
చెవులకు హెడ్‌ఫోన్ ధరించి, కళ్లు మూసుకొని, శ్రద్ధగా వింటున్న ఆమెను చూస్తుంటే ధ్యానస్థితిలో ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఇంతకీ ఆమె వింటున్నది ఏమిటి? అది తెలుసుకునేముందు....
ప్రియా వసంత్ చెన్నైలోని సాధారణ గృహిణి. ఇంటిపనులు పూర్తి కాగానే టీవిలో సీరియల్స్, వోటీటీలో సినిమాలు చూడడంలో ఎక్కువ టైమ్ గడిపేది. రాను రాను ఆమెకు ఇది విసుగనిపించింది. మార్పు కావాలనిపించింది. ‘ఏంచేయాలి?’ అని ఆలోచిస్తున్నప్పుడు అరల్లోని పుస్తకాలు ఆమెను ఆకర్షించాయి. కాలేజి రోజుల్లో ప్రియ పుస్తకాల పురుగు. కానీ విజువల్ మీడియా విస్తృతమయ్యాక చాలామందిలాగే తనలోనూ పఠనాసక్తి వెనకబడింది. ఎక్కడో విన్న ‘ఆడియోబుక్’ అనే మాట గుర్తుకు వచ్చింది. ఈ అనుభవం ఎలా ఉంటుందో చూద్దామనుకుంది. తాను వింటున్నది కల్కి క్రిష్టమూర్తి ‘పోన్నియన్ సెల్వన్’ ఆడియో పుస్తకం. ఆ పుస్తకంలో వినిపించే గొంతు ఆమెను కొత్త లోకాల్లోకి తీసుకెళ్లింది. మరిన్ని ఆడియో పుస్తకాలను వినే ఆసక్తిని కలిగించింది. ఆ స్వరం... కీర్తనది. ‘ఆడియో పుస్తకాలను నెరేట్ చేయడం ద్వారా అదనపు ఆదాయం వస్తుంది. అయితే అది చిన్న విషయం. కొత్త ఉత్సాహం అనేది పెద్ద విషయం’ అంటుంది కీర్తన.
ఆడియోబుక్స్ మార్కెట్ పెరిగి, వరల్డ్ ట్రెండ్‌గా మారుతున్న ఈ దశలో నెరేటర్‌గా మంచి పేరు తెచ్చుకుంటుంది దీపిక అరుణ్. ‘ఏదో అవకాశం వచ్చింది. చెప్పాం. అయిపోయింది అనుకుంటే కుదరదు. ఏ మేరకు శ్రోతలను ఆకట్టుకున్నామన్నది ముఖ్యం. నెరేటర్‌కు ఉచ్ఛారణ, మాడ్యులేషన్ అనేవి చాలా ముఖ్యం’ అంటుంది దీపిక. ‘తన్నీర్’ అనే తమిళ పుస్తకానికి తన స్వరాన్ని ఇచ్చిన లక్ష్మీ ప్రియాకు వచ్చిన ప్రశంసలు ఇన్నీ అన్నీ కావు. కాలేజి స్టూడెంట్స్ నుంచి రిటైర్డ్ ప్రొఫెసర్‌ల వరకు ఆమె అభిమాన గణంలో ఉన్నారు. ‘నాటకాలు, సినిమాలకు సంబంధించి శిక్షణ సంస్థలు ఎన్నో ఉండవచ్చు. అయితే స్వరాన్ని ఏ సందర్భంలో, ఏ పాత్రకు ఎలా ఉపయోగించాలనే విషయంలో మాత్రం ఎవరికి వారే గురువులు. ప్రతి పుస్తకం ఎన్నో కొత్త పాఠాలు నేర్పుతుంది. ఇంతకంటే కావాల్సింది ఏముంటుంది’ అంటుంది లక్ష్మీ ప్రియా.
ఇవి దక్షిణాదికి సంబంధించి కొన్ని ఉదాహరణ మాత్రమే. ఇక జాతీయస్థాయిలో ఎన్నో ఆంగ్లపుస్తకాలకు మహిళల గొంతు బలమైన మాధ్యమంగా మారుతుంది. బెస్ట్ సెల్లర్‌గా పేరు తెచ్చుకున్న కవిత కనే ‘కర్నాస్ వైఫ్’ ఆడియో బుక్‌ను షాహీన్‌ఖాన్ అందంగా నెరేట్ చేసింది. ‘అద్భుతమైన పుస్తకాలను అంతకంటే అద్భుతంగా నెరేట్ చేసినప్పుడే మనం విజయం సాధించినట్లు అనుకోవాలి’ అంటుంది షాహీన్‌ఖాన్. అమెజాన్ కంపెనీ వారి ‘ఆడిబుల్’ శ్రోతలకు చిరపరిచితమైన పేరు....ఇక్‌రూప్ కౌర్ చంబా. రకరకాల జానర్లలో వచ్చే ఆడియో పుస్తకాలకు గొంతు ఇచ్చి ‘ఆహా’ అనిపించుకుంటుంది. దేవాన్షిశర్మ ‘ఐ థింక్ ఐయామ్ ఇన్ లవ్’ పుస్తకాన్ని నెరేట్ చేయడం ద్వారా ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది.
అరుణ్ అంజు
హిందీలోకి డబ్ అయ్యే హాలివుడ్ సినిమాలలోని పాత్రలకు గొంతు ఇచ్చే ఆల్కాశర్మ తాజాగా ఆడియోబుక్స్ నెరేటింగ్ పనుల్లో బిజీ అయింది. ‘రకరకాల జానర్స్ గురించి అవగాహన రావడంతో పాటు, పుస్తకం గొప్పతనం తెలిసింది’ అంటుంది ఆల్కా. ఫిక్షన్‌తో పాటు విద్యార్థుల కోసం చరిత్ర నుంచి భౌగోళికం వరకు ఆడియో పుస్తకాలను నెరేట్ చేస్తూ భేష్ అనిపించుకుంటుంది అంజు పణిక్కర్....ఇలా చెప్పుకుంటే పోతే ఎంతోమంది ఉన్నారు. పుస్తకం హస్తభూషణం అంటారు.గళభాషణం కూడా అంటే కాదనేదేముంది!
Comments
Please login to add a commentAdd a comment