ప్రముఖ పాత్రికేయులు, మ్యూజికాలజిస్ట్, హాసం సంపాదకులు స్వర్గీయ రాజా రాసిన ఆపాతమధురం-2 పుస్తకాన్ని ఆయన కుమార్తెలు శ్రేష్ఠ, కీర్తన ప్రచురించారు. ఈ పుస్తకావిష్కరణ సభ జనవరి 21, మంగళవారం సికింద్రాబాద్ లోని కిమ్స్ - సన్ షైన్ హాస్పిటల్ లోని భవనం శ్రీనివాసరెడ్డి ఆడిటోరియంలో జరిగింది.
ఆపాతమధురం -2 పుస్తకాన్ని డాక్టర్ గురవారెడ్డి ఆవిష్కరించి తొలి ప్రతిని విశ్లేషకులు జె. మధుసూదన శర్మకు అందచేశారు. అనంతరం డాక్టర్ గురవారెడ్డి అధ్యక్షోపన్యాసం చేస్తూ, రాజా ఆధ్వర్యంలోని వచ్చిన హాసం పత్రిక వెబ్ సైట్‌ను పునరుద్ధరించాల్సిందిగా కోరారు. రాజా... తెలుగువారికి బినాకా గీత్ మాల అమీన్ సయానీ లాంటి వారనీ, ఆపాత మధురం తొలి భాగాన్ని, పామర్రులోని తన స్నేహితురాలు డాక్టర్ భార్గవితో కలిసి ప్రచురించానని తెలిపారు. అలాగే పుస్తకాలను ప్రచురించాలనే కోరిక నాకు బావ డాక్టర్ వరప్రసాద్ రెడ్డి నుండి అబ్బిందని తెలిపారు. రాజామరికొంతకాలం మనతో ఉండి ఉంటే 1971 వరకూ వచ్చిన పాటలను కూడా విశ్లేషించి ఉండేవారని తెలిపారు. కనీసం ఆ పనిని మధుసూదనశర్మ చేస్తే, దానిని పుస్తకంగా తీసుకొచ్చే బాధ్యతనుతాను స్వీకరిస్తానన్నారు.
ఆత్మీయ అతిథి సి. మృణాళిని మాట్లాడుతూ, `రాజా పాటను సంగీతపరంగా, సాహిత్యపరంగా లోతైన విశ్లేషణ చేసేవారు. సంగీత దర్శకుల బాణీని, గీత రచయితల పదాలను జాగ్రత్తగా గమనించి, వాటిని గురించి వివరించేవారు. ఇలాంటి విశ్లేషణల కారణంగా మన పద సంపద పెరుగుతుంది. సాహిత్యాన్ని ఎంతో పరిశోధన చేయబట్టే ఆయన అంతలా దానిని వివరించే వారని అభిప్రయాపడ్డారు. ఓ పాటను అర్థం చేసుకోవడానికి, ఆస్వాదించడానికి శ్రవణ సంస్కారం అవసరం. అది ఆయన విశ్లేషణల ద్వారా మనలో మరింతగా పెరిగే ఆస్కారం ఉంది. ఏ యే లక్షణాలు పాటను గొప్పగా తీర్చిదిద్దుతాయనేది రాజా చెప్పగలిగేవారు. సహజంగా సంగీత దర్శకుడు, గీత రచయిత, గాయకుడు వారి పరిధిలోనే వాటిని గురించి చెప్పగలరు. కానీ రాజా ఆ ముగ్గురిని కలగలిపి లోతుగా విశ్లేషించేవారు. పాట మీద నిరంతరం పరిశోధన చేసిన రాజా లాంటి వారు బహు అరుదని పేర్కొన్నారు. పాటను విశ్లేషించే క్రమంలో ఆయన రసజగత్తులో పడిపోవడమే కాదు మనమూ అందులో పడిపోయేలా చేసేవారు. ఈ పుస్తకంలో ప్రతి పాటతో పాటు క్యూ ఆర్ కోడ్ పెట్టడం అనేది మంచి ప్రయత్నం. పాట గురించి చదవడంతో పాటు దానిని వినే ఆస్కారం కలిగించడం బాగుంది` అని అన్నారు.
ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్.పి. పట్నాయక్ మాట్లాడుతూ : `పాట ఎప్పుడు పుట్టింది? ఎలా పుట్టింది? అనే వివరాలను `పాట అనే కార్యక్రమం ద్వారా అందించాలని అనుకున్నాను. అందుకు నాకు సంపూర్ణ సహకారం అందిస్తానని రాజా మాట ఇచ్చారు. కానీ దానిని నెరవేర్చకుండానే ఆయన మనల్ని విడిచి వెళ్ళిపోయారు`` అంటూ విచారం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఇక్కడ మన మధ్య ఉన్న మధుసూదన శర్మ నెక్ట్స్ జనరేషన్ కు తన దగ్గర ఉన్న సమాచారాన్ని అందించాలని ఆర్.పి. పట్నాయక్ కోరారు.
మ్యూజికాలజిస్ట్ రాజాతో తనకున్న ప్రత్యేక అనుబంధాన్ని, ఈ పుస్తక ప్రచురణ కర్త డాక్టర్ వరప్రసాద్ రెడ్డి ఆహుతులకు తెలిపారు. రాజాకు సంగీతం పట్ల ఉన్న పట్టు తెలిసిన వ్యక్తిగా ఆయన సంపాదకత్వంలో హాసం పత్రికను ప్రారంభించానని, అయితే అనివార్య కారణంగా దానిని ఆపివేయాల్సి వచ్చిందని, చాలా మంది ఇప్పటికీ హాసం పత్రిక ఆగిపోవడానికి కారణాలు అడుగుతుంటారని, రాజీ పడలేని రాజా మనస్తత్త్వం కారణంగానే ఆ పత్రికను తాను ఆపేశానని, రాజా గారు లేని హాసం పత్రికను తీసుకురావడం తనకు ఇష్టం లేకపోయిందని వర ప్రసాదరెడ్డి తెలిపారు. ఇప్పటికీ హాసం ప్రచురణలు పేరుతో పుస్తకాలను ప్రచురిస్తున్నామని అన్నారు. రాజా రాసిన ఆపాతమధురం -2 పుస్తకాన్ని తీసుకురావడం కోసం అమెరికాలో ఉండే ఆయన కుమార్తెలు శ్రేష్ఠ, కీర్తన ఎంతో శ్రమించారని అంటూ వారిద్దరినీ వరప్రసాద్ రెడ్డి అభినందించారు.
రాజాగారి తరహాలోనే ఆయన కుమార్తెలు తన మీద అభిమానంతో ఈ పుస్తకాన్ని తనకు అంకితం ఇవ్వడం పట్ల మధుసూదన శర్మ ధన్యవాదాలు తెలిపారు. ప్రముఖ గీత రచయిత భాస్కరభట్ల రవికుమార్ హాసం రాజాతో తనకున్న అనుబంధాన్ని తెలియచేశారు. ఈ పుస్తకం తీసుకు రావడానికి తమకు సహకరించి వారికి రాజా పెద్ద కుమార్తె శ్రేష్ట ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే మ్యూజికాలజిస్ట్ రాజా వెబ్ సైట్ ను తిరిగి ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment