చలికాలంలో చర్మంతో పాటు పాదాలు కూడా డ్రై అయిపోతాయి. దాని కారణంగా పగుళ్లు వస్తాయి. దాని ప్రభావం మరింత ఎక్కువైపోతుంది. నొప్పి ఎక్కువై.. ఒక్కోసారి రక్తం కూడా వచ్చేస్తుంది. పొడి గాలి, తేమ సరిగా లేకపోవడం, పాదాలకు సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల పాదాల పగుళ్లు ఏర్పడతాయి. ఇలాంటి సమస్యల కు ఇంటి చిట్కాలతోనే చెక్ పెట్టొచ్చు. అవేంటంటే..
♦ రాత్రిపూట పడుకోబోయే ముందు పాదాలను శుభ్రంగా కడిగి, ఆరిన తరువాత మసాజ్ క్రీమ్ లేదా నూనెతో ఐదు నిమిషాలపాటు మర్దనా చేస్తే పాదాలకు రక్తప్రసరణ బాగా జరిగి, పాదాలు మృదువుగా ఉంటాయి.
♦ అలాగే పాదాలు, మోచేతుల వద్ద చర్మం గట్టిపడి, గరుకుగా మారినప్పుడు... ఆరు టీస్పూన్ల పెట్రోలియం జెల్లీ, రెండు టీస్పూన్ల గ్లిజరిన్, రెండు టీస్పూన్ల నిమ్మరసంను సమపాళ్లలో కలిపి మర్ధనా చేయాలి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తుంటే పాదాలు, మోచేతులు మృదువుగా మారుతాయి.
♦ మీ వేళ్ళ మధ్యలో ఉన్న పగుళ్లలో గోరింట ఆకుల పేస్ట్ లేదా హెన్నా పొడిని నీటిలో కలుపుకుని పేస్టులా చేసుకుని పాదాలకు, వేళ్ల పగుళ్లలోనూ అప్లై చేయాలి. పూర్తిగా పొడిగా మారేంత వరకు ఉంచి, చల్లటి నీటితో శుభ్రం చేసి, టవల్‌తో తుడుచుకుంటే బాగుంటుంది.
♦ యాంటీబాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటివైరల్ లక్షణాల పరంగా పసుపు ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. అందుకే అతివలు కాళ్లకు పసుపు పూసుకోవడం మంచిది. పాదమంతటికీ రాసుకోవడం ఇష్టం లేకపోతే కనీసం వేళ్లమధ్యలో రాసుకున్నా మంచిదే.
♦ పసుపు రాసుకోవడం కుదరని వారు ఉల్లిపాయ రసం తీసుకుని కాలి వేళ్ళ మధ్య మసాజ్ చేయడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. ఎక్కువగా షూస్ ధరించే వాళ్ళకు ఉల్లిపాయ రసం ప్రభావవంతంగా పనిచేస్తుంది..
♦ పుదీనా ఒక సహజ సిద్దమైన డియోడరెంట్ వలె ఉపయోగపడుతుంది. అంతేకాకుండా, మంచి క్రిమినాశక తత్వాలు కూడా పుదీనాకు ఉన్నాయి. పుదీనా రసాన్ని పాదాలకు, కాలి వేళ్లకు పూసుకుని ఆరిన తర్వాత సాక్స్ ధరించడం వల్ల పాదాలు పదిలంగా ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment