సినిమా అనగానే గుర్తుకొచ్చేది పాప్‌కార్న్. ఇప్పుడంటే పాప్‌కార్న్ అని నైసుగా పిలుస్తున్నారు కానీ, ఒకప్పుడు పేలాలంటూ తెగ తినేవాళ్లం. నిన్నమొన్న దాకా కరోనా కారణంగా సినిమాకు తెరపడింది. ఈ మధ్య కాలంలో తెరుచుకుంటున్న థియేటర్లలో సినిమా చూసేందుకు సినీ ప్రియులు ఆవురావురుమంటూ మల్టీప్లెక్సులపై దండయాత్రకు సిద్ధమవుతున్నారు. సినిమా చూస్తూ పాప్‌కార్న్ తింటుంటే ఆ మజానే వేరు. అయితే పాప్‌కార్న్ కేవలం మజా కోసమే కాదని, ఆరోగ్యానికి కూడా అవసరమని నిపుణులు చెబుతున్నారు.
పాప్‌కార్న్‌లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలుసుకోవాలంటే.. సినిమాల్లోలాగే కాస్త ఫ్లాష్‌బ్యాక్‌కు వెళ్లాల్సిందే. అమెరికాకు చెందిన నెబ్రాస్కా రాష్ట్రంలో ఓ ప్రధాన నగరం ఒమాహా. ఆ నగరంలోని ఓ ప్రఖ్యాత పరిశోధన కేంద్రమే ‘సెంటర్ ఫర్ న్యూట్రిషన్’. అక్కడ జరిగింది... పాప్‌కార్న్ మీద ఓ పరిశోధన! ఆ పరిశోధనలో వెల్లడైన విషయాలు ఎంత ఆసక్తికరంగా ఉన్నాయో తెలిస్తే. వెంటనే మీరు సినిమాకు వెళ్లాల్సిందే అని పట్టుపడతారు. ఒకవేళ సినిమాకు వెళ్లడం కుదరకపోయినా, కనీసం ఇంట్లోనైనా పాప్‌కార్న్ చేసుకుని తిందాం అనుకుంటారు.
ఎందుకంటారా?
రోజూ పాప్‌కార్న్ తినేవారికి ప్రాసెస్ చేయని ముడిధాన్యాలు తినేవారికి కలిగిన ఆరోగ్య ప్రయోజనాలే సమకూరతాయి. పాప్‌కార్న్ తిననివారితో పోలిస్తే తినేవారిలో ఈ తరహా ప్రయోజనం 250 శాతం ఎక్కువ. ‘పేలాల’ విషయంలో ఇంకా బలంగా ‘పేలిపోయిన’ వార్త ఏమిటంటే... పాప్‌కార్న్‌కు సాధారణంగా పొట్టుతీయని ధాన్యాలు వాడుతుంటారు కాబట్టి... పాప్‌కార్న్ తిననివారి కంటే తినేవాళ్లలో పీచుపదార్థం (ఫైబర్) 22 శాతం అధికంగా లభ్యమవుతుంది. అందుకే పాప్‌కార్న్ తినండి. కానీ పరిమితంగా మాత్రమే.
పరిమితంగా అన్న క్లాజ్ ఎందుకో?
పాప్‌కార్న్ తయారు కావడానికీ, దానికి మరింత రుచి చేకూరడానికీ వెన్నగానీ, నూనెగానీ లేదా కొవ్వులు ఎక్కువగా ఉండే నెయ్యిలాంటి కృత్రిమ నూనెలనూ వాడుతుంటారు. దాన్ని వేయించడం కోసం వాడే ఈ వెన్న/నూనె/కృత్రిమనూనెల వల్ల గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనిలో కొవ్వు పేరుకునే అవకాశాలు ఎక్కువ. మరీ భయపడాల్సిన అవసరం లేదుగానీ... మితంగా తింటే ఏసమస్యా రాదు. ఆరోగ్యాన్ని దష్టిలో పెట్టుకుని పాప్‌కార్న్ తినాలంటే..ఇంట్లోనే తయారుచేసుకోదగ్గ పొడిపేలాలు... ఇంగ్లిష్‌లో చెప్పాలంటే అనారోగ్యకరమైన వాటిని దూరంగా ఉంచడం కోసం ‘ఎయిర్ పాప్‌డ్ కార్న్స్’ చేసుకుని తినాలి.
జలుబుకూ మందు పాప్‌కార్నే...
‘సెంటర్ ఫర్ న్యూట్రిషన్’ కథ అలా ఉంటే, మరో నగరమైన ‘పెన్సిల్వేనియాలోని’ యూనివర్సిటీ ఆఫ్ స్క్రాంటన్’లోని పరిశోధన ఫలితాల కథ మరోలా ఉంది. ఇక్కడ జరిగిన అధ్యయనాల్లో పాప్‌కార్న్‌లోని పాలీఫినాల్ అనే యాంటీ ఆక్సిడెంట్ వల్ల జలుబు చాలా తేలిగ్గా తగ్గుతుందని తేలింది. కొన్నిరకాల పండ్లలో కంటే కూడా పాప్‌కార్న్‌లో ఉండే పాలీఫిలాన్స్‌లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అన్నట్టు ఇక్కడి వారూ ఓ హెచ్చరిక కూడా చేశారు. అదేమిటంటే... పాప్‌కార్న్ తయారీ లో ఉప్పు వేసుకోకూడదట. ఉప్పు వేస్తే జలుబును తగ్గించే విషయంలో ప్రయోజనం ఉండదని పెన్సిల్వేనియా పరిశోధకులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment