మంచి మాట: జీవన స్పృహ | Consciousness is your individual awareness of your unique thoughts, memories, feelings, sensations | Sakshi
Sakshi News home page

మంచి మాట: జీవన స్పృహ

Published Mon, Mar 20 2023 1:06 AM | Last Updated on Mon, Mar 20 2023 1:06 AM

Consciousness is your individual awareness of your unique thoughts, memories, feelings, sensations - Sakshi

స్పృహ అనేది ప్రాణం ఉన్న  ప్రతిమనిషికీ ఉండాల్సిన వాటిల్లో అతిముఖ్యమైంది. స్పృహ ఉండాలన్న స్పృహ కూడా లేనివాళ్లు ఉన్నారు. మనిషి ఏ పరిస్థితిలోనూ ఏ రకమైన మత్తుకూ లోనుకాకూడదు. ఏ రకమైన మత్తుకూ మనిషి చిల్తై పోకూడదు. కొన్ని సందర్భాల్లో మనిషిని నిస్పృహ ఆవరిస్తూ ఉంటుంది. దానికి కొనసాగింపుగా నిస్తేజం పట్టి పీడిస్తూ మనిషిని అదిమేస్తూ ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లోంచి మనిషి తెప్పరిల్లి తేరుకోగలగాలి. అందుకు స్పృహ అనేది తప్పకుండా ఉండాలి. స్పృహతో నిస్తేజాన్ని నిశ్వాసిస్తూ ఉత్తేజాన్ని ఉచ్ఛ్వాసిస్తూ ఉండాలి; సత్తేజంతో ఉండాలి.

మనిషిలో లేదా మనిషికి తప్పకుండా ఉండాల్సింది స్పృహ. స్పృహ అన్నది లేకుండా పోతే మనిషి తన నుంచి తాను తప్పిపోతాడు; మనిషి తనకు తాను కాకుండా పోతాడు. ఒక మనిషి తన జీవనోపాధిని కోల్పోవచ్చు, తన ఆస్తుల్ని కోల్పోవచ్చు, తనవి అన్నవాటిని అన్నిటిని ఒక మనిషి కోల్పోవచ్చు కానీ స్పృహను మాత్రం కోల్పోకూడదు. దేన్ని అయినా వదులుకోవచ్చు కానీ స్పృహను వదులుకోకూడదు. మనిషికి ఏదైనా లేకుండా పోవచ్చు కానీ స్పృహ లేకుండా పోకూడదు. తనకు తాను ఉన్నంత వరకూ, తనలో రక్తం పారుతున్నంత వరకూ మనిషికి స్పృహ ఉండాలి. మనిషి రక్తంలో స్పృహ పారుతూ ఉండాలి. మనిషిలో రక్తంలా స్పృహ ప్రవహిస్తూ ఉండాలి.

తనలో స్పృహ ప్రవహిస్తూ ఉంటేనే మనిషి జీవితంలోకి ప్రయాణం చేస్తూ ఉండగలడు. స్పృహ మనిషికి స్వేచ్ఛను ఇస్తుంది. స్పృహ వల్ల మనిషికి బయటా, లోపలా చలనం కలుగుతుంది. ఆ చలనం గతికి, ప్రగతికి కారణం అవుతుంది. స్పృహ లేనప్పుడు మనిషికి ఏదీ అందదు, మనిషివల్ల ఏదీ జరగదు. స్పృహలేకపోతే మనిషికి గతి, ప్రగతి ఉండవు.

‘జీవితం నిన్ను బలపరిచేందుకు సిద్ధంగా ఉంది; అందుకు ముందు నువ్వు జీవితానికి తలుపు తెరిచి ఉంచాలి‘ అని జర్మన్‌ తాత్త్వికుడు ఎక్‌హార్ట్‌ టోల్‌ తెలియజె΄్పారు. స్పృహ  ఉన్నప్పుడు మాత్రమే మనం జీవితానికి తలుపు తెరిచి ఉంచగలం. లేదా మనకు ఉన్న స్పృహ మాత్రమే జీవితానికి తలుపు తెరిచి ఉంచగలదు. మత్తు జీవితాన్ని మూసేస్తుంది. మన మత్తును మనం వదిలించుకోవాలి. మనల్ని మన జీవితం బలపరచాలంటే మనకు స్పృహ కావాలి.

ఎక్‌హార్ట్‌ టోల్‌ స్పృహ విషయంలో ఇంకా ఇలా స్పష్టతను ఇచ్చారు, ‘మనకు కలిగే ఆలోచనను స్పృహ అని అనుకోవడం తప్పు. ఆలోచన, స్పృహ పర్యాయపదాలు కావు. ఆలోచన అనేది స్పృహలోని ఒక చిన్న క్రియారూపం మాత్రమే. స్పృహ లేకుండా ఆలోచన ఉనికిలో ఉండదు; కానీ స్పృహకు ఆలోచన అవసరం ఉండదు’. మనం స్పృహ తోనే జీవనం చెయ్యాలి. మనకు ముందు కొందరికైనా సామాజిక స్పృహ ఉండి ఉండబట్టే ఇవాళ సమాజం ఉంది. సంగీతం, సాహిత్యం, ఇతర కళలపై స్పృహ ఉన్న కొందరివల్ల అవి చలామణిలో ఉన్నాయి. విద్య, వృత్తులు, పరిశోధనలు వంటివాటిపై మనకు పూర్వం ఉన్నవాళ్లకు స్పృహ ఉండబట్టే మనం మనుగడ చెయ్యగలుగుతున్నాం.

స్పృహలేని మనిషి ఊపిరితో ఉన్న రాయి . మనం స్పృహతో మనుగడ చేద్దాం. రాళ్లల్లా కాదు  మనుషులమై బతుకుదాం.

– శ్రీకాంత్‌ జయంతి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement