ఆషాఢమాసం. శుక్లపక్షం. చతుర్దశి చంద్రుడు పశ్చిమ ఆకాశంలోంచి కిందికి వాలిపోయాడు. అది ఒక విశాల వనంలోని పచ్చికబయలు. దానిమధ్య పెద్ద మర్రిచెట్టు. దానికింద ఎత్తైన దిబ్బ. దాని మీద కూర్చుని ఉన్నారు ఐదుగురు తాపసులు. తెల్లవారకముందే సమీప గంగానదిలో స్నానం చేసి వచ్చి తపోసాధన గురించి తర్కించుకుంటున్నారు. తెల్లని నార వస్త్రాలు ధరించారు. వారిలో పెద్దవాడు కొండణ్ణ. అతని చూపు పొదలమాటున లేచి తత్తర పడుతున్న జింకకేసి పడింది. అందరూ అటుకేసి చూశారు. ఎవరో కాషాయ చీవరం ధరించిన ఒక వ్యక్తి వారికేసి వస్తూ కనిపించాడు.
‘మిత్రులారా! అలా నడిచేది ఎవరు? గుర్తించారా? శాక్య గౌతముడే!’’ అన్నాడు అశ్వజిత్తు. ‘‘మిత్రమా! నీవన్నది నిజమే. అతను తపో భ్రష్టుడు. అతను రాగానే మనం గౌరవించకూడదు. లేచి నిలబడకూడదు’’ అన్నాడు బద్దియుడు. ‘‘కూర్చోమని ఆసనం ఇవ్వకూడదు’’ అన్నాడు మహానామ! ‘‘ప్రత్యేక గౌరవ వందనాలు చేయొద్దు. ఆసనం ఇద్దాం’’ అన్నాడు పెద్దవాడైన కొండణ్ణ. ‘‘కానీ... ఆ తేజోమూర్తి వారి దగ్గరకు రాగానే.. ఆ ముఖంలోని జ్ఞానతేజస్సుని చూసి.... ఒకరికొకరు అప్రయత్నంగానే లేచి నిలబడ్డారు. నమస్కరిస్తూ ఎదురు వెళ్లారు. ఆహ్వానించారు. ఉచితాసనం ఇచ్చారు. కాళ్ళకు నీళ్ళిచ్చారు.
‘‘మిత్రమా! శాక్య గౌతమా!’’ అన్నారు. ‘‘భిక్షువులారా! నేను ఇప్పుడు గౌతముణ్ణి కాను. జ్ఞానోదయం అయిన బుద్ధుణ్ణి తథాగతుణ్ని భదంతను. కాబట్టి నన్ను భదంతా (భంతే) అని సంబోధించాలి’’ అన్నాడు. బుద్ధత్వం అనే పదం వినగానే వారి మనస్సు వికసించింది. గౌరవంతో వంగి నమస్కరించారు. ఆకాశంలో నల్లని మేఘాల బారు మెల్లగా జింకలవనం మీదుగా నైరుతి దిక్కుకేసి కదలిపోతోంది...! అప్పటికి ఆరేళ్ళ క్రితం... జ్ఞాన సాధన కోసం దుఃఖ నివారణి మార్గం కోసం అన్వేషిస్తూ తన రాజ్యాన్నీ పదవినీ, రాజభోగాల్నీ వదిలి వచ్చేశాడు సిద్దార్థుడు. అతనితోపాటే ఆస్థాన పురోహితుడు కొండణ్ణ కూడా వచ్చాడు. సిద్ధార్థుడు పుట్టినప్పుడు ‘‘మహారుషి అవుతాడు’’ అని చెప్పింది ఈ కొండణ్ణే.
ఇంకా వారితో పాటు నలుగురు పురోహిత పుత్రులూ వచ్చేశారు. సిద్దార్థుడు ఆరేళ్ళు అనేకమంది, రుషుల దగ్గరకూ, తాత్వికుల దగ్గరకూ, గురువుల దగ్గరకూ తిరిగాడు. చివరికి ఈ ఐదుగురు మిత్రులతో కలిసి నిరంజనా నదీ తీరంలో కఠోర తపోసాధనకు దిగాడు. తిండి మానాడు, నీరసించి పడిపోయాడు. ‘‘ఇది సరైన సాధన కాదు’’ అని కొద్దిగా ఆహారం తీసుకోసాగాడు. దానితో అతను తపో భ్రష్టుడయ్యాడు’’ అని కోపగించి, మిగిలిన ఐదుగురూ అతణ్ణి వదిలి వచ్చేశారు. ఆ తర్వాత బుద్ధగయలో జ్ఞానోదయం పొంది సిద్ధార్థుడు బుద్ధుడయ్యాడు. దుఃఖ నివారణా మార్గాన్ని తెలుసుకున్నాడు. దాన్ని బోధించడానికి, తనని దూషించి వెళ్లిన వారిని వెతుక్కుంటూ వచ్చాడు.
ఆరోజు.... నాల్గు ఆర్య సత్యాల్ని, అష్టాంగ మార్గాన్నీ, మధ్యమ మార్గాన్నీ వివరించాడు. విన్న వెంటనే కొండణ్ణ అర్థం చేసుకున్నాడు. దుఃఖ విముక్తి పొందాడు. ఆ తర్వాత మిగిలిన వారు ఆ మార్గాన్ని దర్శించారు. వారితో బౌద్ధ సంఘం ఏర్పడింది. కాబట్టి ఈ ఆషాఢ పున్నమి ‘‘సంఘం పుట్టిన రోజుగా’’ ప్రసిద్ధి పొందింది. తాము తెలుసుకున్న ధర్మాన్ని (దుఃఖ నివారణి మార్గాన్ని) ప్రపంచానికి చాటాలనుకున్నారు. కాబట్టి దీన్ని ‘‘ధర్మ చక్ర ప్రవర్తనా దినం’’ అని పిలుస్తారు. బుద్ధుడు వారికి చేసిన మొదటి ప్రవచనం ధర్మ చక్ర ప్రవర్తనా సూత్రంగా, రెండవ ప్రవచనం ‘అనాత్మక లక్షణ సూత్రం’గా బౌద్ధ సాహిత్యంలో ప్రసిద్ధి. విముఖుల్ని సుముఖులుగా చేసిన గురువు కాబట్టి ‘గురుపూర్ణిమగా’ ఈ ఆషాఢ పున్నమిని ప్రపంచ బౌద్ధులు జరుపుకుంటారు.
– డా. బొర్రా గోవర్ధన్
(చదవండి: కదిలించే కాంతి గురువు)
Comments
Please login to add a commentAdd a comment