ప్రతీకాత్మక చిత్రం
ఆమె ఐఐఎంలో ఎంబీఏ చేసి క్యాంపస్ ఇంటర్వ్యూలో నెలకు ఆరు లక్షల జీతం పొందే ఉన్నతోద్యాగాన్ని సాధించింది. ఉద్యోగం వచ్చాక ఒక అబ్బాయిని రెండేళ్లపాటు ప్రేమించింది. తల్లితండ్రులను ఒప్పించి పెళ్లిచేసుకుంది. పెళ్ళయాక ఆరునెలల్లో విడాకులు తీసుకొంది. అప్పటికి తాను నాలుగు నెలల గర్భవతి. అబార్షన్ చేయించుకొని విడాకులు తీసుకొన్న ఆమె ఇప్పుడు డిప్రెషన్లో ఉంది. ఇక జీవితంలో పెళ్లిచేసుకోను అంటోంది .
మరో చోట మరో అమ్మాయి. అమెరికాలో అత్యున్నత సంస్థలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి అటుపై పెద్ద ఉద్యోగం సాధించింది. ఈమె సంపాదనపై కన్నేసిన ఒక యువకుడి ప్రేమ వలలో చిక్కి నరకయాతన అనుభవించి ఎలాగో ఒకలా బయటపడింది .
మరో చోట ఐఐటీ చదివే విద్యార్ధి యూట్యూబ్ వీడియోలు చేస్తూ దానికి ఆదరణ లేదని (మరి కొన్ని కారణాలు) ఆత్మహత్య చేసుకొన్నాడు. పెద్దగా చదువుకోని వారు కూడా యూట్యూబ్ వీడియోలు చేస్తూ సక్సెస్ అవుతున్నారు. మరి.. నువ్వు చదివే చదివేంటి ? చేస్తున్న వీడియోలు ఏంటి ? అంతకు మించి వీడియోలకు జనాదరణ ఎలా పెంచుకోవాలో తెలియకపోవడం.. పోనీ రాలేదు. అదే జీవితం అనుకొని తనువు చలించడం. ఏంటిది ?
లక్షమంది పోటీ పడితే వందమందికి కూడా సీట్ దక్కని ఐఐటీ, ఐఐఎం లాంటి సంస్థల్లో సీట్ సాధించిన వారు నిస్సందేహంగా తెలివైన వారే ! కానీ రెండేళ్లు ప్రేమించినా అబ్బాయి తత్త్వం అర్థం చేసుకోలేని బేలతనం.. ఒకసారి అబార్షన్ అయితే అటుపై పుట్టే పిలల్లకు మానసిక వైకల్యం వచ్చే ప్రమాదం పెరిగిపోతుంది అని తెలుకోలేని అజ్ఞానం. అవతలి వాడు ప్రేమిస్తున్నది తన జీతాన్ని.. తనకు కంపెనీ ఇచ్చిన షేర్లను అని తెలుసుకోలేని అమాయకత్వం.. ఏంటివన్నీ?
ఫిజిక్స్, కెమిస్ట్రీ, మేనేజ్‌మెంట్, మెడికల్ సైన్స్, ఇంజనీరింగ్, మాథ్స్ లాంటి సబ్జెక్టులలో నైపుణ్యం సాధిస్తే అకాడమిక్ లేదా డొమైన్ ఇంటలిజెన్స్ అంటారు. సంగీతం లో పట్టుంటే మ్యూజిక్ ఇంటలిజెన్స్.. భాషపై పట్టుంటే లింగ్విస్టిక్ ఇంటలిజెన్స్.
శ్రీదేవి. ఒకనాటి యువకుల కలల రాణి. అద్భుత నటి. కానీ అదివరకే పెళ్ళైన ఒక వ్యక్తిని పెళ్లి చేసుకొంది. అనూహ్య పరిస్థితుల్లో లోకాన్ని వీడి వెళ్లిపోయింది. ఇక మరో ప్రముఖ నటి సావిత్రి ఎలా మోసపోయిందో మహానటి సినిమా పుణ్యమా అని చాలామందికి తెలిసింది. తెలివైన వారు ప్రతిభావంతులు ఇలా మోసపోతారెందుకు? చాలా మందికి అర్థం కాని విషయం ఒకటుంది. తెలివంటే కేవలం పాఠ్యఅంశాలపై పట్టుసాధించి మార్కులు, ర్యాంకులు కొట్టడం కాదు .
