తల్లితో తనీషా దింగ్రా(ఫైల్ ఫొటో)
కలకాలం ఆయురారోగ్యాలతో జీవించాలన్న ఆశ ప్రతి మనిషిలో ఉంటుంది. అనుకోని అనారోగ్య ఉపద్రవాలతో మరికొద్దిరోజుల్లోనే అర్ధంతరంగా ఆయుష్షు మూడుతోందని తెలిస్తే... ఆ క్షణమే ప్రాణం పోతునట్లుగా అనిపిస్తుంది. అప్పటి నుంచి చివరి శ్వాస వరకు ఒక విధమైన నైరాశ్యం... నిర్లిప్తతలతోనే గడుపుతారు.
అయితే 23 ఏళ్ల తనీషా మాత్రం మరో ఐదేళ్లల్లోనే తన నూరేళ్ల ఆయుష్షు తీరిపోతుందని తెలిసినప్పటికీ.. తనలా క్యాన్సర్‌తో బాధపడుతోన్న రోగుల ముఖాల్లో చిరునవ్వులు పూయించింది. ఆ నవ్వులను చూస్తూ తను ఈ లోకంలో లేనప్పటికీ ..తన పేరు మీద ఎంతోమంది రోగులకు ఇప్పటికీ సాయమందిస్తూ చిరంజీవిగా నిలుస్తోంది.
ఢిల్లీకి చెందిన 23 ఏళ్ల తనీషా దింగ్రా చిన్నప్పటి నుంచి తెలివిగా చలాకీగా ఉండేది. చదువు పూర్తవగానే గూగుల్‌లో ఉద్యోగం రావడంతో జీవితాన్ని ఎంతో ఉల్లాసంగా గడుపుతుండేది. ఇలా ఉండగా ఓరోజు తనీషాకు తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది. హాస్పిటల్‌కు వెళ్తే డాక్టర్లు స్కానింగ్ చేయించగా అండాశయ క్యాన్సర్ ఉన్నట్లు తెలిసింది.
ఈ చేదునిజాన్ని ఆమెతోపాటు కుటుంబం జీర్ణించుకోలేకపోయింది. క్యాన్సర్ నుంచి తనని కాపాడేందుకు అనేక మంది డాక్టర్ల దగ్గరకు తిప్పినా ఎవరూ ఆమె బతుకుతుందన్న హామీ ఇవ్వలేకపోయారు. దాంతో లోపల ఎంత బాధగా ఉన్నా, మౌనంగా భరిస్తూ చికిత్స తీసుకోవడం ప్రారభించింది.
అమెరికా వెళ్లినప్పుడు...
చికిత్స నిమిత్తం తనీషాతోపాటు కుటుంబం ఎక్కువ సమయం అమెరికాలో గడపాల్సి వచ్చింది. కీమో జరుగుతుండగా కొంతమంది వలంటీర్లు వచ్చి తనీషాతో చక్కగా మాట్లాడుతూ ఆమె బాధను మరిపించేవారు. క్యాన్సర్ రోగులను వారు చూసుకునే విధానం, వలంటీర్లు అందించే మానసిక ప్రశాంతత, ఉత్సాహం తనీషాకు చాలా ఊరటనిచ్చాయి.
చికిత్స ముగించుకుని ఇండియా తిరిగి వచ్చిన తరువాత తను పొందిన సంతోషాన్ని ఇక్కడి క్యాన్సర్ రోగులకు ఇవ్వాలని నిర్ణయిచుకుంది. ఈ క్రమంలోనే తన తల్లి మీనాక్షి దింగ్రాతో కలిసి ‘ఇండియన్ క్యాన్సర్ సొసైటి’లో చేరింది. ఈ సొసైటీలో పనిచేస్తోన్న వలంటీర్లతో కలిసి వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న క్యాన్సర్ రోగులను కలిసి మానసిక ధైర్యాన్ని ఇచ్చే మాటలు చెబుతూ వారికి సాంత్వన కల్పించేది.
ఢిల్లీవ్యాప్తంగా రోగులను ఒకచోటకు చేర్చి ‘బ్రేక్ ఫ్రీ ఫ్రమ్ క్యాన్సర్’ పేరిట ఈవెంట్స్ నిర్వహించి కొన్ని గంటలపాటు తాము రోగులము కాదు అన్న భావన కలిగించేది. క్రమంగా సేవలను మరింత విభిన్నంగా విస్తరిస్తూ వచ్చింది తనీషా. రోగులకోసం ప్రత్యేకంగా స్టాండప్ కామెడీ షోలు, లాఫర్ క్లబ్స్, మేకప్ ఆర్టిస్ట్‌లతో వారిని అందంగా తీర్చిదిద్దడం, ఫోటోషూట్స్, జుట్టుని దానం చేయించడం వంటి అనేక కార్యక్రమాలు చేపట్టింది.
దీర్ఘకాల వ్యాధితో బాధపడుతున్నప్పటికీ జీవించిన కాసేపైనా ఆనందంగా గడపాలని చూసేది. తనీషా వలంటీరుగా సేవలందించిన మూడేళ్లల్లో వెయ్యిమందిలో సానుకూల దృక్పథాన్ని ఏర్పరిచింది. గూగుల్ ఉద్యోగిగా సింగపూర్, మలేషియా, అమెరికా వంటి దేశాల్లో మోటివేషనల్ స్పీచెస్‌తో ఎంతోమంది రోగులను ఉత్సాహపరిచింది.
నాలుగేళ్ల తరువాత..
నాలుగేళ్లపాటు ధైర్యంగా పోరాడిన తనీషా 2020లో ఆరోగ్యం బాగా దెబ్బతినడంతో బాగా కుంగిపోయింది. దీంతో మరోసారి అమెరికా వెళ్లి సర్జరీ చేయించుకుని ఏడాది పాటు అక్కడే ఉంది. కాస్త మెరుగుపడిందని ఇండియా వచ్చినప్పటికి గతేడాది డిసెంబర్ 30న జరిగిన పోరాటంలో క్యాన్సర్ తనీషా మీద విజయం సాధించింది.
దీంతో తను బతికి ఉన్నప్పుడు చేసిన కార్యక్రమాలను ‘తనీషా ఫౌండేషన్’ పేరుతో తనీషా తల్లి మీనాక్షి నిర్వహిస్తోంది. ఈ ఫౌండేషన్ ద్వారా తనీషా ఉన్నప్పుడు చేపట్టిన కార్యక్రమాలతోపాటు, క్యాన్సర్ రోగులకు మందులను ఇస్తూ ఎంతోమందిని అదుకుంటున్నారు.
ఇలా ఇప్పటిదాకా 2500 మంది రోగులు లబ్ధి పొందారు. ఎటువంటి విపత్కర పరిస్థితుల్లోనైనా మనోధైర్యంతో ముందుకు సాగితే మనకు కాకపోయినా ఇతరులకు సాయ పడవచ్చన్న మాటకు తనీషా జీవితం ఉదాహరణగా నిలుస్తుంది.
చదవండి: Chutni Mahato: 25 ఏళ్లుగా పోరాటం.. 125 మంది మహిళలను కాపాడింది
Comments
Please login to add a commentAdd a comment