శివ, ప్రియ ఇద్దరూ సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు. ఇష్టపడి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ప్రియ కాస్తంత కలుపుగోలు మనిషి. ఎవరు కనిపించినా నవ్వుతూ పలకరిస్తుంది. కానీ శివకు అది నచ్చదు. ముఖ్యంగా మగవాళ్లతో మాట్లాడటం అస్సలు నచ్చదు. ఆ విషయమై తరచూ ప్రియపై కోప్పడుతుంటాడు.
‘‘నీకు ఎప్పుడూ వేరే వాళ్లతో మాట్లాడటమే ఇష్టం. నాతో మాట్లాడాలంటే కష్టం. నీ కంటికి నేనే చేతకానివాణ్ని. అంతేగా?’’ అంటూ తరచూ గొడవపడేవాడు.
‘‘నేనెంత చెప్పినా, బ్రతిమాలుకున్నా నీ ప్రవర్తనలో మార్పు లేదంటే నీకు ఎలాంటి మానసిక సమస్య ఉందో అర్థం చేసుకో’’ అని హెచ్చరించేవాడు.
మొదట్లో ప్రియ అతని మాటలు పట్టించుకోలేదు. కానీ కాలక్రమేణా ఆమె ఆలోచించడం మొదలుపెట్టింది.
‘‘శివ మాటలు నిజమేనేమో? నాకు నిజంగా మానసిక సమస్యలు ఉన్నాయేమో? లేకుంటే పదే పదే ఎందుకు అంటాడు?’’ అని అయోమయానికి గురవుతోంది.
గ్యాస్ లైట్ గురించి అందరికీ తెలుసుకదా... గ్యాస్ స్టవ్ వెలిగించడానికి ఉపయోగించేది. అలాగే శివలాంటి వ్యక్తులు వ్యక్తులు తమ మాటలు, ప్రవర్తన ద్వారా మరో వ్యక్తి భావోద్వేగాలను రెచ్చగొట్టి వారిపై అదుపు సాధిస్తుంటారు. దీన్నే ‘గ్యాస్ లైటింగ్’ అంటారు. ఈ పని చేసేవాళ్లను ‘గ్యాస్ లైటర్’ అంటారు.
వీళ్లు ఇతరులపై నియంత్రణ సాధించేందుకు ప్రమాదకరమైన మైండ్ గేమ్‌లు ఆడతారు. అబద్ధాలు చెప్తారు, సమాచారాన్ని దాచిపెడతారు, నిందలు వేస్తారు, రకరకాల కథలు చెప్పి మేనిప్యులేట్ చేసి తనపై తాను నమ్మకం కోల్పోయేలా చేస్తారు. చివరకు నియంత్రణ సాధిస్తారు.
మీ చుట్టూనే ఉంటారు...
సహోద్యోగిని ఉద్యోగం నుండి తొలగించాలని యజమానిని ఒప్పించే వ్యక్తి, తోడికోడలిని హింసించాలని అత్తను ఎగదోసే కోడలు, నిత్యం భార్యను తప్పుపడుతూ చిన్నబుచ్చే భర్త... ఇలాంటి వారంతా గ్యాస్ లైటర్లే.
నిరంతరంగా విమర్శించడం, నిందించడం, దుర్భాషలాడడం, భయపెట్టడం, బాధ్యతను తిరస్కరించడం, బంధంపై అసంతృప్తిని ప్రకటించడం... వారి ప్రాథమిక వ్యూహాలు.
మీ ప్రతి ప్రవర్తనపై తీర్పులనిస్తూ మిమ్మల్ని అంతులేని అమోమయానికి, మిమ్మల్ని మీరే అనుమానించే స్థితికి తీసుకువస్తారు. మీరేదో తప్పు చేస్తున్నారని మీరే అంగీకరించేలా చేస్తారు. మీ చుట్టూ ఇలాంటి వారెవరైనా ఉన్నారేమో గమనించండి.
ఆధిపత్యం కోసమే...
గ్యాస్ లైటింగ్ అనేది ఇతరులపై ఆధిపత్యం చెలాయించాలనే కోరిక నుండి పుడుతుంది. తమ మాట నెగ్గేలా, తమ దారికి అడ్డులేకుండా చేసుకోవడానికి ఇలా ప్రవర్తిస్తుంటారు. ఏదో విధంగా తమ తప్పును కూడా పక్కవారిపై తోసేసి తమ ప్రయోజనాలను కాపాడుకుంటుంటారు.
