అవంతీబాయి లోధీ, ఉదాదేవి రేఖాచిత్రం, ఝల్కారీబాయి తైలవర్ణ చిత్రం
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మహిళల భద్రత, మహిళల రక్షణ కోసం ‘మిషన్ శక్తి’ పేరుతో కొత్తగా మూడు మహిళా సాయుధ దళాలను ఏర్పాటు చేయబోతోంది. ఆ దళాలకు 1857 నాటి తొలి భారత స్వాతంత్య్ర సంగ్రామ మహిళా యోధుల పేర్లు పెట్టినట్లు ప్రకటించింది. ఆ ముగ్గురు వీరాంగనల శౌర్యసాహసాల విశేషాలు క్లుప్తంగా..
ఉత్తరప్రదేశ్‌లోని బుదాన్, లక్నో, గోరఖ్‌పూర్‌లలో కొత్తగా మూడు మహిళా దళాలు ఏర్పాటవబోతున్నాయి. ‘ప్రావిన్షియల్ ఆర్మ్‌డ్ కాన్‌స్టేబ్యూలరీ’ ఉమెన్ బెటాలియన్‌లు అవి. ‘పి.ఎ.సి.’లు. ప్రాదేశిక సాయుధ మహిళా రక్షణ దళాలు. మొన్న మార్చి 20 న లక్నోలో జరిగిన రాణి అవంతీబాయి లోధీ వర్ధంతి సందర్భంగా ఏర్పాటైన ఒక కార్యక్రమంలో యు.పి. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ ఈ విషయాన్ని ప్రకటించారు. మహిళలు, బాలికల భద్రతకు, రక్షణకు ఈ మహిళా పి.ఎ.సి.లు పనిచేస్తాయి. ఒక్కోదళానికి ఒక్కో పేరుగా.. రాణి అవంతీబాయి లోధీ, ఉదాదేవి, ఝల్కారీబాయి పేర్లను పెట్టారు. ఈ ముగ్గురూ తొలి స్వాతంత్య్ర సంగ్రామంలోని వీరాంగనలు. 1857–1858 మధ్య బ్రిటిష్ వారితో వీరోచితంగా పోరాడి అమరులైనవారు. నాడు పరదేశీయుల నుంచి స్వాతంత్య్రం కోసం పోరాడిన మహిళా యోధుల పేర్లను నేటి స్వతంత్ర భారతదేశంలో మహిళల్ని అఘాయిత్యాల నుంచి, అత్యాచారాల నుంచి, అకృత్యాల నుంచి కాపాడేందుకు ఏర్పాటు చేసిన మహిళా దళాలకు పెట్టడం.. ‘చరిత్రను మరవొద్దు, మనవాళ్లు ఎలాంటి అఘాయిత్యాలకు గురయ్యారో, మహిళలపై మనం అలాంటి హేయమైన పనులకు పాల్పడొద్దు’ అని చెప్పడమే.
రాణీ అవంతీబాయి, ఉదాదేవి, ఝల్కారీబాయి.. బ్రిటిష్‌వాళ్ల గుండెలు గుభేల్మనిపించిన మహిళలు. ఖడ్గాన్ని ఎత్తిపట్టి గుర్రపు స్వారీ చేసుకుంటూ వచ్చి సమరశంఖం వంటి ఒక గర్జన చేస్తే.. అదీ మహిళలు చేస్తే.. బ్రిటిష్ అధికారులు వెనకడుగు వేస్తారా? అయితే స్వాతంత్య్రం కోసం వీరు కనబరిచిన నిబద్ధత, నిబ్బరం తెల్లవాళ్లని తెల్లబోయేలా చేసింది! నిబ్బరం సరే, ప్రతి స్వాతంత్య్ర సమరశీలికీ ఉండేదే. నిబద్ధత ఏమిటి? ఏమిటంటే.. ఆనాడు బ్రిటిష్ వాళ్లపై తిరుగుబాటు చేసిన అనేకమంది స్వదేశీ రాజ్యపాలకులకు లేనిది! అవును. అందరం కలిసి పోరాడదాం అనుకున్నాక కూడా మనవాళ్లు కొందరు జారిపోయారు. కొందరు రహస్యంగా బ్రిటిష్‌వాళ్లతో కలిసిపోయారు. ఆ సమయంలో మహిళా యోధులు గట్టిగా నిలబడ్డారు. ఒత్తిళ్లకు, బెదరింపులకు లొంగిపోకుండా ఖడ్గాన్ని ఝళిపించారు. తుపాకీ ఎక్కుపెట్టారు. తమ చివరి శ్వాస వరకు భరతమాత దాస్య శృంఖలాలను తెగ్గొట్టేందుకు పోరాడుతూనే ఉన్నారు. వారి స్ఫూర్తితో, వారి పేర్లతో ఇప్పుడు ఏర్పాటైన మూడు పి.ఎ.సి.లకు కలిపి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ‘మిషన్ శక్తి’ అని పేరు పెట్టింది. అంటే.. త్రిదళమహాశక్తి అని. ఆ ముగ్గురు మహిళలు అవంతి, ఉదా, ఝల్కరి గురించి క్లుప్తంగానైనా తెలుసుకోవడం.. మనసును శక్తితో, ధైర్యంతో, ధీమాతో నింపుకోవడం అవుతుంది.
అవంతీబాయి లోధీ
లోధీలు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లలోని వ్యవసాయ కుటుంబాల వాళ్లు. వాళ్లింటి అమ్మాయి అవంతి. తర్వాత ఆమె రామ్‌ఘర్ రాణి అయింది. ఇప్పుడా రామ్‌ఘర్ మధ్యప్రదేశ్‌లోని డిండోరి. సంస్థానాధీశులు ఎందరు మెత్తబడినా రాణీ అవంతీబాయి మాత్రం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారిపై ఎత్తిన ఖడ్గాన్ని దించలేదు. వారితో పోరాడుతూనే 1858 మార్చి 20 న అమరనారి అయ్యారు. 1857 మే 10 నుంచి 1858 నవంబరు 1 వరకు ఏడాదిన్నరపాటు సాగిన మొదటి భారత స్వాతంత్య్ర యుద్ధంలో రాణి అవంతి నాలుగువేల మంది సైన్యంతో శత్రువులతో తలపడ్డారు. మంద్లా దగ్గరి ఖేరి గ్రామంలో ఆమె, ఆమె సైన్యం బ్రిటిష్ సేనల్ని పరుగులెత్తించారు. అవమానభారంతో అప్పటికి వెళ్లిపోయిన పరాజిత మూకలు తిరిగి రామ్‌ఘర్ మీద ప్రతీకార దాడులు జరిపాయి. రామ్‌ఘర్‌కు నిప్పుపెట్టాయి. రాణి అవంతిక గెరిల్లా యుద్ధ వ్యూహంతో వారిని ఎదుర్కొన్నారు. బలం క్షీణించిన క్షణంలో శత్రువుకు సజీవంగా చిక్కరాదని తన సైనికుడి దగ్గర ఉన్న ఖడ్గాన్ని లాక్కుని ప్రాణత్యాగం చేసుకున్నారు.
