అరటి కాయ ఉల్లిపాయ వేపుడు | Banana Special Varieties Recipes In Sakshi Food | Sakshi
Sakshi News home page

ఓ పూట మీ అరటి కోటా 

Published Sun, Oct 11 2020 9:08 AM | Last Updated on Sun, Oct 11 2020 9:53 AM

Banana Special Varieties Recipes In Sakshi Food

ఇంటిలో అరటి కాయలు ఉంటే చాలు.. వంట చేసేవాళ్లకు పని చాలా సులువు అవుతుంది. కాస్త ఓపిక, మరికాస్త తీరిక ఉండాలే కానీ  అరటితో ఎన్నో రకాల వంటలు చేసుకోవచ్చు.  మీరూ ప్రయత్నం చేసి చూడండి.. 

అరటి కాయ చిప్స్‌
కేరళ, తమిళనాడు లలో అరటి కాయ చిప్స్‌ వాడకం ఎక్కువ. వీరు అరటికాయ చిప్స్‌ను కొబ్బరి నూనెలో వేయించి  చేస్తారు. తమిళనాడు వారు  ఈ చిప్స్‌ను సాంబారులో నంచుకుని  తింటారు. అల్పాహారంగా కూడా తింటారు.

కావలసినవి: అరటికాయలు – 2; నూనె – అర కేజీ; మసాలా కారం – 2 టీ స్పూన్లు; ఉప్పు – తగినంత.

తయారీ:

  • అరటి కాయల పై చెక్కు తీసి, సన్నగా చక్రాల్లాగ నీళ్లలోకి తరుగుకోవాలి
  • స్టౌ మీద  బాణలిలో నూనె పోసి, పొగలు వచ్చే వరకు కాగనివ్వాలి
  • చక్రాలుగా తరిగిన అరటికాయ ముక్కలను నూనెలో వేసి ఎర్రగా వేయించుచి, ఒక ప్లేటులోకి తీసుకోవాలి
  • మసాలా కారపు పొడి, తగినంత ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి
  • ఈ చిప్స్‌ను వేడి వేడి అన్నంలో కూరగా లేదా సాంబారులో అప్పడాల బదులుగా నంచుకుని తినవచ్చు.

అరటి  కాయ బజ్జీలు
కావలసినవి: అరటికాయ – 1; సెనగ పిండి – ఒక కప్పు; బియ్యప్పిండి – పావు కప్పు; మిరప కారం – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత; ధనియాల పొడి – అర టీ స్పూను; కసూరీ మేథీ – ఒక టీ స్పూను; వంట సోడా – చిటికెడు; నూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా; వేయించిన పల్లీలు – ఒక టేబుల్‌ స్పూను; సన్నటి ఉల్లి తరుగు – అర కప్పు; నిమ్మరసం – ఒక టేబుల్‌ స్పూను.

తయారీ:

  • అరటి కాయల తొక్కు తీసి, సన్నగా చక్రాల్లా తరిగి, ఉప్పు నీళ్లలో వేసి పక్కన ఉంచాలి
  • ఒక గిన్నెలో సెనగ పిండి, బియ్యప్పిండి, మిరపకారం, ఉప్పు, ధనియాల పొడి, కసూరీ మేథీ, వంట సోడా వేసి బాగా కలపాలి
  • తగినన్ని నీళ్లు జత చేస్తూ బజ్జీల పిండి మాదిరిగా కలపాలి
  • స్టౌ మీద బాణలిలో నూనె కాగాక, అరటి కాయ చక్రాలను ఒక్కోటి పిండిలో ముంచుతూ నూనెలో వేసి రెండువైపులా దోరగా వేయించి, పేపర్‌ టవల్‌ మీదకు తీసుకోవాలి
  • చాకుతో బజ్జీలను ఒక వైపు సన్నగా కట్‌చేయాలి
  • మూడు పల్లీలు, ఉల్లి తరుగు స్టఫ్‌ చేసి, పైన నిమ్మరసం కొద్దిగా వేయాలి
  • వేడివేడిగా తింటే రుచిగా ఉంటాయి.

