Omicron Variant New Symptoms & How Different From Delta Variant - Sakshi
Sakshi News home page

Omicron Variant: కొత్త వేరియంట్‌ కొత్త లక్షణాలు.. రాత్రుళ్లు దుస్తులు తడిచిపోయేంతగా చెమట.. ఇంకా!

Published Thu, Dec 16 2021 1:49 PM | Last Updated on Thu, Dec 16 2021 3:36 PM

Covid 19: Omicron Variant New Symptoms How Different From Delta Variant - Sakshi

కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ చాపకింద నీరులా విస్తరిస్తోంది. దక్షిణాఫ్రికాలో బయటపడ్డ ఈ వేరియంట్‌ ఇప్పటికే ప్రపంచ దేశాలకు వ్యాపించింది. ఒమిక్రాన్‌తో తొలి మరణం కూడా నమోదైన నేపథ్యంలో మరోసారి మహమ్మారి విజృంభిస్తే ఏం చేయాలన్న అంశంపై ప్రభుత్వాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం దీనిని ఆందోళనకరమైన వేరియంట్‌గా గుర్తించింది. 

భారత్‌లోనూ ఒమిక్రాన్‌ కేసులు వెలుగులోకి వస్తున్న సంగతి తెలిసిందే. కాగా డెల్టా వేరియంట్‌ కంటే అత్యంత వేగంగా విస్తరిస్తున్న ఒమిక్రాన్‌ తీవ్రత, లక్షణాలపై మాత్రం ఇప్పటికీ స్పష్టత రావడం లేదు. అయితే, కొంతమంది వైద్య నిపుణులు మాత్రం ఒమిక్రాన్‌ డెల్టా వేరియంట్‌ కంటే మరీ అంత ప్రమాదకరమైంది కాదని చెబుతున్నారు. అయితే, కాలక్రమంలో ఎలా రూపాంతరం చెందుతుందో చెప్పడం కష్టమని, అయితే సరైన జాగ్రత్తలు పాటిస్తే సురక్షితంగా బయటపడవచ్చని పేర్కొంటున్నారు.

వేగంగా వ్యాపిస్తోంది!
సార్స్‌-కోవ్‌-2 కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ అత్యంత సులభంగా, వేగంగా ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి వ్యాపిస్తుందని డబ్ల్యూహెచ్‌ఓ చెబుతోంది.  అయితే, డెల్టా రకంతో పోలిస్తే దీని లక్షణాలు భిన్నంగా ఉన్నాయని, ఇప్పటి వరకు అందించిన సమాచారం ప్రకారం పెద్దగా కంగారు పడాల్సిందేమీ లేదని తెలిపింది. మరోవైపు.. సౌతాఫ్రికాలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ను తొలిసారి గుర్తించిన ఆ దేశ మెడికల్‌ అసోసియేషన్‌ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ ఏంజెలిక్‌ కోట్జే సైతం దీని తీవ్రత తక్కువగానే ఉన్నట్లు పేర్కొనడం విశేషం.

ఒళ్లు నొప్పులు ఉన్నాయా? అయితే
దక్షిణాఫ్రికా హెల్త్‌ డిపార్టుమెంటుకు చెందిన డాక్టర్‌ ఉన్‌బెన్‌ పిల్లే మాట్లాడుతూ ఒమిక్రాన్‌ వేరియంట్‌ లక్షణాల గురించి వివరించారు. ఒమిక్రాన్‌ రాత్రి వేళల్లో చురుగ్గా ఉంటుందని, తీవ్రమైన ఒళ్లు నొప్పులు, రాత్రుళ్లు బాగా చెమట పట్టడం దీని లక్షణాలుగా చెప్పవచ్చన్నారు. వాసన కోల్పోవడం, ముక్కు కారడం వంటివి మాత్రం ఒమిక్రాన్‌ బాధితుల్లో ఎక్కువగా కనిపించడం లేదన్నారు.

అయితే కొంత మందిలో.. తీవ్రమైన తలనొప్పి, స్వల్ప జ్వరం, అలసట, గొంతులో దురద వంటి లక్షణాలు కూడా కనిపించాయని మరో డాక్టర్‌ తెలిపారు. అయితే, తాను కూడా బాధితులకు రాత్రి వేళల్లో తీవ్రమైన చెమట పట్టడం గమనించానని, దుస్తులు కూడా తడిసిపోతున్నట్లు చెప్పారు. 

ఒమిక్రాన్‌ ప్రధాన లక్షణాలు 


►స్వల్ప జ్వరం
►తీవ్రమైన ఒళ్లు నొప్పులు
►అలసట
►రాత్రుళ్లు విపరీతంగా చెమటపట్టడం
►గొంతులో జీర వంటివి ఒమిక్రాన్‌ ప్రధాన లక్షణాలుగా వైద్యులు పేర్కొంటున్నారు.

జాగ్రత్తలు పాటించాల్సిందే
అంతేగాక కోవిడ్‌ లక్షణాలైన పొడిదగ్గు, శ్వాసకోశ సమస్యలు, రక్తంలోని ఆక్సీజన్‌ లెవల్స్‌ పడిపోవడం వంటివి జరిగితే వెంటనే పరీక్షలు చేయించుకుని జాగ్రత్త పడాల్సిందిగా సూచిస్తున్నారు. 

అదే విధంగా తరచుగా శానిటైజర్‌తో చేతులు శుభ్రపరచుకోవడం, మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలు తప్పక పాటించాలని సూచిస్తున్నారు. కచ్చితంగా వ్యాక్సిన్‌ రెండు డోసులు, బూస్టర్‌ డోసులు వేయించుకోవాలని చెబుతున్నారు.  రోగ నిరోధక శక్తి పెంపొందించే ఆహారాన్ని తీసుకోవాలని సూచిస్తున్నారు.

చదవండి: Omicron Variant: ఒమిక్రాన్‌ ఎఫెక్ట్‌.. మళ్లీ ఆంక్షలు  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement