వర్షాకాలంలో సాయంత్రంపూట ఏదైనా తినాలనిపిస్తుంది. అలాగే స్కూలు నుంచి పిల్లలు కూడా ఏదో ఒకటి తినడానికి కావాలని మారాం చేస్తూ ఉంటారు. నోటికి రుచిగా ఉండే వెరైటీ స్నాక్స్ కోసం ఆశగా ఎదురు చూసే అత్త మామలు..వీళ్లందర్నీ సంతృప్తి పరచాలంటే.. ఇదిగో ఐడియా!
పల్లీ పకోడి
కావలసినవి: వేరు శనగపప్పు – పావు కిలో (పచ్చివి); శనగపిండి – 2 టేబుల్ స్పూన్‌లు; బియ్యప్పిండి– టేబుల్ స్పూన్; మొక్కజొన్న పిండి (కార్న్‌ఫ్లోర్)– టీ స్పూన్; మిరపపొపడి– టీ స్పూన్; ఉప్పు – టీ స్పూన్ లేదా రుచిని బట్టి; చాట్ మసాలా పొడి– టీ స్పూన్; ఇంగువ – పావు టీ స్పూన్; నిమ్మరసం – టీ స్పూన్; కరివేపాకు – 2 రెమ్మలు; నీరు – పావు లీటరు (అవసరాన్ని బట్టి వేయాలి); నూనె – వేయించడానికి తగినంత.
తయారీ: వేరుశనగపప్పును మెత్తటి వస్త్రంలో వేసి తుడవాలి. ఆ తర్వాత వాటిని ఒక పాత్రలో వేయాలి. అందులో శనగపిండి, బియ్యప్పిండి, మొక్కజొన్న పిండి, మిరప్పొడి, చాట్ మసాలా, ఇంగువ, ఉప్పు వేసి బాగా కలపాలి. ఇప్పుడు నిమ్మరసం వేసి మరోసారి సమంగా కలపాలి. ఇప్పుడు కొద్దికొద్దిగా నీటిని వేస్తూ పిండి వేరుశనగపప్పుకు పట్టేటట్లు మిశ్రమాన్ని తడి పొడిగా కలుపుకోవాలి. బాణలిలో నూనె వేడి చేయాలి. మరగడం మొదలైన తర్వాత మంట తగ్గించి వేరుశనగపప్పుల మిశ్రమాన్ని చేత్తో తీసుకుని వేళ్లను కదుపుతూ గింజలు విడివిడిగా పడేటట్లు జాగ్రత్తగా నూనెలో వదలాలి.
నూనెలో కాలుతున్నప్పుడు చిల్లుల గరిటెతో కలియబెడుతూ లోపల గింజలో పచ్చిదనం పోయి దోరగా వేగే వరకు కాలనిచ్చి తీయాలి. ఇలా మొత్తం పప్పులను వేయించి ఒక పాత్రలో వేయాలి ∙ఇప్పుడు అదే నూనెలో కరివేపాకులు వేసి చిటపటలాడిన తర్వాత తీసి పకోడీ మీద వేసి కలపాలి. ఈ పల్లీ పకోడీ మరీ వేడి ఉన్నప్పుడు తింటే రుచి తెలియదు. వేడి తగ్గిన తరవాత తినాలి. చల్లారిన తర్వాత గాలి దూరని డబ్బాలో నిల్వ చేస్తే వారం రోజులు తాజాగా ఉంటాయి.
పీ నట్ చాట్
కావలసినవి: వేరు శనగపప్పు – కప్పు (వేయించినవి); ఉల్లిపాయ – 1 (తరగాలి); టొమాటో – 1 (తరిగి గింజలు తొలగించాలి); కొత్తిమీర తరుగు – పావు కప్పు; నిమ్మరసం – టీ స్పూన్; మిరప్పొడి– అర టీ స్పూన్; చాట్ మసాలా– టీ స్పూన్; ఉప్పు – పావు టీ స్పూన్; నూనె– 2 టీ స్పూన్‌లు.
తయారీ: ∙బాణలిలో నూనె వేడి చేసి స్టవ్ ఆపేయాలి. నూనెలో మిరపపొడి, చాట్ మసాలా, వేరుశనగపప్పు వేసి కలపాలి. పప్పు వేడెక్కిన తర్వాత ఒక పాత్రలోకి తీసుకుని ఉల్లిపాయ, టొమాటో ముక్కలు, కొత్తిమీర వేయాలి. చివరగా నిమ్మరసం చల్లి, ఉప్పు కలపాలి. ఇది అన్ని వయసుల వారికీ మంచి ఆహారం.
Comments
Please login to add a commentAdd a comment