శరన్నవరాత్రి మహౌత్సవాలలో అమ్మవారి అలంకారాలలో చివరి రూపం శ్రీ రాజరాజేశ్వరీదేవి. సకల భువన బ్రహ్మండాలకు రాజరాజేశ్వరీదేవి ఆరాధ్య దేవత. మహాత్రిపుర సుందరిగా ఈ దేవత త్రిపురాత్రయంలో పూజలందుకుంటుంది. పలు చోట్ల ఈ దేవిని "అపరాజితాదేవి"గా కూడా భక్తులు పూజించే ఆచారం ఉంది. రాజరాజేశ్వరి స్వప్రకాశ జ్యోతి స్వరూపిణి.
పరమేశ్వరుడి అంకం అమ్మకు ఆసనం. ఇచ్ఛా, జ్ఞాన, క్రియా శక్తులను ఈ మూర్తి తన భకుల్తకు వరాలూగా అనుగ్రహిస్తుంది. ఈమె యోగమూర్తి. మాయా మోహిత మానవ మనోచ్తెతన్యాన్నిఈ రాజరాజేశ్వరి దేవి ఉద్దీపితం చేస్తుంది. అనంత శక్తి స్వరూపమైన శ్రీ చక్రానికి ఈమె అధిష్టాన దేవత.
ఆ పేరు ఎలా వచ్చిందంటే..
దేవదానవులు పాలసముద్రమును మధించినప్పుడు అమృతం వచ్చింది ఈ విజయదశమి రోజే అని పురాణ కథనం. 'శ్రవణా' నక్షత్రంతో కలసిన ఆశ్వీయుజ దశమికి 'విజయా' అనే సంకేతమున్నది. అందుకనే దీనికి 'విజయదశమి' అనుపేరు వచ్చినది .ఈ విజయదశమి నాడు తిధి, వారము, తారాబలము, గ్రహబలము, ముహూర్తము మొదలైన వాటితో నిమిత్తం లేకుండా కార్యం చేపట్టొచ్చు. పైగా తప్పక విజయం వరిస్తుంది. ఈ పర్వదినాన చేసే 'శమీపూజ' చాలా విశేషమైనది. శమీవృక్షమంటే 'జమ్మిచెట్టు'.
అజ్ఞాతవాసమందున్న పాండవులు వారివారి ఆయుధములను, వస్త్రములను శమీవృక్షముపై దాచి వుంచారు. అజ్ఞాతవాసము పూర్తి అవగానే ఆ వృక్ష రూపమును పూజించి ప్రార్థించి.. తిరిగి ఆయుధాలను వస్త్రములను పొందారు. శమీవృక్ష రూపంలో ఉన్న 'అపరాజితా' దేవి ఆశీస్సులు పొంది, కురుక్షేత్రంలో కౌరవులపై విజయము సాధించినారు. శ్రీరాముడు కూడా ఈ విజయదశమి రోజున ఈ 'అపరాజితా' దేవిని పూజించి, రావణుని సహరించి, విజయాన్ని పొందాడు.
ఇక తెలంగాణా ప్రాంతమందు శమీపూజ అనంతరం 'పాలపిట్ట'ను చూచే ఆచారం కూడా ఉన్నది. ఇలా అందరూ నవరాత్రులు జరుపుకుని, విజయదశమిరోజు సాయంత్రం నక్షత్ర దర్శన విజయ సమయాన శమీవృక్షం (జమ్మిచెట్టు) వద్దగల అపరాజితాదేవిని పూజించి, ఈ క్రింద ఇచ్చిన శ్లోకం స్మరిస్తూ చెట్టుకు ప్రదక్షిణలు చేస్తారు.
“శమీ శమయతే పాపం శమీశతృ నివారిణీ
అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శినీ ||"
ఈ అపరాజితాదేవిని పసుపు పచ్చని పూలతో పూజించాలి. ఆ తర్వాత శక్త్యానుసారం సువాసినీ పూజ చేయాలి. ఈ రోజు జపించాల్సిన మంత్రం...
"ఐం క ఏ ఈల హ్రీం, క్లీం హసకహల హ్రీం సౌ: సకల హ్రీం"
అనే మంత్రం జపించాలి. వీలైతే లలిత సహస్రనామం పారాయణ చేసి కుంకుమార్చన చేయాలి.
నైవేద్యం: లడ్దూలు, బూర్లు, భక్ష్య భోజ్యాలు నివేదించాలి.
(చదవండి: ఆ 'ఆదిపరాశక్తి' పేరు మీదుగా వెలిసిన మహానగరాలివే..!)
Comments
Please login to add a commentAdd a comment