ఉదాదేవి
ఉదాదేవి భారత ప్రథమ స్వాతంత్య్ర సమర దళిత యోధురాలు. ఆమెతో కలిసి బ్రిటిష్ వాళ్లపై నాడు పోరాడిన దళిత మహిళలంతా చరిత్రలో ‘దళిత వీరాంగన’లుగా గుర్తింపు, గౌరవం పొందారు. బ్రిటిష్ వాళ్లపై భారత ప్రజల్లో పెల్లుబుకుతున్న ఆగ్రహావేశాలను గమనించిన ఉదా దేవి ముందుగా తనే బేగమ్ హజ్రత్ మహల్ (అవథ్) ను కలిసి యుద్ధానికి ‘నేను సైతం’ అని నినదించారు. బేగమ్ హజ్రత్ ఉప్పొంగిపోయారు. అప్పటికప్పుడు మహిళలతో ఒక యుద్ధ దళాన్ని ఏర్పాటు చేసి ఉదాదేవికి నాయకత్వ బాధ్యతలు అప్పగించారు. ఆమె చేతికి తుపాకీ అందించారు. బ్రిటిష్ వాళ్లు అవ«ద్‌ను ఆక్రమించినప్పుడు ముందు వరుసలో ఉండి వారిని నిలువరించింది ఉదాదేవి మహిళా దళమే! 1857 నవంబరులో సికందర్‌బాగ్‌లో జరిగిన ముఖాముఖి పోరులో తన దళాలకు సూచనలు ఇచ్చాక, ఉదాదేవి ఒక రావి చెట్టు ఎక్కి అక్కడి నుంచి బ్రటిష్ సైనికులపై కాల్పులు జరుపుతూ వారు ముందుకు రాకుండా చేయగలిగారు. ఆకులు కొమ్మల మాటు నుంచి తూటాలు కురిపిస్తున్న వారెవరో కనిపెట్టలేక బ్రటిష్ అధికారి ఒకరు చెట్టుపైకి కాల్పులు జరపమని తన సైనికులకు ఆదేశాలు ఇవ్వడంతో ఆ మూకుమ్మడి తూటాలకు ఉదాదేవి నేలకు ఒరిగారు. అప్పటికే ఆమె తుపాకీ పన్నెండు మందికిపైగా బ్రిటిష్ సైనికుల్ని హతమార్చింది. ఉత్తరప్రదేశ్‌లో నేటికీ ఏటా నవంబర్ 16 న ఉదాదేవి స్మారక కార్యక్రమాలు గౌరవ శ్రద్ధలతో జరుగుతుంటాయి.
ఝల్కారీబాయి
ఝల్కారీ బాయి.. ఝాన్సీ లక్ష్మీబాయి సైన్యంలో సిపాయి. ప్రథమ భారత సంగ్రామంలో వీరనారిగా చిరస్మరణీయురాలైన దళిత యోధురాలు. యుద్ధ వ్యూహాలు పన్నగల యువతి. ఆ నేర్పు కారణంగానే క్రమేణా ఆమె లక్ష్మీబాయి ఆంతరంగిక సలహాదారులలో ఒకరు అయ్యారు. బ్రిటిష్ సేనలు ఝాన్సీని చుట్టుముట్టినప్పుడు లక్ష్మీబాయిని తప్పించడానికి ఆమెలా వేషం మార్చుకుని శత్రుమూకలపైకి లంఘించారు. ఆ ధైర్యసాహసాలే ఝల్కారీ బాయిని బుందేల్‌ఖండ్ ఆధునిక జానపద కథలో నాయికను చేశాయి. బ్రిటిష్‌వారితో పోరాడుతూనే 1858 ఏప్రిల్ 4న ఆమె అమరనారి అయ్యారు. ఝల్కారీ సాహసకృత్యం ఒకటి ప్రాచుర్యంలో ఉంది. బాల్యంలోనే తల్లి మరణించడంతో తండ్రి పెంపకంలో గుర్రపుస్వారీ, కత్తిసాము నేర్చుకుని ఉన్న ఝల్కారీ ఓ రోజు పశువులను మేపుతున్నప్పుడు ఆమెపై ఒక పులి దాడి చేయబోయింది. అప్పుడు ఝల్కారీ తన చేతిలోని కర్రతోనే లాఘవంగా పులిపై లంఘించి పులిని హతమార్చిందని ఇప్పటికీ ఆమె పుట్టిన భోజ్లా గ్రామంలో (ఝాన్సీ) కథలు కథలుగా చెప్పుకుంటారు. భారత ప్రభుత్వం అవంతీబాయి లోధీ జ్ఞాపకార్థం విడుదల చేసినట్లే ఝల్కారీ స్మారక చిహ్నంగా కూడా ఒక తపాలా బిళ్లను విడుదల చేసింది.
Comments
Please login to add a commentAdd a comment