‘మీరు నా భర్త పర్మిషన్ తీసుకుంటే మీరు కోరిన ఫొటోషూట్‌లో నేను పాల్గొంటాను’ అన్నారు రజని చాంది తనతో ఫొటోషూట్ ప్రస్తావన చేసిన అతిరా రాయ్‌తో. అతిరా రజని చాంది భర్తను అడిగితే ‘ఆమె జీవితం ఆమె ఇష్టం. నచ్చితే చేయమనండి’ అన్నాడాయన. ఇక ఫొటోషూట్ మొదలైంది. లొకేషన్ రజని చాంది ఇల్లే. ఒక బొటిక్ నుంచి కొన్ని డ్రస్సులు తెచ్చి మొత్తం 30 ఫొటోలు తీసింది అతిరా. ‘మొదట్లో ఆ డ్రస్సులను చూసి షాక్ అయ్యాను. వేసుకున్నాక బాగానే ఉన్నా అనిపించింది’ అన్నారు రజని చాంది. డిసెంబర్ 2020 చివరి వారంలో ఈ ఫొటోషూట్ జరిగింది. వారం క్రితం రజని తన ఫేస్‌బుక్‌లో ఇన్‌స్టాలో ఆ ఫొటోలను పెట్టడంతో మొదట ప్రశంసలు మెల్లగా విమర్శలు మొదలయ్యాయి. ఎందుకంటే ఒక డ్రస్‌లో రజనీ మోకాళ్లు కనిపిస్తున్నాయి. మరో డ్రస్సులో వక్ష అంచు కనిపిస్తూ ఉంది.
‘నువ్వెందుకు చచ్చిపోలేదు అని ట్రోల్ చేశాడొకడు. నీకీ వయసు లో కావలసింది బైబిల్. ప్రార్థన చేసుకో అన్నాడొకడు. మరొకడు నువ్వొక పాత ఆటోవి. కొత్త రంగేసినా పాత ఆటో పాతదే అన్నాడు. ఆశ్చర్యంగా మగవాళ్ల కంటే స్త్రీలే నన్ను ఎక్కువ తిట్టారు. నా కాళ్లు బాగుంటే నేనేం చేయను. వాటిని చూపిస్తే మీకేంటి నొప్పి అనాలనిపిస్తోంది. నా మీద మీ శక్తిని ఖర్చుపెట్టడం కంటే దేశం కోసం ఏదైనా పనికొచ్చే పని చేయండి అని బదులు ఇచ్చాను’ అన్నారు రజని చాంది.
‘మన దేశంలో స్త్రీలు అమ్మమ్మలుగా నానమ్మలుగా ఒక వయసు తర్వాత ఇళ్లల్లో గౌరవం పొందుతూ ఉంటారు. వారి బట్టలు కూడా ఎలా ఉండాలో మనం నిర్ణయించేశాం. వితంతువులైతే తెల్లబట్టల్లో ఉండాలి. ఆకర్షణ రహితంగా ఉండాలి వీరు. కాని రజని చాంది చేసిన ఈ ఫొటోషూట్ స్టీరియోటైప్‌ను బద్దలు కొట్టేలా ఉంది. అందుకే అందరూ ఇబ్బంది పడుతున్నారు’ అని నమిత భండారే అనే ఒక వెబ్‌సైట్ ఎడిటర్ వ్యాఖ్యానించారు. అయితే ప్రశంసలు కూడా ఉన్నాయి. వయసు అనేది కేవలం శారీరకమే తప్ప మానసికం కాదని నిరూపించారని చాలామంది రజనిని మెచ్చుకున్నారు.
కాని ఆలోచించ వలసింది ఏమిటంటే 70 ఏళ్ల తాతయ్యలు మనవళ్ల టీషర్ట్స్ వేసుకుని మురిసిపోతూ తిరుగుతూ ఉంటారు. వారిని ఎవరూ ఏమీ అనరు. కాని మనవరాలిలా బట్టలు తొడుక్కున్న అమ్మమ్మను మాత్రం విమర్శిస్తారు. స్త్రీల దుస్తులు వారు వ్యక్తం చేసే కోరికకు సంకేతంగా, వారి మేకప్ లైంగిక ప్రేరకంగా, వారి ప్రతి చర్య అభ్యంతరకరంగా భావించబడేంత వరకూ స్త్రీలు ఈ విమర్శలు ఎదుర్కొనక తప్పదు. రజని చాందిలాంటి వారు చేసే ప్రయత్నాలు ఈ లైంగికతకు ఆవల ఉండే సౌందర్య వ్యక్తీకరణలుగా భావించేలా చేస్తాయి. సంఘ నియమాలు ఉంటాయి నిజమే. కాని వ్యక్తుల ప్రతిఘటన జరిగినప్పుడు ఆ నియమాలు కుదుపులకు లోనవుతాయని రజని చాంది ఘటన నిరూపిస్తోంది.
రజని చాందితో అతిరా రాయ్
– సాక్షి ఫ్యామిలీ
Comments
Please login to add a commentAdd a comment