ముఖ్యంగా నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్, యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్ వంటి కొన్ని మానసిక ఆరోగ్య పరిస్థితులు గ్యాస్‌లైటింగ్‌కు దారితీస్తాయి. ఈ డిజార్డర్స్ ఉన్నవాళ్లు ఎప్పుడూ తమ తప్పును అంగీకరించరు.
మీపై మీరు నమ్మకం కోల్పోతారు...
గ్యాస్‌లైటింగ్ మీపై మీరు నమ్మకం కోల్పోయేలా చేస్తుంది. మీలో ఏదో తప్పు ఉందని మీరు నమ్మడం ప్రారంభిస్తారు. ఎవరినీ త్వరగా విశ్వసించలేరు. ఎవరి సహాయమూ తీసుకోలేరు. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులను కూడా నమ్మలేరు.
నిరాశ, ఆందోళన, దీర్ఘకాలిక ఒత్తిడి, తీవ్రమైన మానసిక క్షోభకు కారణమవుతుంది. ఇది ఆ ప్రభావం నుంచి బయటపడ్డాక కూడా చాలాకాలం పాటు కొనసాగుతుంది.
గ్యాస్ లైటర్లు తరచూవాడే వ్యాఖ్యాలు..
- నేను నీ కోసమే అలా చేశాను.
- నేను నీకోసం అంత చేస్తే నువ్వు నన్నే అనుమానిస్తున్నావా?
- నువ్వు ఓవర్ రియాక్ట్ అవుతున్నావు.
- అందుకే నీకు ఎవ్వరూ ఫ్రెండ్స్ లేరు.
- మనం దీని గురించి గతంలో మాట్లాడుకున్నాం... నీకు గుర్తులేదా?
- అలా జరగలేదు. నువ్వే ఊహించుకుంటున్నావు.
- నీపట్ల నాకెప్పుడూ నెగెటివ్ ఒపీనియన్ లేదు తెలుసా?
- నువ్వెప్పుడూ ఇంతే.. మూడంతా చెడగొడతావు.
- నువ్వేం శుద్దపూసవు కాదులే.
- ఆ విషయం నువ్వు నాకు ఎప్పుడూ చెప్పలేదు.
వాళ్ల మాటలు నమ్మొద్దు
గ్యాస్ లైటర్లు చెప్పేది ఒకటి, చేసేది మరొకటి. కాబట్టి వాళ్లు చెప్పేదానిపై కాకుండా చేసే పనులపై దృష్టి పెట్టండి.
"మీకు పిచ్చి" అని నిరంతరం చెప్పి మీ మానసిక ఆరోగ్యాన్ని మీరే అనుమానించుకునేలా చేసేవారి వ్యాఖ్యలను పట్టించుకోవద్దు.
మీరు వాదించేకొద్దీ... మీ మాటలను మీపైనే ప్రయోగిస్తారు. కాబట్టి వాదనలకు దూరంగా ఉండండి.
మీరు తప్పుగా గుర్తుంచుకుంటున్నారని లేదా మానసిక సమస్యలో ఉన్నారని తరచూ కథలు చెప్తుంటారు. ఆ మాటలను నమ్మకండి. వాళ్లు చెప్పే కథలకన్నా మీ జాపకాలపైనే నమ్మకం ఉంచండి.
గ్యాస్ లైటర్లు ముందుగా మీ కుటుంబ సభ్యులను లేదా స్నేహితులను బుట్టలో వేసుకుంటారు. కాబట్టి గ్యాస్ లైటర్ కు మద్దతుగా వాళ్లు చెప్పే మాటలను కూడా పట్టించుకోవద్దు.
గ్యాస్ లైటర్‌తో మీ బంధం లేదా అనుబంధం కన్నా మీరు సురక్షితంగా ఉండటం ముఖ్యమని గుర్తించండి. మీ భద్రతకు ప్రమాదమని భావిస్తే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అలాంటి బంధం నుంచి బయటకు వచ్చేయండి.
Comments
Please login to add a commentAdd a comment