ప్రపంచంలో చాలామంది ఒకే తరహా పనిని ఏళ్లుగా చేస్తూ తమ జీవనాన్ని కొనసాగిస్తుంటారు. కొందరు మాత్రం ఏకకాలంలో ఎన్నో పనులు చేస్తూ సమాజంలో తమకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరుచుకోవాలని ఎప్పుడూ ప్రయత్నిస్తుంటారు. అలాంటి వారిలో ఒకరు ఇందు గుర్జార్. జైపూర్‌వాసి అయిన 32 ఏళ్ల ఇందు గుర్జార్ సింగిల్ పేరెంట్‌గా తన తొమ్మిదేళ్ల కూతురును చూసుకుంటూ, బ్యాంకు ఉద్యోగం చేస్తూ, అంతర్జాతీయ క్రీడాకారిణిగా, మౌంటెనీర్ బైకర్‌గా గుర్తింపు తెచ్చుకుంటోంది. సవాళ్లను అధిగమిస్తూ ఇందు చేస్తున్న ప్రయత్నం ఒడిదొడుకులను ఎదుర్కొనేవారికి స్ఫూర్తిగా నిలుస్తుంది.
‘‘సమస్యలు వచ్చేదే మనలోని శక్తిని గుర్తించడానికి. ధైర్యం తెచ్చుకొని ప్రయత్నిస్తే తిరిగి మనకో కొత్త జీవితం ఏర్పడుతుంది. నా చిన్నతనంలో మాది దిగువ మధ్యతరగతి కుటుంబం. మా నాన్నకు టీ కొట్టు ఉండేది. కానీ, దాని నుంచే ఆయన తన కొడుకులలో ఒకరిని డాక్టర్‌ని చేసి, మా అందరికీ ఉత్తమవిద్యను అందించడానికి ప్రయత్నించాడు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నా. చిన్ననాటి నుంచి క్రీడలంటే చాలా ఆసక్తి. రాష్ట్రస్థాయిలో బాస్కెట్‌బాల్, బ్యాడ్మింటన్ ఆడాను. కాలేజీలో స్పోర్ట్స్ ఆప్షన్ లేక΄ోవడంతో నా ఇష్టాన్ని అక్కడితో వదిలేయాల్సి వచ్చింది.
గృహహింస
మా కమ్యూనిటీలో అమ్మాయిలకు పెళ్ళిళ్లు త్వరగా చేస్తారు. కానీ, నా తల్లిదండ్రుల సహకారంతో గ్రాడ్యుయేషన్ వరకు చదువుకున్నాను. ఆ వెంటనే పెళ్లి చేశారు. పెళ్లి నా జీవితాన్ని విచ్ఛిన్నం చేసింది. బిడ్డను కనాలని, వరకట్నం తేవాలని... ప్రతిరోజూ ఏదో ఒక విషయం మీద నరకం చూసేదాన్ని. అత్తింటివాళ్లు నా తల్లిదండ్రులకు నా మీద ఏవేవో చాడీలు చెప్పేవారు. పాప పుట్టిన తర్వాత పుట్టింటి నుండి తిరిగి అత్తవారింటికి వెళ్లడానికి భయపడ్డాను. కానీ, పెద్దవారిని కూర్చోబెట్టి, ఒప్పించి తిరిగి తీసుకెళ్లారు. కానీ, అక్కడి పరిస్థితుల్లో ఏ మాత్రం మార్పు లేదు.
నెల రోజుల వ్యవధిలోనే మా అత్తింటిని వదిలి, తిరిగి పుట్టింటికి వచ్చేశాను. ఏడాది కాలం పుట్టింట్లోనే ఉన్నాను. పరిస్థితుల్లో మార్పు రాదని గ్రహించి, విడాకులకు కోర్టులో కేసు వేశాను. ఒంటరిగా బిడ్డను పెంచడం నాకు అంత తేలికైన పనికాదు. ఇంటి నిర్వహణకు, నా ఇష్టాలను నెరవేర్చుకోవడానికి ఇంధనం అవసరం. ఆ మనోవర్తి రూపంలో ఆ ఇంధనం రాబట్టుకోవడం కోసం ఏడేళ్లపాటు విడాకుల కేసుపై పోరాడుతూనే ఉన్నాను. కానీ, న్యాయం జరగలేదు.
డిప్రెషన్ నుంచి కోలుకొని...
ఆటుపోట్లతో ఉన్న జీవితాన్ని చూసి చాలా బాధపడేదాన్ని. ఒక వ్యక్తి జీవితంలో చెడుకాలం వచ్చినప్పుడు పరిస్థితుల ముందు లొంగిపోతాడు. కానీ, నాకు నేనుగా ఏదైనా లక్ష్యాన్ని ఏర్పరుచుకోవాలనుకున్నాను. బ్యాంకు ఉద్యోగం సంపాదించుకొని, నాకు నేనుగా జీవించడం మొదలుపెట్టాను.
ఫిట్‌గా ఉండేందుకు..
ఉద్యోగం చేయడం మొదలుపెట్టిన కొన్ని రోజులకే కోవిడ్ వచ్చింది. మొదటి వేవ్‌లో కరోనా బాధితురాలిని అయ్యాను. వాడిన మందుల వల్లనేమో కోవిడ్ తర్వాత బరువు పెరగడం మొదలైంది. దీంతో ఫిట్‌గా ఉండేందుకు రోజూ రెండు–మూడు కిలోమీటర్లు సైక్లింగ్ చేసేదాన్ని. ఆ తర్వాత స్టేడియంకు వెళ్లడం మొదలుపెట్టాను. అక్కడ సైక్లిస్టుల బృందాన్ని కలిశాను. ఆ క్రీడలో పాల్గొనడానికి వయోపరిమితి ఏమీ లేదని తెలిసింది.
దాంతో నాలో చిన్న ఆశ కలిగింది. బహుశా విధి నాకు అలాంటి అవకాశం ఇచ్చింది అనుకున్నాను. మొదట్లో రెండు–మూడు కిలోమీటర్లు సైక్లింగ్ చేసే నేను ఈ రోజు 50– 100 కిలోమీటర్లు తిరుగుతున్నాను. యూసీఐ (ఇంటర్నేషనల్ సైకిలిస్ట్ యూనియన్) ఎలిమినేటర్ ప్రపంచకప్‌లో పాల్గొన్నాను. ఎన్నో పెద్ద పెద్ద ఈవెంట్లలో పాల్గొని, అంతర్జాతీయ సైక్లిస్టులను కలిశాను.
పర్వత బైకర్‌గా...
వృత్తిరీత్యా బ్యాంకర్‌గానే కాకుండా మూడేళ్లుగా మౌంటెన్ బైకర్‌గా కూడా ఉన్నాను. పర్వతాల్లో చేసే సాహసోపేతమైన ΄ోటీల్లో విజేతగా నిలుస్తుండేదాన్ని. ఆ పోటీలు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చేవి. రెండేళ్ల క్రితం లదాఖ్‌లోని లేహ్‌లో జరగిన యుసిఐ ఎలిమినేటర్ ప్రపంచ కప్‌లో ఎలైట్ మహిళల విభాగంలో భారతదేశానికి ్రపాతినిధ్యం వహించడం గర్వంగా అనిపించింది.
శక్తిని గుర్తించాలి..
నా కూతురికి ఇప్పుడు తొమ్మిదేళ్లు. ఆమె కూడా క్రీడల్లో చురుకుగా పాల్గొనాలని కోరుకుంటున్నాను. అందుకు ట్రైనింగ్ కూడా ఇప్పిస్తున్నాను. చదువుతోపాటు టాలెంట్‌ను కూడా గుర్తించి, దానిని మెరుగుపరుచుకునే ప్రయత్నం చేయాలని అమ్మాయిలకు చెబుతుంటాను. ఈ నెల పదిన జరిగే రేస్‌లో పాల్గొంటున్నాను. గెలుపు – ఓటమి, విజయం – అపజయం అని చింతించకుండా 100 శాతం శక్తినీ, సామర్థ్యాన్నీ వినియోగించి లక్ష్యాన్ని సాధించి, ఫలితాన్ని భగవంతునికే వదిలేయాలి. ఇంకో విషయం.. ఏదైనా కొత్తగా చేయడానికి వయసుతో సంబంధం లేదు. ఏ వయసులోనైనా విజయం సాధించవచ్చు. మీకుండాల్సింది ధైర్యం మాత్రమే’’ అంటుంది
ఇందు.
Comments
Please login to add a commentAdd a comment