నగర విస్తరణలో నయా ట్రెండ్
అలనాటి ఆదరణ కలిగిన కేఫేల అడ్రస్‌లు గల్లంతు
మహానగరంలో ఒకనాటి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన కేఫ్‌లు చాలామటుకు కాలగర్భంలో కలిసిపోయాయి. చాయ్.. బిస్కెట్.. సమోసాతో కడుపు నింపిన ఆ మినీ హోటళ్ల అడ్రస్ గల్లంతయ్యాయి. రియల్ ఎస్టేట్ పుణ్యమా? కొన్ని..రోడ్ల విస్తరణలో మరికొన్ని.. ఇబ్బడిముబ్బడిగా ఏర్పాటైన హోటళ్లు, చాయ్ బడ్డీల విస్తరణలో ఇంకొన్ని.. ఇలా కారణమేదైనా నలుగురినీ కలిపే అడ్డాలు కనుమరుగైపోయాయి.
కొద్దిసేపు స్నేహితులతో బాతాఖానీ కొడితే గానీ ఆ రోజు మనశ్శాంతిగా గడవని వారు ఎందరో.. ఫ్రెండ్స్‌తో గడపడం ద్వారా మరింత ఉత్సాహం పెరుగుతుందని పలు సర్వేలు సైతం స్పష్టం చేస్తున్నాయి.. అయితే గతంలో ఆ ఊసులకు చిరునామాగా నిలిచిన పలు కేఫ్‌ల జాడ ఇప్పుడు కానరావడం లేదు.
భానుడి కిరణాలు పుడమి తల్లిని తాకకమునుపే కేఫ్‌లలో సందడి మొదలయ్యేది. అప్పటి నుంచి అర్ధరాత్రి వరకూ అదే కోలాహలం కొనసాగుతూ ఉండేది. తాజా వార్తలతో ప్రింటింగ్ అయ్యి బయటకు వచి్చన దినపత్రికలు ఆయా కేఫ్‌ల వద్దకు చేరే రోజులు అవి. అక్కడి నుంచే పేపర్‌బాయ్స్ దినపత్రికలను సర్దుకుని సైకిల్‌పై తమ జీవనయానాన్ని కొనసాగించిన వారు కోకొల్లలు. అలా ‘పేపర్ బాయ్స్’ మధ్య ఆత్మీయ బంధాన్ని కేఫ్‌లు పెనవేశాయి. ఇక కూలి పని కోసం తెల్లవారుజామునే వచ్చేవారికి కేఫ్‌లే అడ్డాలు.
చాయ్..బిస్కెట్ కడుపులో పడేసి పనికి పోయే కూలీల మధ్య మైత్రీ బంధాన్ని కట్టిపడేశాయి. ఐటీ కోర్సులకు హబ్‌గా పేరొందిన అమీర్‌పేట లాంటి ప్రాంతాల్లో జాబ్ అన్వేషణలోనూ అనేక కొత్త పరిచయాలను ఈ అడ్డాలే కల్పించేవి.
రిలాక్సేషన్ మంత్రంగా..
ఒకప్పుడు రిలాక్సేషన్ కేంద్రాలంటే కేఫ్‌లే. గంటల తరబడి ఊసులు, ముచ్చట్లకు అవే ప్రధాన కేంద్రాలు. ఇప్పుడంటే పార్కులు, ప్రత్యేక డే కేర్ సెంటర్లు.. ఇలా వచ్చాయి గానీ, అప్పట్లో కేఫ్‌లే ఇందుకు వేదికలుగా ఉండేవి. కొద్దిసేపు తోటి సహచరులతో కబుర్లు చెప్పుకుంటూ మనసులోని భారాన్ని దింపుకునే రిలాక్సేషన్ కేంద్రాలుగా కేఫ్‌లు నిలిచేవని నాటి నగరవాసుల అభిప్రాయం
మాయమవుతున్న నాటి సంస్కృతి
దేశంలోనే తొలి పారిశ్రామికవాడగా వర్ధిల్లిన సనత్‌నగర్ చెంతన ఆల్విన్ కంపెనీ ఎదురుగా ఇండస్ట్రియల్ కేఫ్ ఉండేది. ఈ ఎస్టేట్‌లో పనిచేసే కారి్మకులతో పాటు ఉద్యోగులు, ఉన్నత స్థానాల్లో ఉండేవారంతా రోజులో ఏదో ఒక సమయంలో అక్కడ కలుసుకుని కొంతసేపు కబుర్లు చెప్పుకునేవారు. అప్పట్లో ఎస్టేట్ కారి్మకుల అడ్డాగా ఇది ఖ్యాతికెక్కింది. రానురాను ఇక్కడి పరిశ్రమలన్నీ తరలిపోవడంతో ఈ కేఫ్ కూడా మూతబడింది. ప్రస్తుతం అక్కడ ఆస్పత్రి వెలిసింది. నగరం నడి బొడ్డున అమీర్‌పేట చౌరస్తాలో దశాబ్దం క్రితం ఇమ్రోజ్ కేఫ్ ఉండేది. ఎప్పుడు చూసినా యువకులతో కోలాహలంగా ఉండేది. ఇక ప్యారడైజ్ సమీపంలో సుపరిచితమైన రియో కేఫ్ రోడ్డు విస్తరణలో పోయింది.
