సుమారు 500 సంవత్సరాల క్రితం బంగారం , ఇతర సంపదతో భారతదేశానికి వెళుతుండగా అదృశ్యమైన పోర్చుగీస్ ఓడ అవశేషాలు నమీబియా ఎడారి తీరప్రాంతంలో గుర్తించారు. నైరుతి ఆఫ్రికాలోని ఎడారిలో బంగారు నాణేలతో ఉన్న ఓడను గుర్తించడం పురావస్తు పరిశోధనల్లో వెలుగు చూసిన అద్భుతంగా భావించారు. రెండు వేల స్వచ్ఛమైన బంగారు నాణేలు 44 వేల పౌండ్ల రాగి కడ్డీలు దాదాపుగా చెక్కుచెదరకుండా ఉండటం విశేషం.
బోమ్ జీసస్ అనేది సబ్-సహారా ఆఫ్రికాలోని పశ్చిమ తీరంలో గుర్తించిన అత్యంత పురాతనమైన , అత్యంత విలువైన ఓడ. బోమ్ జీసస్ (ది గుడ్ జీసస్) ఓడ పోర్చుగల్‌లోని లిస్బన్ నుండి 1533న మార్చి 7 శుక్రవారం బయలుదేరిన పోర్చుగీస్ నౌక. కానీ 2008లో నమీబియా ఎడారిలో దీని అవశేషాలను గుర్తించినపుడు మాత్రమే ఈ ఓడలోని అద్భుత నిధి గురించి తెలిసింది.
నైరుతి ఆఫ్రికాలోని డైమండ్ మైనింగ్ పనుల్లో నామ్‌దేబ్ డైమండ్ కార్పొరేషన్‌లోని కార్మికులు దీన్ని గుర్తించారు. బంగారం, రాగితో వంటి విలువైన సంపదతో ఇండియాకు వెళుతుండగా భయంకరమైన తుఫానులో చిక్కుకుని ఉంటుందని భావించారు.నమీబియా తీరంలో తుఫాను కారణంగా ఒడ్డుకు చాలా దగ్గరగా వచ్చినపుడు బోమ్ జీసస్ మునిగిపోయిందని అంచనా. దీని వలన ఓడ ముందు భాగం రాయితో ఢీకొని బోల్తా కొట్టింది. అయితే తీరప్రాంత జలాలు తగ్గుముఖం పట్టడంతో, బోమ్ జీసస్ అవశేషాలు బయల్పడ్డాయి. అయితే చెల్లాచెదురుగా కనిపించిన కొన్ని మానవ ఎముకలు తప్ప మరేమీ వీటిల్లో గుర్తించకపోవడంతో ఓడలోని సిబ్బంది శిధిలాల నుండి బయటపడటమో లేక మరణించడమో జరిగి ఉంటుందని భావిస్తున్నారు.
దక్షిణాఫ్రికా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మారిటైమ్ ఆర్కియాలజికల్ రీసెర్చ్‌కి చెందిన చీఫ్ ఆర్కియాలజిస్ట్ డాక్టర్ నోలీ దీనిపై మరింత పరిశోధన చేశారు. బంగారు, వెండి, రాగి కడ్డీల నిధిని గుర్తించారు. దీనిపై బ్రూనో వెర్జ్ అనే సముద్రపు పురావస్తు శాస్త్రవేత్తను సంప్రదించారు డా. నోలీ. ప్రపంచ వారసత్వ సంపదకు సంబంధించి మూడు ఖండాలకు చెందిన వస్తువులతో ఉన్న ఓడ ప్రమాదాన్ని కనుగొనడం చాలా ముఖ్యమైనదని కూడా ఆయన అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment