
కరోనా వైరస్ ప్రభావం అనగానే మొదట ఊపిరితిత్తులూ, గుండె వంటి అవయవాలపై దాని ప్రభావం గుర్తొస్తుంది. అయితే మనకు నేరుగా మెదడుపై ప్రభావమని అనిపించకపోయినా... పరోక్షంగా కరోనా మెదడుపై కలిగించే ప్రభావం కారణం గా కనిపించే లక్షణాలూ మనకు తెలుసు. అవే... వాసన కోల్పోవడం, రుచి తెలియకపోవడం... ఈ రెండు లక్షణాలూ మెదడుపై కలిగే దుష్ప్రభావాల కారణంగానే కనిపిస్తాయి. అయితే ఇవి మాత్రమే కాదు... మెదడుపై మనకు తెలియని చాలా దుష్ప్రభావాలే ఉన్నాయంటున్నారు డాక్టర్లు. అయితే ఇవి మాత్రమే కాదు... మెదడుపై మనకు తెలియని దుష్ప్రభావాలు చాలా ఎక్కువే ఉన్నాయంటున్నారు న్యూరోవైద్యనిపుణులు. కరోనా వైరస్ కారణంగా మెదడుపైనా, నాడీ మండలం పైనా... తద్వారా ఏర్పడే అనేక అనర్థాలపై అవగాహన కోసమే ఈ ప్రత్యేక కథనం.
కరోనా ప్రభావం నాడీమండలంపై ఎక్కువగా ఉంటుంది. గత ఏడాది కరోనా వచ్చినప్పుడు అంటే మొదటివేవ్‌లో చికిత్సకుల దృష్టి అంతా ప్రధానంగా ఊపిరితిత్తులూ, గుండె మీద ఉండింది. ఆ సమయంలో వారు ఊపిరితిత్తులు, గుండె ఇన్‌వాల్వ్‌మెంట్ కారణంగా ఆక్సిజన్, హై కాన్సంట్రేషన్ ఆక్సిజన్ అందించి చాలామంది రోగులను బతికించారు. అయితే అలా కోలుకున్న రోగుల్లో కొందరికి కాలూ, చేయీ పనిచేకపోవడం, మూతి వంకర పోవడం, చుట్టుపక్కల వారిని గుర్తుపట్టకపోవడం వంటి దుష్ప్రభావాలు కనిపించాయి. దాంతో చికిత్సకులు తమ చికిత్సల్లో తాము ఏమైనా అంశాలను విస్మరించారా అంటూ అధ్యయనాలు మొదలు పెట్టారు.
పైగా మనకు సీటీ స్కాన్, ఎమ్మారై వంటి అడ్వాన్స్‌డ్ మెడికల్ పరీక్షల సౌకర్యాలు ఉండటంతో చాలా అంశాలు బయటపడ్డాయి. ఉదాహరణకు మెదడులోని కొన్ని ప్రాంతాల్లో ఆక్సిజన్ అందకపోవడం వల్ల ఆయా భాగాలు ప్రభావితమై ఆ సెంటర్లు నియంత్రించే అవయవాలు సరిగా పనిచేయకపోవడాన్ని గుర్తించారు. అసలు వ్యాధి తగ్గి... ఇంటికి వెళ్లిపోయాక... ఓ మూడు, నాలుగు నెలల తర్వాత ఇలాంటి దుష్ప్రభావాలు రావడాన్ని వైద్యులు, నిపుణులు గుర్తించారు.
ఇలా ఎవరికి జరుగుతోందని పరిశీలించినప్పడు మళ్లీ కో–మార్బిడ్ ఫ్యాక్టర్స్ వల్లనే ఇలా జరుగుతోందని తేలింది. అంటే డయాబెటిస్, హైబీపీ, ఊబకాయం ఉన్నవారు, మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు... ఇలాంటి జబ్బులు ఉండి, వ్యాధినిరోధకత తగ్గినవారిలో ఇలా జరుగుతోందని నిపుణుల పరిశీలనల్లో తేలింది.
కాంప్లికేషన్స్ మూడు రకాలుగా...