గ్యాస్‌మండీ సమీపంలోని సిటీలైట్ కేఫ్ అగ్ని ప్రమాదం అనంతరం కమర్షియల్ కాంప్లెక్స్‌గా మార్చేశారు. ఈఎస్‌ఐ ఆస్పత్రి సమీపంలో జుగ్ను ఇరానీ కేఫ్, ఎస్‌ఆర్ నగర్ పాత లా అండ్ ఆర్డర్ పోలీస్‌స్టేషన్ ఆనుకుని గుడ్‌లక్ కేఫ్, ఉమేష్‌చంద్ర విగ్రహం వద్ద అల్మాస్ కేఫ్, అమీర్‌పేట శీష్‌మహల్ థియేటర్ వద్ద స్టాండర్డ్ కేఫ్ అడ్రస్ లేకుండాపోయాయి. ఫతేనగర్ ఫ్లైఓవర్ వద్ద డాట్సన్ కేఫ్ ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు సరిహద్దుగా ఉండేది. అయితే ఫతేనగర్ ఫ్లైఓవర్ నిర్మాణంతో దీని జాడ లేకుండాపోయింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకనాడు నగరంలో కళకళలాడిన ఎన్నో కేఫ్‌లు జాడ లేకుండా పోయాయి..
కష్టసుఖాలు పంచుకునేవాళ్లు..
అమీర్‌పేటలో ఒకప్పుడు చాలా కేఫ్‌లు ఉండేవి. వాటిల్లో అల్మాస్, ఆల్‌బ్రైట్, స్టాండర్డ్, గుడ్‌లక్..ఇలా ఏ కేఫ్‌కు వెళ్లినా కాసేపు కూర్చొని కష్టసుఖాలు మాట్లాడుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు అవన్నీ బంద్ అయ్యాయి. చాయ్ తాగాలంటే బడ్డీ దగ్గరకు వెళ్లి రావాల్సిందే.
– సర్దార్ సురేందర్‌సింగ్, అమీర్‌పేట
ఒక్కో కేఫ్‌కూ.. ఒక్కో ప్రత్యేకత : అమీర్‌పేటలో ఒకప్పుడు చాలా కేఫ్‌లు ఉండేవి. వాటిల్లో అల్మాస్, ఆల్‌బ్రైట్, స్టాండర్డ్, గుడ్‌లక్..ఇలా ఏ కేఫ్‌కు వెళ్లినా కాసేపు కూర్చొని కష్టసుఖాలు మాట్లాడుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు అవన్నీ బంద్ అయ్యాయి. చాయ్ తాగాలంటే బడ్డీ దగ్గరకు వెళ్లి రావాల్సిందే.
గుడ్‌లక్ కేఫ్‌తో ఎంతో అనుబంధం..
స్నేహితులంతా కలిసి ఎక్కువగా ఎస్‌ఆర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పక్కన గుడ్‌లక్ కేఫ్ హోటల్‌కు వెళ్లి బాతాఖానీ కొట్టేవాళ్లం. గంటల తరబడి ముచ్చట్లు పెట్టే వాళ్లం. నాటి కేఫ్‌లు ముచ్చట్లకు అడ్డాగా ఉండేవనడంలో ఎలాంటి సందేహం లేదు.
– సరాఫ్ సంతోష్, సనత్‌నగర్
Comments
Please login to add a commentAdd a comment