మీకందరకు ఒక కాలేజీ మిత్రుడుంటాడు. కాలేజి ఎగ్గొట్టి జులాయిలా బలాదూర్ తిరిగేవాడు. కాలేజీలో పుస్తకాలతో కుస్తీ పట్టే వారెందరో ఇప్పుడు సర్కారీ క్లర్కులుగా ఉంటే.. మీరనుకున్న ఆ జులాయి కాంట్రాక్టర్‌గానో, బిజినెస్‌మేన్‌గానో అవతరమెత్తి కోట్లు కూడబెట్టివుంటాడు. కేవలం లక్ లేదా పలుకుబడి అనుకొంటే అది మీ అమాయకత్వం అవుతుంది. ఆలోచించండి. ఇదెలా సాధ్యం ?
సోషల్ ఇంటలిజెన్స్.. సామాజిక తేలితేటలు.. ఎమోషనల్ ఇంటలిజెన్స్.. భావోద్వేగ తెలివితేటలు. ఈ రెండూ లేకపోతే ఎన్ని మార్కులు వచ్చినా, ఎంత సంపద ఉన్నాఅన్ని బండి సున్నాయే. ఎలాగంటారా ?
మార్కులు, జీతం, సంపద ఇవన్నీ లక్షల్లో. సామజిక తేలితేటలు జీరో. ఇప్పుడు ఈ జీరోతో ఆస్తిని సంపాదనను గుణించండి. ఏమొచ్చింది? బండి సున్నా. అవునా కదా ? సామాజిక తెలివితేటలు ఉంటే ఆ సంఖ్యను ఆస్తి / జీతంతో గుణించండి. అనేక రెట్లు పెరుగుతుంది.
సామాజిక తేలితేటలు లేక మలిమొఘల్ చక్రవర్తులైన ఫారూఖ్ షియార్, రఫీ ఉద్ డారాజ్, రఫీ ఉద్దీన్ లాంటి వారు సయ్యిద్ సోదరుల చేతిలో చిక్కి విలవిలలాడి, చరిత్ర మరుగయ్యారు. ఎమోషనల్ ఇంటలిజెన్స్ లేక పెద్ద సినిమాల్లో హీరోగా నటించినా అటుపై అవకాశాలు రావడం లేదని ఆత్మహత్య చేసుకొన్న వారొకరు. డిప్రెషన్ లో మరొకరు. దీర్ఘకాలం కోమా.. ఉరి.. ఇలా మరణాన్ని పొందినవారు ఇంకొందరు. తాత సంపాదించిన ఆస్తిని తగలెట్టేసి వ్యాపారాన్ని దివాళా తీయించిన వారు ఎందరో !
ఇప్పుడు మీరు ఆలోచించాల్సింది ఈ వ్యక్తులు ఎవరు అని కాదు. ఎమోషనల్ సోషల్ ఇంటలిజెన్స్‌ను పిలల్లకు ఎలా నేర్పాలి? ఇందులో స్కూల్ , కాలేజీ పాత్ర ఏంటి ? తల్లితండ్రులుగా మన పాత్ర ఏంటి అని?
ఆయన నాలుగో పెళ్ళానికి మూడో భర్త ఎవరు? ఆ వీడియోలో ఆమె ఒయ్యారాన్ని ఒలక పోసిందా? ఇలాంటి మనకు అవసరం లేని విషయాలపై మీరు ఆసక్తి ప్రదర్శిస్తూ సమయాన్ని వినియోగిస్తుంటే.. మీ పిలల్లు ఇంటర్నెట్ చీకటి ప్రపంచంలో దొరికే వీడియోలకు బానిసలై మీ చేయి దాటి పోతారు. ఆవు/ఎద్దు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? పిల్లలకు సోషల్ ఇంటలిజెన్స్ ఎమోషనల్ ఇంటలిజెన్స్ ఎలా నేర్పాలో ఆలోచిస్తూ ఉండండి.
- అమర్నాద్ వాసిరెడ్డి
ప్రముఖ ఉపాధ్యాయులు, పరిశోధకులు, మనస్తత్వ పరిశీలకులు
Comments
Please login to add a commentAdd a comment