- ముక్కు నుంచి ఆల్‌ఫాక్టరీ ట్రాక్ట్ (వాసన కోల్పోవడం తార్కాణం)
- ఇమ్యునలాజికల్ పద్ధతి తన రోగ నిరోధక వ్యవస్థే తన మీద ప్రభావం చూపడం (సైటోకైన్ స్టార్మ్)
- హైపాక్సిక్ ఈవెంట్ డ్యామేజ్ (మెదడుకు ఆక్సిజన్ తగ్గడం వల్ల / నాలుగు నిమిషాల కంటే తగ్గితే శాశ్వతంగా దెబ్బతినే అవకాశం.
- సెంట్రల్ నర్వస్ సిస్టమ్ (మెదడు, వెన్నుపాము, రెటీనా)
- పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ (నరాలు, గాంగ్లియా, కండరాలు)
నాడీ మండలానికి చెందిన ప్రతిదీ దెబ్బతింటుందని ఇప్పటి అధ్యయనాల వల్ల తెలుస్తోంది. అంటే వచ్చే అనర్థాలన్నీ ఈ ఆరు రకాల అవయవాల్లో వచ్చే ప్రమాదం ఉందన్నమాట.
పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్‌పై ప్రభావం కారణంగా కనిపించే లక్షణాలివి...
- వాసన తెలికపోవడం అనే లక్షణం కరోనా వైరస్ ఇన్ఫెక్షన్‌లో కనిపిస్తుందన్న విషయం తెలిసిందే. మనలో చాలామందికి తెలిసిన దుష్ప్రభావం ఇది.
- రుచి తెలియకపోవడం అన్నది కూడా అందరికీ తెలిసిన మరో లక్షణం.
జీబీ సిండ్రోమ్: వాస్తవానికి ప్రతి నాడికీ, నరానికీ పైన మైలైన్ షీత్ అనే ఓ పొర ఉంటుంది. ఆ పొరకు ఇన్ఫెక్షన్ రావడమే మైలైటిస్. మైలీన్ షీత్ అనే ఈ పొర వల్లనే మెదడు నుంచి వెళ్లే ఆదేశాలు ఆయా అవయవాలకు వెళ్తుంటాయి. దాంతో మెదడు ఆదేశాల మేరకు ఆయా అవయవాలు స్పందిస్తుంటాయి. మైలైన్ షీత్ అనే ఈ పొర దెబ్బ తినే కండిషన్‌ను ‘గులియన్ బ్యారీ సిండ్రోమ్’ లేదా ‘జీబీ సిండ్రోమ్’ అంటారు. సాధారణంగా ఎవరైనా రోగులు ఏదైనా ఇన్ఫెక్షన్‌కు గురైన సందర్భంలో దాని అనంతర అనర్థంగా (పోస్ట్ ఇన్ఫెక్షన్ ఎఫెక్ట్‌గా) ఈ జీబీ సిండ్రోమ్ చోటు చేసుకుంటుంది.
అలాంటప్పుడు మెదడు నుంచి ఏ అవయవానికి కనక్ట్ అయ్యే మైలీన్ షీత్ దెబ్బతింటే ఆ అవయవం చచ్చుపడిపోతుంది. సాధారణంగా ఈ మైలీన్ షీత్ మెల్లగా మళ్లీ నార్మల్‌కు వస్తుంది. అలా రాగానే ఆ అవయవం కదలికలు కూడా మామూలుగా మారిపోతాయి. ఇలా జరగడానికి సాధారణంగా దాదాపు రెండు నెలలు పట్టవచ్చు. కాళ్లూ, చేతులకు ఇలాంటి పరిస్థితి వస్తే పర్లేదు. కానీ ఏ ఊపిరితిత్తులకు అందాల్సిన ఆదేశాలు అందకుండా పోయే పరిస్థితి వస్తే అది తప్పక మరణానికి దారితీసే ప్రమాదం ఉంది. అందుకే ఇది చాలా ప్రమాదకరమైన దుష్ప్రభావం.
మిల్లర్‌ఫిషర్ సిండ్రోమ్ : ఇది కూడా గులియన్ బ్యారీ సిండ్రోమ్ లాంటిదే. ఇందులో కూడా రోగి కండరాలపై నియంత్రణ కోల్పోతారు. ముఖ్యంగా కంటి కండరాలపైనా అలాగే కొన్ని టెండన్స్‌పైన.
- పాదం పైకెత్తలేకపోవడం (ఫుట్ డ్రాప్)
- కండరాల నొప్పులు, కండరాలు పట్టేయడం (క్రాంప్స్)
- ఫెటీగ్ (అలసట), పనుల్లోగానీ, ఏ వ్యాపకాల్లోగానీ ఆసక్తి లేకపోవడం
- దేహంలోని చర్మంపైనా లేదా చేతుల్లోని చర్మంపైనా తిమ్మిర్లు, గుచ్చినట్లుగా అనిపించడం, పూర్తిగా చల్లగా ఉన్న భావనతో స్పర్శ తెలియకపోవడం, మండటం, మొద్దుబారిపోవడం వంటి లక్షణాలు (దీన్ని పారాస్థీషియా అంటారు).
- ముఖం కండరాలపై నియంత్రణ కోల్పోవడం, ముఖం పక్షవాతానికి గురికావడం (ఫేషియల్‌పాల్సీ)
- చూపు మందగించడం, కన్ను, కంటి గుడ్డు కదిలించలేకపోవడం
నరాల కారణంగా కనిపించే మానసిక సమస్యలు
- అయోమయం
- తీవ్రమైన కుంగుబాటుకు / వ్యాకులత (డిప్రెషన్)కు గురికావడం
- యాంగై్జటీ (తీవ్రమైన ఉద్వేగాలకు లోనుకావడం)
శారీరక కదలికలు సంబంధించి...
- వణుకు, దేహాన్ని కదలించేందుకు చేసే ప్రయత్నంలో పాక్షికంగా మాత్రమే అదుపు సాధించే అటాక్సియా వంటి లక్షణాలు ఉంటాయి.
- మింగడంలో కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశాలుంటాయి. ఈ కండిషన్‌ను ‘డిస్‌ఫేజియా’ అంటారు.
మరికొన్ని దుష్ప్రభావాలు
అలాగే... రాబ్డోమయోలైసిస్ (కండరాలు తీవ్రంగా దెబ్బతినడం, కండరాలు చచ్చుబడిపోవడం వంటి అనర్థాలు ఏర్పడవచ్చు.
- దాంతోపాటు మూత్రం చాలా చిక్కగా రావడం, చాలా తక్కువగా రావడం, బలహీనత, మూత్రపిండాలు దెబ్బతినడం వంటి దుష్ప్రభావాలూ అరుదుగా కనిపించవచ్చు.
నిర్ధారణ పరీక్షలు
కోవిడ్ కారణంగా గానీ లేదా మరేదైనా కారణంగా గానీ ఈ లక్షణాలు కనిపించినప్పుడు... ఆ అనర్థాలను గుర్తించడానికి సీటీ బ్రెయిన్, ఎమ్మారై బ్రెయిన్, ఎమ్మారై స్పైనల్ కార్డ్ వంటి పరీక్షలు అవసరమవుతాయి. అయితే సీటీ బ్రెయిన్‌తో పోలిస్తే ఎమ్మారై బ్రెయిన్‌లో చాలా విషయాలు స్పష్టంగా తెలుస్తాయి.
చికిత్స
మెదడుపై ప్రభావం కారణంగా కనిపించిన లక్షణాలను బట్టి చికిత్స చేయాల్సి ఉంటుంది. అయితే ఇలా చేసే చికిత్సలో శస్త్రచికిత్స చాలా చాలా అరుదుగానే అవసరం పడుతుంది.అయితే కరోనా కారణంగా నరాల ఇబ్బందులు ఏవైనా వచ్చినవారు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. వారిలో సమయం గడిచిన కొద్దీ క్రమంగా తెరుకునే అవకాశమే ఎక్కువ. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు.