అరటి కాయ ఉల్లిపాయ వేపుడు

కావలసినవి: అరటి కాయలు – 3 (పై చెక్కు తీసుకుని  నీళ్ళల్లో కాయలను ముక్కలుగా  తరుగు కోవాలి); పెద్ద ఉల్లిపాయలు – 2 (పెద్ద పెద్ద ముక్కలుగా చేసుకోవాలి); మిరప కారం – 2 టీ స్పూన్లు; నూనె – వేయించటానికి తగినంత; ఉప్పు – తగినంత; పసుపు – చిటికెడు; వేయించిన పల్లీలు – గుప్పెడు; పుట్నాల పప్పు – గుప్పెడు; జీలకర్ర – ఒక టీ స్పూను; ఎండు మిర్చి – 4.

తయారీ:

  • పల్లీలు, పుట్నాలపప్పు, జీలకర్ర, ఎండు మిర్చిలను మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసి పక్కన ఉంచాలి 
  • స్టౌ మీద బాణలిలో సుమారుగా 50 గ్రాముల నూనె పోసి, కాగాక, తరిగిన  అరటికాయ ముక్కలు, ఉల్లిపాయ  ముక్కలు, ఉప్పు వేసి మూత పెట్టి  ఓ పదిహేను  నిముషాలు ముక్కలు మెత్త పడే వరకు మగ్గనివ్వాలి
  • మధ్యలో ముక్కలను అట్లకాడతో  కలుపుతుండాలి
  • చివరలో తగినంత  ఉప్పు, కారం, పల్లీల మిశ్రమం పొడి వేసి మరో మూడు నిముషాలు  ఉంచి దింపుకుని, వేరే గిన్నెలోకి తీసుకోవాలి
  • ఈ వేపుడు అన్నంలోకి రుచిగా ఉంటుంది.

అరటి  కాయ  పచ్చడి

కావలసినవి: అరటి కాయలు – 2; ఉల్లి తరుగు – అర కప్పు; పచ్చిమిర్చి – 4 (చిన్నచిన్న ముక్కలు చేసుకోవాలి); కరివేపాకు – 3 రెమ్మలు; కొత్తిమీర – ఒక చిన్న కట్ట (సన్నగా తరగాలి). పోపు కోసం: నూనె  – 3 టీ స్పూన్లు; ఎండు మిర్చి – 5; మినప్పప్పు – ఒకటిన్నర టీ స్పూన్లు; ఆవాలు – 1 టీ స్పూను; ఇంగువ – కొద్దిగా ; పసుపు –  కొద్దిగా; ఉప్పు – తగినంత.

తయారీ:

  • అరటికాయలను శుభ్రంగా కడిగి తడి పోయేలా తుడవాలి
  • స్టౌ  వెలిగించి మంట కొద్దిగా తగ్గించి, అరటికాయలు మెత్తగా అయ్యేవరకు కాల్చి తీసేయాలి
  • చేతులు తడి చేసుకుంటూ అరటి కాయల పై చెక్కు తీసేయాలి
  • స్టౌ మీద బాణలిలో నూనె కాగాక మినప్పప్పు, ఆవాలు, ఎండు మిర్చి, ఇంగువ వేసి వేయించుకోవాలి
  • కరివేపాకు, పచ్చిమిర్చి తరుగు జత చేసి మరోమారు వేయించి దింపి చల్లారనివ్వాలి
  • మిక్సీలో ఎండు మిర్చి, ఉప్పు, పసుపు వేసి మెత్తగా చేసుకోవాలి
  • కాల్చి, తొక్క తీసిన అరటి కాయలు జత చేసి మరోమారు మిక్సీ పట్టి, ఒక ప్లేటులోకి తీసుకోవాలి
  • ఉల్లి తరుగు, మిగిలిన పోపు, కొత్తిమీర జత చేసి, చేతితో బాగా కలుపుకుని, గిన్నెలోకి తీసుకోవాలి (పచ్చి అరటికాయలనే వాడాలి. కొద్దిగా పండినా పచ్చడి రుచి మారిపోతుంది)

అరటి కాయ పెసర పప్పు పొడి కూర

కావలసినవి: అరటి కాయలు – 4; పెసరపప్పు – ఒక కప్పు; పసుపు – చిటికెడు; పచ్చి మిర్చి – 4 (చిన్న చిన్న ముక్కలు చేయాలి); నూనె – 4 టీ స్పూన్లు; మినప్పప్పు – ఒక టీ స్పూను; జీలకర్ర  – అర టీ స్పూను; ఆవాలు –  అర టీ స్పూను; ఇంగువ  –  కొద్దిగా; ఉప్పు – తగినంత; మిరపకారం – ఒక టీ స్పూను; కరివేపాకు – 2 రెమ్మలు నూనె – తగినంత; ఎండు మిర్చి – 4 (ముక్కలు చేయాలి).

