సరస్సులో నుంచి తీసుకొచ్చిన తెల్లటి కలువను చూసుకుంటున్న యువతులు, ప్రకృతిలో పూసిన పూలన్నింటినీ తనలో ఇముడ్చుకున్న ఫ్లవర్‌పాట్, కొండల బారుల మధ్య వంపులు తిరుగుతూ ప్రవహిస్తున్న నది, విశాలమైన సరస్సుకు ఈ ఒడ్డున రంగురంగుల పూలరెమ్మతోపాటు ఆవలి ఒడ్డున సుదూరంగా కనిపించీ కనిపించకుండా ఉన్న కొబ్బరిచెట్లు, పార్కులో చక్కగా వరుసగా విరగబూసిన చెట్లు, కొండలమీద నుంచి నేలకు దూకుతూ కింద ఉన్న శివలింగానికి అభిషేకం చేస్తున్న తెల్లటి జలధారలు, కలర్ పాలెట్‌లోని రంగులన్నింటినీ వంతుల వారీగా అద్దుకున్న చెట్లు... ఏ బొమ్మ చూసినా ప్రకృతికి ప్రతిబింబంగానే కనిపిస్తుంది. హేమనళిని చిత్రాలను చూస్తే ప్రకృతిని ఆవిష్కరించడానికే ఆమె కుంచె పట్టుకుందా అనిపిస్తుంది.
హైదరాబాద్‌కు చెందిన హేమనళినీ రెడ్డి ఇలస్ట్రేటర్, ఫొటోగ్రాఫర్, రైటర్ కూడా. ఆర్టిస్టుగా బిజీగా ఉన్న హేమనళిని సైన్స్ స్టూడెంట్. ఐఐటీ బాంబేలో కోర్సు పూర్తయిన తరవాత మైక్రో బయాలజీ లెక్చరర్‌గా కెరీర్ మొదలు పెట్టారామె. భర్త ఉద్యోగరీత్యా యూఎస్‌లో అడుగుపెట్టిన హేమ కెరీర్‌లో ఓ విరామం. ఆ విరామం ఆమెను ప్రకృతి ప్రేమికురాలిని చేసింది. అత్యంత చల్లని వాతావరణంలో చెట్ల ఆకులు కూడా పూలలాగ గులాబీరంగును సంతరించుకోవడం వంటి ఆశ్చర్యకరమైన మార్పులు ఆమెను మళ్లీ కుంచె పట్టుకునేలా చేశాయి.
కుంచె కవనం
ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లా, చింతలపూడి సమీపంలోని పోతునూరు మాది. గోదావరి జిల్లాల్లో నేను చూసిన ప్రకృతి సౌందర్యం ఒక పార్శ్వం అయితే యూఎస్‌లో చూసిన వైవిధ్యత మరో పార్శ్వం. నాకు ఫొటోలు తీయడం కూడా హాబీ. నా మనసుకు నచ్చిన ఒక్కో ప్రకృతి దృశ్యాన్ని ఫొటో తీసుకోవడం, ఆ చిత్రాన్ని రంగుల్లో ఆవిష్కరించడమే నా లైఫ్‌గా మారింది. సైన్స్ స్టూడెంట్‌గా జీవం–జీవితం నాకిష్టమైన అంశాలు. దాంతో నా చిత్రాలు ప్రకృతి–జీవితం ఇతివృత్తాలుగానే సాగుతున్నాయి. నా చిన్నప్పుడు ఎస్సే రైటింగ్‌తోపాటు రంగోలీలో బహుమతులందుకున్నాను.
బొమ్మలు వేయడంలో పెద్ద ప్రావీణ్యం లేదు కానీ వేసేదాన్ని. పై చదువుల బిజీలో పడి వదిలేసిన కుంచెను అమెరికాలో పట్టుకున్నాను. పచ్చదనానికి చిరునామా అయిన మనదేశంలో చెట్లు అన్ని షేడ్‌లలో ఉండవు. అక్కడి ప్రకృతి వైవిధ్యం నన్ను ముగ్ధురాలిని చేసింది. వాతావరణ మార్పులకు అనుగుణంగా చెట్లు కొత్త రంగులను సంతరించుకోవడం, మనదేశంలో చూడని అనేక షేడ్‌లను అక్కడి చెట్లలో చూశాను. విదేశాల్లో ఉన్న ఐదేళ్లలో అనేక ఎగ్జిబిషన్‌లలో పాల్గొన్నాను. యూఎస్‌లో షికాగో, మాసాచుసెట్స్, మిషిగన్‌తోపాటు సింగపూర్, అబుదాబి, దుబాయ్‌లలో చిత్రాలను ప్రదర్శించే అవకాశం వచ్చింది. ఇండియాకి వచ్చిన తర్వాత కూడా కుంచెను వదల్లేదు.
చిత్రం... అందమైన మాధ్యమం
సామాజికాంశాలను సామాన్యులకు అర్థమయ్యే రీతిలో కళ్లకు కట్టడానికి చిత్రం గొప్ప మాధ్యమం. సమాజాన్ని చైతన్యవంతం చేయగల శక్తి ఆర్టిస్ట్‌కి ఉంటుంది. చిత్రాలతో చారిటీ షోలు నిర్వహించి పేదపిల్లలకు సహాయం చేయవచ్చు. ఆర్టిస్టులు టెక్నాలజీతోపాటు ఎదుగుతూ కళకు సొబగులద్దాలి. తమ కళను విశ్వవ్యాప్తం చేసుకోవాలి. ఈ తరంలో సోషల్‌మీడియా అందుకు సరైన వేదిక. ఆన్‌లైన్ వేదికగా నిర్వహించిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ పోటీలో వారిచ్చిన సమయంలోనే బొమ్మ పూర్తి చేసి అవార్డు అందుకోగలిగాను.
బాంబే ఆర్ట్ సొసైటీ నిర్వహించిన ‘కలర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్, 75 ఇయర్స్ ఆఫ్ ఆర్ట్’ ఆన్‌లైన్ ఎగ్జిబిషన్ ద్వారా నా చిత్రాలకు దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఇక సాహిత్యం పట్ల ఆసక్తి కొద్దీ బాలాంత్రపు వెంకటరమణ గారి రచనలకు వేసిన చిత్రాలు ఆర్టిస్ట్‌గా నాకు పరిపూర్ణతను తెచ్చాయనిపించింది. ఇంటర్నేషనల్ ‘కళారత్నం’ మహిళా ప్రతిభా పురస్కారం, విశిష్ట కళారత్న వంటి గుర్తింపులనెన్నింటినో అందుకున్నాను. అన్నింటినీ మించిన ఆనందం... వడ్డాది పాపయ్య, బాపు వంటి మహోన్నత చిత్రకారుల గురించి వెలువరించిన ‘ఆర్ట్ ఆఫ్ ఏపీ’ పుస్తకంలో నాకు చోటు దక్కడం’’ అని సంతోషాన్ని వ్యక్తం చేశారు ఆర్టిస్ట్ హేమ నళిని.
– వాకా మంజులారెడ్డి,
సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
Comments
Please login to add a commentAdd a comment