మెదడుకు సంబంధించిన తొలి లక్షణాలు
- జ్ఞాపకశక్తి తగ్గడం (బ్రెయిన్ ఫాగ్),
- మాట తడబడటం, మాటల్లో తేడా రావడం
ఈ లక్షణాలన్నీ కరోనా వైరల్ ఇన్ఫెక్షన్‌లో కనిపించే ప్రధాన లక్షణాలైన తలనొప్పి, జ్వరం, ఒళ్లునొప్పులు, కండరాల నొప్పులు, ఇటీవల కొత్తగా కనిపిస్తున్న లక్షణాలైన నడుమునొప్పి, కడుపునొప్పి, నీళ్లవిరేచనాలు (డయేరియా) వంటి వాటికంటే ముందే కనిపిస్తున్నాయి. అంటే ఈ లక్షణాలన్నీ పైలట్ లా ముందే వస్తున్నాయిని నిపుణులు గుర్తించారు. అందుకే అమెరికాలాంటి పాశ్చాత్యదేశాల్లో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే అసలు లక్షణాలు కనిపించే వరకు ఆగకూడదని, ముందే ఆసుపత్రులకు రావాలని అక్కడి నిపుణులు సూచిస్తున్నారు.
- సాధారణంగా కరోనా సోకిన వారిలో 30 % మందికీ
- ఆక్సిజన్ పెట్టాల్సిన వారిలో 45% రోగులకు
- వెంటిలేటర్ పెట్టాల్సి వచ్చిన వారిలో 80% మందిలో మెదడు తాలూకు దుష్ప్రభావాలు కనిపిస్తున్నాయని కొన్ని పరిశీలనల్లో తేలింది.
మెదడు (సెంట్రల్ నర్వస్ సిస్టమ్)పై దుష్ప్రభావాలివి : తలనొప్పి, పగలు నిద్ర వస్తుండటం, రాత్రి అస్సలు నిద్ర పట్టకపోవడం, స్ట్రోక్ లాగా రావడం, కాలూ చేయీ పని చేయకపోవడం ఇలా జరగడానికి రెండు రకాల కారణాలు... మొదటిది రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం (ఇస్కిమిక్) వల్ల ఆయా మెదడు భాగాలకు రక్తం అందకపోవడం, దాంతో మెదడులోని ఆ భాగం ఏ అవయవాన్ని నియంత్రిస్తుందో ఆ అవయవంపై దుష్ప్రభావం పడటం, ఇక రెండోది మెదడులో రక్తస్రావం (హేమరేజ్) అయితే ఆలా రక్తస్రావమైన భాగం ఏ అవయవాన్ని కంట్రోల్ చేస్తుందో ఆ అవయవభాగంపై దుష్ప్రభావం పడటం. మూర్చ రావడం, మెదడువాపు రావడం వంటి అనర్థాలు కనిపిస్తున్నాయి. అలాగే కొందరిలో పక్షవాతం (స్ట్రోక్), మూర్చ (ఎపిలెప్సీ), మెనింజైటిస్ (మెదడులోని కొన్ని పొరల్లో వాపు కనిపించడం / మెదడువాపు) వంటి దుష్ప్రభావాలు కనిపించవచ్చు.
ఇలాంటి మరో దుష్ప్రభావమే మైలైటిస్.
అటాక్సియా అనే మరో రకం కండిషన్ కూడా ఏర్పడవచ్చు. సాధారణంగా మన అవయవాలపై మనకు పూర్తిగా నియంత్రణ ఉండటం మనకు అనుభవంలో ఉన్న విషయమే. అయితే కొన్ని అవయవాలు మన నియంత్రణలో ఉండకుండా పోవడం, వాటిపై పాక్షిక నియంత్రణ మాత్రమే కలిగి ఉండే కండిషన్‌ను ‘అటాక్సియా’ అంటారు. ఇది కూడా మెదడుపై కరోనా తాలూకు దుష్ప్రభావం వల్ల కనిపించే మరో అనర్థంగా చెప్పవచ్చు. అలాగే నిద్రకు సంబంధించిన అంతరాయాలు, డిప్రెషన్, రాత్రివేళల్లో నిద్రపట్టకపోవడం, జ్ఞాపకశక్తి మందగించడం, అయోమయం, అంతా గందరగోళంగా అనిపిస్తుండటం వంటివన్నీ ‘కేంద్రనాడీవ్యవస్థ’ పై కనిపించే దుష్ప్రభావాలుగా చెప్పవచ్చు.
-డాక్టర్ పి. రంగనాథం
సీనియర్ కన్సల్టెంట్
న్యూరో సర్జన్
చదవండి: మేడమ్ నా వయసు 45 ఏళ్లు.. ఆ ట్యాబ్లెట్లు వాడొచ్చా?
Comments
Please login to add a commentAdd a comment