తయారీ:

  • ముందుగా  అరటి కాయల పై చెక్కు తీసీ, ఉప్పు వేసిన నీళ్లలోకి ముక్కలు తరుగుకోవాలి
  • ఒక గిన్నెలో పెసరపప్పు వేసి, బాగా కడగాలి
  • అరటికాయ ముక్కలు, తగినన్ని నీళ్లు జత చేసి, గిన్నెను స్టౌ  మీద ఉంచి ఉడికించి (ఉడికించేటప్పుడు ఉప్పు వేయకూడదు)  దింపేయాలి
  • నీటిని  వడ కట్టుకుని  ముక్కలపై  పావు స్పూను  పసుపు వేయాలి
  • స్టౌ మీద బాణలిలో నూనె కాగాక, వరుసగా ఎండు మిర్చి ముక్కలు , మినపప్పు , జీలకర్ర, ఆవాలు, ఇంగువ,  కరివేపాకు వేసి వేగాక, పచ్చి మిర్చి  ముక్కలు కూడా  పోపులో వేసుకుని రెండు నిముషములు  వేయించుకోవాలి
  • ఉడికించి  సిద్ధంగా  ఉంచుకున్న అరటి కాయ పెసరపప్పు మిశ్రమాన్ని పోపులో వేసుకోవాలి
  • ఉప్పు, మిరప కారం జత చేసి, బాగా కలియబెట్టి, మూత  పెట్టాలి
  • మధ్యమధ్యలో అట్లకాడతో  కదుపుతూ మరో ఐదు నిముషాలు ఉంచి, దింపి ఒక గిన్నెలోకి తీసుకోవాలి
  • ఈ కూర అన్నంలోకి, చపాతీలలోకి రుచిగా ఉంటుంది.

అరటి కాయ మసాలా కూర

కావలసినవి 
అరటికాయలు  – 2; చింతపండు  –  నిమ్మకాయంత (పావు గ్లాసు నీళ్ళల్లో నానబెట్టుకోవాలి); ఉల్లి తరుగు – పావు కప్పు; నూనె  –  4 టీ  స్పూన్లు; ఉప్పు  –  తగినంత; కొత్తిమీర  –  చిన్న కట్ట.మసాలా కోసం: ఎండు మిర్చి – 5; ధనియాలు  –  2 టీ స్పూన్లు; జీలకర్ర  –  అర టీ స్పూను; లవంగాలు –  5; (వీటన్నిటినీ కూర చేయటానికి గంట ముందు, పావు గ్లాసు నీళ్ళల్లో నానబెట్టుకోవాలి).

తయారీ:

  • అరటి కాయల పై చెక్కు తీసి, చిన్నచిన్న ముక్కలుగా తరిగి, ఆ ముక్కల్ని ఒక గిన్నెలో వేసుకుని ముక్కలు మునిగే  వరకు నీళ్లు పోసి, కొద్దిగా ఉప్పు వేసి స్టౌ మీద మెత్తగా ఉడికించి  నీళ్ళు వార్చుకోవాలి
  • ఉడికిన ముక్కలపై పావు స్పూను పసుపు  వేసుకోవాలి
  • ముందుగా నానబెట్టిన ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, లవంగాలకు తగినంత ఉప్పు, చింతపండు జత చేసి మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి
  • ఉల్లి తరుగును కూడా మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి
  • మసాలా ముద్దను ఒక గిన్నెలోకి తీసుకోవాలి
  • స్టౌ మీద బాణలిలో నూనె కాగాక, ఉడికించి సిద్ధంగా ఉంచుకున్న అరటికాయ ముక్కలను  వేసి మూతపెట్టి ఐదు  నిముషాలు మగ్గనివ్వాలి  సిద్ధంగా ఉంచుకున్న  మసాలా జత చేసి, మరో ఐదు నిముషాలు  మసాలా పచ్చివాసన పోయేవరకు ఉంచాలి
  • కొత్తిమీరతో అలంకరించి, కూరను గిన్నెలోకి తీసుకోవాలి  
  • చపాతీ, రోటీ, అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది (ఈ కూరను  వేడివేడిగా తింటేనే  బాగుంటుంది. మరీ  చల్లారితే కూర గట్టిపడి రుచిగా ఉండదు).

