Nashik Trupti Gaikwad After Puja Turns Idols Into Toys: జైజై గణేశా! జై కొట్టు గణేశా!! వరములిచ్చు ఓ బొజ్జ గణేశా!!! అని పాటలు పాడుకుని ఆటలు ఆడుకుని వేడుక చేసుకున్నంత వరకు బాగానే ఉంటుంది. వేడుక పూర్తయిన తర్వాత ఆ బొజ్జ గణపయ్యను ఏం చేయాలనేదే పెద్ద ప్రశ్న. ఓ దశాబ్దం కిందటి వరకు దగ్గరలో ఉన్న చెరువు, సముద్రం, సరస్సు, కొలను... ఏదో ఒకచోట నీటిలో కలిపేసే వాళ్లం. సింథటిక్ రంగులు, ప్లాస్టిక్ వాడకం వల్ల పర్యావరణానికి జరిగే హాని పట్ల చైతన్యవంతం అవుతున్న కొద్దీ గణేశ్ విగ్రహాన్ని నిమజ్జనం చేయడానికి అనేక దారులు వెతుక్కుంటున్నాం.
అందుకోసం మేధోమధనమే చేస్తున్నాం. మట్టి గణపతిని బకెట్‌లో నీటిలో వేసి కరిగించి మొక్కలకు పోయడం నుంచి గణపతిని విత్తనాలతో మలిచి, పూజ పూర్తయిన తరవాత పంటమడిగా మార్చడం వరకు ఎన్ని కొత్త ఆలోచనలో. మహారాష్ట్ర, నాసిక్‌కు చెందిన అడ్వొకేట్ తృప్తి గైక్వాడ్ కూడా వినూత్నంగా ఆలోచించారు. ఆమె గణపతి బొమ్మలను రీసైకిల్ చేసి బొమ్మలుగా మారుస్తున్నారు.
రెండేళ్ల కిందట మొదలైంది
‘మా ఇల్లు గోదావరి నది తీరాన ఉంది. ఓ రోజు ఓ వ్యక్తి నదికి ఓ భారీ లగేజ్‌తో వచ్చాడు. అందులో ఉన్న వస్తువులన్నింటినీ నదిలో కలిపేయాలనేది అతడి ప్రయత్నం. వీటిని జలమయం చేయవద్దు, రీసైకిల్ చేసి ఉపయోగించుకోదగిన వస్తువులుగా మార్చుకోవచ్చని చెప్పాను. అతడు అంగీకరించాడు. అలా మొదలైన నా ప్రయత్నంలో ఆ తర్వాత గణేశ విగ్రహాల రీసైక్లింగ్ కూడా చేరింది.
విగ్రహాల తయారీలో ఉపయోగించిన మెటీరియల్ మొత్తాన్ని వేరు చేసి కొత్త బొమ్మలను చేస్తున్నాం. ఆ బొమ్మలను అల్పాదాయ వర్గాల కాలనీల పిల్లలకు పంచుతున్నాం. ఒక్కోసారి ఒక్కోచోటకు వెళ్లి ఇస్తుంటాం. మా ప్రయత్నం గురించి తెలుసుకున్న వాళ్లు పండుగ తర్వాత వాళ్లంతట వాళ్లే బొమ్మలను తెచ్చి ఇస్తున్నారు. పూనా, నాగపూర్, ముంబయి నుంచి కూడా మాకు గణేశ బొమ్మలు వస్తున్నాయి. ఇప్పటివరకు ఇరవై వేలకు పైగా విగ్రహాలను కరిగించి పిల్లలు ఆడుకునే బొమ్మలను చేశాం’’ అని చెప్తున్నారు తృప్తి గైక్వాడ్.
Comments
Please login to add a commentAdd a comment