కొంగట్టుకు తిరుగుతూ కబుర్లు చెప్పే బిడ్డ కళ్లముందునుంచి అదృశ్యమైతే, ఆ వేదన వర్ణనాతీతం. ప్రాణాలతో ఉన్నాడో లేదో తెలియక ఆ తల్లిపేగు అల్లాడిపోతుంది. కానీ రెండుదశాబ్దాల తరువాత ‘అమ్మా’ అంటూ తిరిగొస్తే.. కలో మాయో తెలియని అయోమయంలో అకస్మాత్తుగా కనిపిస్తే ఎలా ఉంటుంది. ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. కానీ ట్విస్ట్ ఏంటంటే..
ఎన్‌డీవీటీ కథనం ప్రకారం ఢిల్లీలో నివసించే రతీపాల్ సింగ్, భానుమతి కుమారుడు పింకు. పింకు 2002లో దాదాపు పదకొండేళ్ల వయస్సులో తండ్రితో చిన్న తగాదాపడటంతో తల్లి మందలించింది. అంతే క్షణికావేశంతో ఇంట్లోంచి వెళ్లిపోయాడు. కొడుకు కోసం ఎంతవెతికినా అతని ఆచూకీ లభించలేదు. ఎప్పటికైనా రాకపోతాడా అనే ఆశతో జీవిస్తున్నారు. వారి ఆశలు ఫలించి 22 ఏళ్ల తరువాత అమేథిలోని తన అమేథీలోని ఖరౌలిగ్రామానికి వచ్చాడు పింకు. అతణిని గుర్తించిన స్థానికులు, బంధువులు ఢిల్లీలో ఉన్న తల్లిదండ్రులకు సమాచారం అందించారు.
పరుగున పరుగున వచ్చి కన్నవాళ్లు పింకూ శరీరంపై ఉన్న మచ్చను చూసి పింకూని గుర్తుపట్టారు. ఆనందంతో కన్నీటి పర్యంతమయ్యారు. కానీ ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. సన్యాసిలా మారిపోయిన తమ కుమారుడి పరిస్థితి చూసి ఆవేదనకు లోనయ్యారు. ఇంటి నుంచి వెళ్లిపోయినప్పటి నుంచి సంపన్నమైన రాజ్యాన్ని విడిచిపెట్టి సన్యాసిగా మారిన రాజు లాంటి జానపద కథలు చెబుతూ ఇల్లిల్లూ తిరుగుతూ భిక్షాటన చేస్తూ కాలం గడిపాడు. చివరికి పుట్టిన ఊరును, కన్నతల్లిని వెతుక్కుంటూ వచ్చాడు.
కన్నతల్లి గుండెలు పగిలే మరో ట్విస్ట్ ఏంటంటే.. తల్లిదండ్రులను ఓదార్చుతూనే, మళ్లీ తాను వెళ్లిపోవాలని తేల్చి చెప్పాడు పింకూ. వారు ఎంత మొర పెట్టుకున్నా వినకుండా, మీతో కలిసి జీవించలేనంటూ అక్కడి నుంచి నిష్క్రమించాడు. అంతేకాదు ఒక సన్యాసిగా తప్పనిసరిగా తల్లి నుండి భిక్షను స్వీకరించే కర్మను పూర్తి చేయాలనే ఉద్దేశంతో వచ్చినట్టు చెప్పాడు. ఈ పరిణామంతో వారు ఆవేదనలో మునిగిపోయారు. అయితే తమ కుమారుడికి చెందిన మతపరమైన విభాగం పింకూని విడిచిపెట్టడానికి రూ.11 లక్షలు అడుగుతోందని పింకు తండ్రి ఆరోపించాడు. రూ.11లు కూడా లేని తాము సొమ్ము ఎక్కడనుంచి తేవాలంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
#Delhi | Boy, who went missing 22 years ago, returns to mother as a monk.
— NDTV (@ndtv) February 7, 2024
Read here: https://t.co/YWDMh5u9aT pic.twitter.com/HQeEA78XCY
Comments
Please login to add a commentAdd a comment