కొత్త రంగాలు ఉనికిలోకి రావడం వల్ల ‘ఉద్యోగమే సర్వస్వం’ ‘ఉద్యోగం దొరికితే చాలు’ అనుకోవడం లేదు యువతరంలో చాలామంది. దీనికి కారణం...ప్రత్యామ్నాయ అవకాశాలు. ‘ఉద్యోగం ఎందుకు చేయాలి?’ నుంచి ‘చేస్తే ఎలాంటి ఉద్యోగం చేయాలి’ వరకు కెరీర్ బాట పట్టడానికి ముందు రకరకాల కోణాలలో ఆలోచిస్తున్నారు. మంచి వేతనం కంటే మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.
44 దేశాల్లో మిలీనియల్స్, జెన్ జెడ్‌పై సర్వే చేసింది డెలాయిట్. దీని ప్రకారం ప్రైమరీ జాబ్ తోపాటు మరో జాబ్ చేస్తున్న యువ ఉద్యోగుల సంఖ్య తక్కువేమీ కాదు. బెంగళూరులో ఒక ప్రైవేట్ కాలేజీలో పని చేస్తున్న పరిమళ ఆన్‌లైన్‌లో వ్యాపారం కూడా చేస్తుంటుంది.
‘డబ్బు కోసం కాదు. అదొక ఫ్యాషన్’ అంటుంది తన ఆన్‌లైన్ వ్యాపారం గురించి. లింక్డ్ ఇన్ సర్వే ప్రకారం 2023లో మన దేశంలో 88 శాతం మంది జెన్ జెడ్ ఉద్యోగులు ‘ఉద్యోగ మార్పు’నకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. జెన్ జెడ్ ఉద్యోగులపై ఆర్పీజీ గ్రూప్ నిర్వహించిన ఒక సర్వే ప్రకారం పదిమందిలో ఆరుగురు మంచి వేతనం కంటే మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చారు.
‘పని ఒత్తిడి చచ్చినట్లు భరించాల్సిందే’ అని రాజీపడడం కంటే ‘జీతం తక్కువ అయినా సరే నాకు నచ్చిన ఉద్యోగం చేస్తాను’ అని ఆలోచిస్తున్న వారి సంఖ్య యువతరంలో ఎక్కువగానే ఉంది. ముంబైలోని ఒక మల్టీ నేషనల్ కంపెనీలో ఉద్యోగం చేసిన అనన్యకు పనిభారంతో ఊపిరాడేది కాదు. ఒక ఫైన్ మార్నింగ్ ‘ఇది కాదు జీవితం’ అనిపించింది. తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఒక స్వచ్ఛంద సంస్థలో పనిచేస్తోంది. ‘నేను పని చేస్తున్న కంపెనీతో పోల్చితే ఇది చాలా చిన్న ఉద్యోగం కావచ్చు. కాని
ఎంతో సంతోషంగా ఉంది’ అంటుంది అనన్య. ఒక మార్కెటింగ్ సంస్థలో ఉద్యోగం చేసిన ఇరవై సంవత్సరాల సారా బోహ్ర ఆ ఉద్యోగం మానేసి సొంతంగా మార్కెటింగ్ ఫర్మ్ మొదలుపెట్టింది. వర్క్ ఫ్రమ్ హోమ్‌కు ప్రాధాన్యత ఇస్తోంది. ‘ఇప్పుడు చాలా సౌకర్యంగా ఫీలవుతున్నాను. పని ప్రకారం కాదు గంటల ఆధారంగా ప్రొడక్టివిటీని కంపెనీలు అంచనా వేస్తున్నాయి’ అంటుంది సారా
తీయని పాఠాలు..
రాజస్థాన్‌లోని వనస్థలి యూనివవర్శిటీలో బీబీఏ డిగ్రీ పూర్తి చేసిన అనువ కక్కర్ ఉద్యోగం కంటే సొంత స్టార్టప్‌కే ్ర΄ాధాన్యత ఇచ్చింది. అయితే కస్టమైజ్డ్ పోస్టర్ కార్డ్‌లకు సంబంధించి ఆన్‌లైన్ బిజినెస్‌లో ఫెయిల్ అయింది. అయితే ఈ ఫెయిల్యూర్ నుంచి పాఠాలు నేర్చుకున్న అనువ ‘టిగెల్’ చాకోలెట్ బ్రాండ్‌తో సక్సెస్ అయింది. హాట్ చాక్లెట్+వింటర్= హ్యాపీనెస్ నినాదంతో చిన్న బడ్జెట్‌లో కంపెనీ మొదలు పెట్టింది. కస్టమర్ చాయిస్‌లను అర్థం చేసుకోవడంలో పట్టు సాధించింది. ‘టిగెల్’ స్టార్ట్ చేసినప్పుడు అనువ వయసు 21 సంవత్సరాలు. ‘చిన్న వయసులో ఎంటర్‌ప్రెన్యూర్‌గా ప్రస్థానం మొదలు పెట్టడం వల్ల ఎన్నో విషయాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది’ అంటుంది అనువ కక్కర్.
బెస్ట్ ప్లాన్ బెడిసి కొడితే?
‘ఈ రంగంలో మాత్రమే పనిచేస్తాను అని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఏ రంగంలో పని చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. యాంత్రిక జీవితం కంటే ఉల్లాసకరమైన మార్పు చాలామంచిది’ అంటుంది చెన్నైకి చెందిన శ్రీతేజ. కోల్‌కత్తాకు చెందిన 23 సంవత్సరాల మనీష తన ఉద్యోగానికి సంబంధించి ఇప్పటికీ మూడు రంగాలు మారింది. అలా అని ఆమెలో పశ్చాత్తాపం ఏమీ లేదు. ‘ఏ రంగంలో అయినా పనిచేయగలను అనే నమ్మకం వచ్చింది’ అంటుంది మనీష. వర్క్ నుంచి గ్యాప్ తీసుకోవాలనుకునే యువతరం కోసం ఈమధ్య కాలంలో ఎన్నో ‘గ్యాప్ ఇయర్ కమ్యూనిటీస్’ వచ్చాయి. ‘గ్యాప్‌ఎక్స్’ పేరుతో హరియాణాలోని అశోకా యూనివర్శిటీలో 40 మంది స్టూడెంట్స్‌తో కూడిన గ్రూప్ ఉంది.
‘యువతలో చాలామంది కెరీర్ మార్గాన్ని నిర్ణయించుకునే ముందు వివిధ అవకాశాల గురించి అన్వేషిస్తున్నారు. ఆలోచిస్తున్నారు’ అంటున్నాడు దిల్లీ యూనివర్శిటీ మాజీ వైస్ చాన్సలర్ దినేష్ సింగ్. చేస్తున్న ఉద్యోగాన్ని మానేసి నచ్చిన ఉద్యోగం చేయడం, సొంతంగా కంపెనీ మొదలుపెట్టడం, ఉద్యోగ విరామం తీసుకొని ఆన్‌లైన్ కోర్సులలో చేరడం వరకు తమదైన దారిలో ప్రయాణం చేస్తోంది నవతరం.
(చదవండి: సడెన్‌గా మిస్ యూఎస్‌ఏ స్థానం నుంచి తప్పుకుంటున్న మోడల్!కారణం ఇదే..)
Comments
Please login to add a commentAdd a comment