అరటి కాయ తీపి కూర

కావలసినవి: అరటి కాయలు – 3; పచ్చి మిర్చి – 10 (చిన్న చిన్న ముక్కలు చేయాలి); అల్లం – చిన్నముక్క; కరివేపాకు–3 రెమ్మలు; పసుపు – పావు టీ స్పూను; చింతపండు రసం –  ఒక టేబుల్‌ స్పూను (చిక్కగా ఉండాలి); బెల్లం తరుగు – ఒక టేబుల్‌ స్పూను ఉప్పు – తగినంత. పోపు కోసం: నూనె  – 5 టీ స్పూన్లు; ఎండు మిర్చి – 5; పచ్చి సెనగపప్పు – 2 టీ స్పూన్లు; మినప్పప్పు – 2 టీ స్పూన్లు; జీలకర్ర – పావు టీ స్పూను; ఆవాలు – అర టీ స్పూను; ఇంగువ – కొద్దిగా.

తయారీ: ∙అరటి కాయలు కడిగి పై చెక్కు తీసి, ముక్కలు చేయాలి ∙ఒక గిన్నెలో అరటికాయ ముక్కలకు తగినన్ని నీళ్లు, ఉప్పు జత చేసి స్టౌ  మీద ఉంచి, ముక్కలను మెత్తగా  ఉడికించాక, నీళ్లను వడకట్టి, ముక్కల పైన  పసుపు వేయాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె కాగాక, వరుసగా ఎండు మిర్చి, పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, ఇంగువ, అల్లం తరుగు, పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు వేసి పోపును  బాగా వేగనివ్వాలి (పచ్చి మిర్చి పోపులో మగ్గితే  కూరకి కారం పడుతుంది) ∙ఉడికించిన అరటికాయ   ముక్కలు పోపులో వేసి, ఉప్పు, చింతపండు రసం, బెల్లం తరుగు జత చేసి పది నిముషాలపాటు మూత పెట్టి  కూరను మగ్గనిచ్చి (మధ్యలో కూరను కదుపుతుండాలి) ఉడికిన తరవాత గిన్నెలోకి తీసుకోవాలి.

అరటి కాయ ఉప్మా కూర

కావలసినవి: అరటి కాయలు – 3; నిమ్మ రసం – ఒక టేబుల్‌ స్పూను; పచ్చి మిర్చి – 4 (ముక్కలు చేసుకోవాలి); అల్లం తురుము – ఒక టీ స్పూను; కరివేపాకు – 3 రెమ్మలు; కొత్తిమీర తరుగు – ఒక టేబుల్‌ స్పూను; ఎండు మిర్చి – 4 (ముక్కలు చేయాలి); పచ్చి సెనగ పప్పు – ఒక టేబుల్‌ స్పూను; మినప్పప్పు – ఒక టేబుల్‌ స్పూను; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; మెంతులు – కొద్దిగా; ఇంగువ – తగినంత; పసుపు – తగినంత; ఉప్పు – తగినంత; నూనె – 2 టేబుల్‌ స్పూన్లు; జీడిపప్పులు – 10.

తయారీ:

  • అరటికాయలకు తగినన్ని నీళ్లు జత చేసి కుకర్‌లో ఉంచి మెత్తగా ఉడికించి దింపేయాలి
  • చల్లారాక అరటికాయల మీద తొక్కు తీసేయాలి
  • స్టౌ మీద బాణలిలో నూనె కాగాక పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఇంగువ, ఎండు మిర్చి ఒకదాని తరవాత ఒకటి వేసి దోరగా వేయించాలి
  • జీడి పప్పు వేసి దోరగా వేగిన తరవాత, కరివేపాకు జత చేసి మరోమారు వేయించాలి
  • ఉడికించిన అరటి కాయ ముక్కలు వేసి గరిటెతో మెత్తగా అయ్యేలా మెదపాలి
  • పచ్చి మిర్చి తరుగు, అల్లం తురుము వేసి బాగా కలపాలి ∙ఉప్పు జత చేసి మరోమారు కలియబెట్టాలి
  • కొత్తిమీరతో అలంకరించి, కూర దింపేయాలి (అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది)

-నిర్వహణ: వైజయంతి పురాణపండ
- కర్టెసీ: ఆలూరు కృష్ణప్రసాదు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement