సీజన్ మారింది. వాతావరణంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. ఏటా వచ్చే ఈ మార్పును వాతావరణ శాఖ అధికారికంగా నమోదు చేస్తుంది. కానీ అంతకంటే ముందే మన దేహం సంకేతాలను జారీ చేస్తుంది. దుప్పటి పక్కకు తోసేసే పిల్లలు ఒద్దికగా దుప్పటిలో తమను తాము ఇముడ్చు కుంటారు. సాక్స్ వేసుకునేటప్పుడు సాఫీగా సాగిపోకుండా పాదాల చర్మానికి తగులుకోవడం, దారాలు లేవడం మరో సంకేతం. పెద్ద బైట్ తీసుకుందామని నోరు అమాంతం తెరిస్తే పొడిబారిన పెదవులు సహకరించవు. ఆరు నెలలుగా డ్రెస్సింగ్ టేబుల్ డ్రాల్లో ఉండిపోయిన లిప్‌బామ్‌లు, బాడీ లోషన్‌లు బయటకు వస్తాయి. కాలం మారింది... అందుకే లైఫ్ స్టైల్ కూడా మారి తీరాలి మరి.
దేహం రాజీ పడదు
చలికాలం దాదాపుగా అందరూ చేసే ప్రధానమైన పొరపాటు నీరు తక్కువగా తీసుకోవడం. ‘దాహం వేయలేదు కాబట్టి తక్కువగా తాగాం, దేహానికి అవసరమైతే దాహం వేస్తుంది కదా’ అని సౌకర్యవంతమైన సమాధానం చెప్పుకుంటే కుదరదు. చల్లటి నీటికి బదులు నార్మల్ వాటర్ లేదా గోరువెచ్చటి నీటిని ఎప్పటిలాగానే రెండు ముప్పావు నుంచి మూడు ముప్పావు లీటర్ల వరకు తీసుకోవాలి. మజ్జిగ, పండ్ల రసాల వంటి ద్రవాలను ఎక్కువ తీసుకున్నప్పుడు నీటి పరిమాణాన్ని కొంత వరకు తగ్గించుకోవచ్చు.
‘యూఎస్ నేషనల్ అకాడమీస్ ఆఫ్ సైన్సెస్, ఇంజనీరింగ్ అండ్ మెడిసిన్’ సూచన మేరకు సగటున ఒక మహిళ రోజుకు 2.7 లీటర్లు, మగవాళ్లు 3.7 లీటర్లు ద్రవాలు (నీరు, ఇతర ద్రవాహారం కలిపి) దేహానికి అవసరమని సూచించింది. ఏ కాలమైనా సరే... దేహంలోని వ్యర్థాలను బయటకు పంపించడానికి దేహక్రియలకు అవసరమైన ద్రవాలు దేహానికి అంది తీరాలి. అప్పుడే చర్మం పొడిబారకుండా, నిర్జీవంగా మారిపోకుండా ఆరోగ్యంగా ఉంటుంది. దేహంలోని వ్యర్థాలు విసర్జితం కాకుండా చర్మం మీద ఎన్ని లోషన్‌లు రాసినా దేహక్రియలు మెరుగుపడవు, చర్మఆరోగ్యం కూడా మెరుగవదనే విషయాన్ని మర్చిపోకూడదు.
చదవండి: 23 కోట్ల బీమా సొమ్ము కోసం రైలు పట్టాలపై పడుకుని రెండు కాళ్లు..!!
వెచ్చ‘టీ’లు
ఈ సీజన్‌లో బాలెన్స్‌డ్ డైట్ తప్పని సరి. పగలు పుదీనా టీ, తులసి టీ, గ్రీన్ టీ, హెర్బల్ టీ, లెమన్ టీ, తాజా నిమ్మరసం తీసుకోవాలి. అందుబాటులో ఉంటే కొబ్బరి నీరు కూడా తాగచ్చు. కొబ్బరి నీరు ఎండాకాలంలో మాత్రమే తాగాలనుకోవడం కేవలం అపోహ మాత్రమే. వర్షాకాలమైనా, శీతాకాలమైనా కొబ్బరి నీరు ఆరోగ్యకరమే. రాత్రి భోజనానికి ముందు వెజిటబుల్ సూప్‌లు తాగాలి. పొట్టుతో కూడిన ధాన్యాలు, పప్పులు, నట్స్, మంచి నెయ్యి రోజువారీ ఆహారంలో ఉండాలి. మాంసాహారులైతే ఈ కాలంలో మ మటన్‌కు బదులు తేలిగ్గా జీర్ణమయ్యే చేపలు, చికెన్, గుడ్లు తీసుకోవచ్చు. వాల్‌నట్, అవిసె గింజలు తీసుకోవాలి. అలాగే బొప్పాయితోపాటు బత్తాయి, కమలాపండ్లు రోజూ తీసుకుంటే మంచిది. ఇక కూరల్లో ఈ సీజన్‌లో పండే అన్ని రకాల కూరగాయలు, క్యాలిఫ్లవర్, బ్రోకలి వారంలో ఒకసారైనా తీసుకుంటుంటే చర్మానికి మాయిశ్చర్ సహజంగా అందుతుంది.
చదవండి: ఆ ఫొటోలు తీసినందుకు దేశం నుంచి శాశ్వతంగా బహిష్కరించారు..
ఎమోషనల్ ఈటింగ్ వద్దు
ఆహార విహారాల్లో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కొందరిలో వారికి ఉన్న ఇతర ఆరోగ్యకారణాల రీత్యా ఈ కాలంలో విటమిన్ డీ 3, బీ12 లోపం ఏర్పడుతుంటుంది. బీ 12 లోపం మానసిక రుగ్మతలకు దారి తీస్తుంది. ప్రతి చిన్న విషయానికీ విపరీతమైన భావోద్వేగాలకు లోనవుతుంటారు. ఈ మానసిక అలజడి నుంచి సాంత్వన పొందడానికి ఎప్పుడూ ఏదో ఒకటి తింటూనే ఉంటారు. ఈ ఎమోషనల్ ఈటింగ్ చాలా సందర్భాల్లో ఓవర్ ఈటింగ్‌కు దారి తీస్తుంది. కాబట్టి దేహంలో బీ12, డీ3 విటమిన్ స్థాయులు తగ్గకుండా చూసుకోవాలి. అవసరం అనిపిస్తే విటమిన్ లెవెల్స్ టెస్టులతో నిర్ధారించుకుని తదనుగుణంగా జీవనశైలి మార్పులు చేసుకోవచ్చు.
ఎండ మంచిదే!
రోజూ కనీసం అరగంట సమయం అయినా సూర్యరశ్మి ఒంటి మీద పడాలి. అప్పుడే దేహంలో సెరోటోనిన్ స్థాయులు, మెలటోనిన్ స్థాయులు సక్రమంగా ఉంటాయి. అవి మంచి నిద్రకు, హార్మోన్స్ సమతుల్యతకు దోహదం చేస్తాయి. కాబట్టి ఈ విధమైన జీవనశైలితో దేహంలో వ్యాధినిరోధక శక్తిని పెంచుకోవచ్చు. చలికాలంలో దేహ సాధారణ ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవడంతోపాటు రెండేళ్లుగా భయపెడుతున్న కరోనా వ్యాధిని, భౌతికదూరం వంటి జాగ్రత్తలను మర్చిపోకూడదు.
చదవండి: పాదాలను బట్టి వారెలాంటివారో అంచనా వేయొచ్చట!!.. ఐతే..
Comments
Please login to add a commentAdd a comment