కంటి చూపుకు రెటీనా తెర ఆరోగ్యంగా ఉండటం ఎంత అవసరమో తెలిసిందే. వయసు పెరగడంతో వచ్చే కొన్ని కంటి సమస్యలతో రెటీనా దెబ్బతిని చాలామంది కనుచూపు కోల్పోవడం పరిపాటి. అయితే చాలా తొందర్లోనే మానవులకు ‘ల్యాబ్’లో నిర్మించిన రెటీనా సాకారం కానుందా?
దాన్ని మనుషుల్లో ప్రయోగించి చూశాక... అది విజయవంతమైతే... త్వరలోనే చూపు లేని ఎంతో మందికి చూడటం సాధ్యపడనుందా? అవుననే అంటున్నారు యూఎస్‌ఏలోని యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్‌సిస్–మేడిసన్‌కు చెందిన పరిశోధకులు. ఆ వివరాలేమిటో చూద్దాం.
కాంతి వల్ల కంటి వెనక ఉండే పలుచని పొర అయిన ‘రెటీనా’ వల్లనే దృష్టిజ్ఞానం కలుగుతుందన్న విషయం తెలిసిందే. ప్రమాదాల్లో రెటీనా ఊడిపోవడం, వయసు పెరుగుతున్న కొద్దీ కంటి జబ్బుల కారణంగా రెటీనా బలహీనపడి చూపు మందగించడం... ఇలాంటి కారణాలతో చాలా మంది అంధత్వానికి లోనవుతున్నారు. వీళ్లందరికీ దృష్టిజ్ఞానం ఇవ్వడం కోసం చాలా పరిశోధనలే చోటు చేసుకుంటున్నాయి.
అందునా పరిశోధనశాల (ల్యాబ్)లో రెటీనాను రూపొందించడానికీ అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా కొందరు శాస్త్రవేత్తలు ‘ఆర్గనాయిడ్స్’ అనే తరహా కణాలను 2014లోనే రూపొందించారు. ఇవి అచ్చం రెటీనా పనే చేస్తాయి.
అంటే తమపై ‘3–డి’ ఇమేజ్‌ను ప్రతిబింబించేలా చేయగల కణాల సమూహాలివి. మనిషి చర్మం నుంచి ‘మూలకణాల్లాంటి (స్టెమ్‌సెల్స్‌లాంటి) వాటిని సేకరించడంతో ఈ ప్రయత్నం సాకారమైంది. అటు తర్వాత మరో అడుగు ముందుకేసి రకరకాల రెటీనాలను రూపొందించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
మృతకణాల స్థానంలో
పై పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తల బృందాలే.. ల్యాబ్‌లో రూపొందించిన రెటీనా కణాలు వివిధ వేవ్‌లెంత్ గల కాంతి కిరణాలకు స్పందిస్తున్నాయనీ, అవి పొరుగున ఉన్న ఇతర కణాలతోనూ అనుసంధానమవుతున్నాయంటూ గతేడాది (2022)లో నిరూపించగలిగారు.
‘‘మేము ఆర్గనాయిడ్స్ నుంచి కొన్ని కణాలను సేకరించి, వాటిని రకరకాల జబ్బుల కారణంగా దెబ్బతిన్న రెటీనాలోని మృతకణాల స్థానంలో అమర్చాడానికి ప్రయత్నిస్తున్నాం. ప్రస్తుతం ఇదే మాముందున్న సవాలు’’ అంటున్నారు ఈ పరిశోధనకు నేతృత్వం వహిస్తున్న ఆఫ్తాల్మాలజిస్టు డాక్టర్ డేవిడ్ గామ్.
తమ ముందున్న ప్రతిబింబాన్ని తీసుకున్న ఆ కణాలు యాగ్జాన్స్ అనే పురికొసలాంటి కణాల ద్వారా... వెనక ఉన్న ‘సైనాప్స్’ అనే ఓ సిగ్నల్ బాక్స్ లాంటి దాన్నుంచి వెలువడాలి. ఆ సమాచారాన్ని ఎట్టకేలకు మెదడుకు చేరవేయాలి.
కణాల్లోంచి వేరు చేసి అమర్చాక కూడా అవి రెటీనా నుంచి బయల్దేరి యాగ్జాన్స్ ద్వారా మెదడు కేంద్రం వరకు చక్కగా అనుసంధానితమవుతూనే (రి–కనెక్ట్ అవుతూనే) ఉండాలి. ఈ మధ్యలో ఎక్కడా సిగ్నల్స్‌ను కోల్పోకూడదు. అప్పుడే ‘చూడటం’ అనే ప్రక్రియ (విజన్ ప్రాసెస్) పూర్తవుతుంది.
‘రేబీస్ వైరస్’ను అంటించి
శాస్త్రవేత్తలు ఇక్కడో విచిత్రాన్ని చేసి చూశారు. ఎక్కడా సిగ్నల్స్ కోల్పోని విధంగా అంతటా అనుసంధానం చక్కగా జరుగుతోందా, లేదా అనే విషయాన్ని పరిశీలించడం కోసం ఈ రెటీనా కణాలకు కావాలనే ‘రేబీస్ వైరస్’ను అంటించారు. ఇది న్యూరోవైరస్ కావడం వల్ల దీన్ని ఎంచుకుని, వారం రోజుల వ్యవధిలో ఈ వైరస్ చివరి కణం వరకూ చేరిందంటే అన్ని కణాలూ చక్కగా అంటుకుని, అనుసంధానితమై ఉన్నాయని అర్థం.
‘‘ల్యాబ్‌లో కొనసాగిన ఈ ఫలితాలన్నీ పరిశోధనశాల వరకైతే చక్కగానే ఉన్నాయి. ఇక చివరి టాస్క్ ఏదైనా ఉందంటే... అది మానవులపై పరిశోధనలు (హ్యూమన్ ట్రయల్స్) సాగించడమే. ఈ కణాల అమరిక బాగా జరిగి అవి రెటినాలోని కణాలుగా మనగలుగుతూ, రెటినల్ గ్యాంగ్లియాన్ సైనాప్సెస్ అమరికతో మనకు దృష్టిజ్ఞానాన్నిచ్చే ‘ఆప్టిక్ నర్వ్’తో చక్కగా అనుసంధానమైతే చాలు!
అదే జరిగితే రెటినైటిస్ పిగ్మెంటోజా, ఏజ్ రిలేటెడ్ మాక్యులార్ డీజనరేషన్, గ్లకోమా వంటి అనేక జబ్బుల కారణంగా చూపుకోల్పోయిన / చూపు మందగించిన వారికి చూపును ఇవ్వగలిగే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి’’ అంటూ ఎంతోమందిలో ఓ ఆశాభావాన్ని రేకెత్తేంచే చల్లటి కబురు చెబుతున్నారు ఆఫ్తాల్మాలజిస్ట్ డాక్టర్ డేవిడ్ గామ్. ఈ అధ్యయన ఫలితాలన్నీ ‘పీఎన్‌ఏఎస్’ అనే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.
చదవండి: నిద్ర లేకపోతే ఎంత డేంజరంటే..? షాకింగ్ విషయాలు
Health Tips: రోజుకు కప్పు బూడిద గుమ్మడి రసం తాగడం, గుప్పెడు శనగలు నానబెట్టి తింటే
Comments
Please login to add a commentAdd a comment