ఆగ్రాకు చెందిన 25 ఏళ్ల టీచర్ హిమానీ బుందేలాకు ‘కెబిసి 13’ సీజన్‌లో కోటి రూపాయలు వచ్చాయి. ఈ సీజన్‌కు తొలి విజేత ఆమే. చూపు లేకపోయినా ఆమె కోటి గెలిచింది. అది కాదు సంగతి. 15 ఏళ్ల వయసులో పూర్తిగా చూపు కోల్పోయినా జీవితాన్ని ఉత్సాహభరితం చేసుకోవడంలో హిమానీ ‘దృష్టికోణం’ ఎంతో ముఖ్యమైనది. ‘నాకు దృష్టి లేదు నిజమే. దృష్టి కోణం ఉంది’ అని అంటున్న హిమాని మనకు ప్రసాదిస్తున్న దృష్టికోణం ఏమిటి?
ఆగస్టు 30, 31 తేదీల్లో ప్రసారమైన ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ సీజన్ 13 ఎపిసోడ్స్ మీరు చూశారా? ఆ ఎపిసోడ్స్‌లో విశేషం ఏమిటంటే హిమానీ బుందేలా కోటి రూపాయల ప్రైజ్ గెలిచింది. ఆ తర్వాత 7 కోట్ల ప్రశ్న వరకూ వెళ్లింది. అయితే ఆ ప్రశ్నకు సమాధానం డౌట్‌గా ఉండేసరికి గేమ్‌ను క్విట్ చేసి కోటి రూపాయలతో ఇల్లు చేరింది. క్లుప్తంగా ఆ రెండు ఎపిసోడ్‌ల సారాంశం ఇది. కాని ఇది చెప్పడానికి ఈ కథనం రాయడం లేదు. హిమానీ బుందేలాను పరిచయం చేయడానికి రాస్తున్నాము.
‘కౌన్ బనేగా కరోడ్‌పతి సీజన్ 13’లో కోటి రూపాయలను గెలిచిన తొలి విజేత, ఇప్పటి వరకూ అన్ని సీజన్లలో కోటి రూపాయలు గెలిచిన తొలి అంధ విజేత కూడా హిమానీ బుందేలానే. కాని ఈ విజయం ఆమెకు అదాటున రాలేదు. ఇప్పుడు ఆమె జీవిస్తున్న జీవితం కూడా అదాటున రాలేదు. చాలామంది ఆమె నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. ఆమె నవ్వు నుంచి రాలిపడే నక్షత్రాల్లాంటివి మన నవ్వులో ఎందుకు లేవు అని తరచి చూసుకోవాల్సి ఉంది.
అమితాబ్‌తో హిమాని, గాయకుడు జుబిన్‌తో హిమానీ
ఐదుగురిలో ఒక్క అమ్మాయి
హిమానీ బుందేలాది ఆగ్రా. ఐదుగురు సంతానంలో ఆమె పెద్దది. తండ్రి విజయ్‌సింహ్ ప్రయివేటు ఉద్యోగి. తల్లి సరోజ్ గృహిణి. పిల్లలను చదివించుకోవడమే ఆ తల్లిదండ్రులకు పెద్ద విషయం. ఈ సంగతి గ్రహించిన హిమానీ తొమ్మిది, పది తరగతులు చదివేప్పటి నుంచే ఇంట్లో ట్యూషన్లు మొదలెట్టింది. ఆమె పాఠాలు చెప్పే తీరు హుషారుగా ఉండేది. అందుకని పిల్లలు ఆమె దగ్గర ట్యూషన్ కోసం పరిగెత్తే వారు. అయితే హిమానీకి ముందు నుంచి కంటి సమస్య ఉంది. రెటినా బలహీనంగా ఉందని డాక్టర్లు చెప్పారు. అందుకని ఆమెను ఆడొద్దని, పరిగెత్త వద్దని, గట్టి దెబ్బ తగిలి ఒళ్లు అదిరేలా చూసుకోవద్దని చెప్పేవారు.
దాంతో హిమానీ భయం భయంగా ఉండేది. కాని భయపడుతున్నట్టే జరిగింది. టెన్త్ క్లాస్‌లో ఉండగా ఆమె సైకిల్ మీద వెళుతూ ప్రమాదానికి లోనయ్యి రోడ్డు మీద పడిపోయింది. ఆ తర్వాత వారం రోజుల్లోనే ఆమెకు కంటి చూపు తగ్గ సాగింది. డాక్టర్లు పరీక్షించి రెటీనా పూర్తిగా కదిలిపోయిందని చెప్పారు. సర్జరీలు చేయాలన్నారు. ఇది 2012లో. మూడు సర్జరీలు అయ్యాయి. చూపు కొద్దిగా వచ్చింది. ఇంకా బాగా వస్తుందేమోనని నాలుగో సర్జరీ చేశారు. కాని ఫెయిల్ అయ్యింది. చూపు పూర్తిగా పోయింది. 15 ఏళ్ల ఉత్సాహపూరితమైన అమ్మాయి హిమానీ. ఇప్పుడు పూర్తిగా అంధురాలిగా మారింది.
ఏం చేయాలి?
ఆరు నెలలు హిమానీ నవ్వు మర్చిపోయింది. ఇంట్లో తల్లిదండ్రులు తీవ్రమైన బెంగలో పడిపోయారు. ఇక హిమానీ జీవితంలో ఏదీ చేయలేదని నిరాశలో కూరుకుపోయారు. కాని హిమానీ మెల్లమెల్లగా తన శక్తుల్ని కూడగట్టుకుంది. ట్యూషన్లు తిరిగి మొదలెట్టింది. ఒకప్పుడు ఈ ‘అక్క’ చూసి పాఠాలు చెప్పేది. ఇప్పుడు ఎలా చెబుతుంది? అయినా సరే పిల్లలు ఆమె దగ్గరకు వచ్చేవారు. పిల్లల చేతే పాఠాలు చదివించి వారికి ఆ పాఠాలు విడమర్చేది. ఎక్కడా ఏ కన్ఫ్యూజనూ ఉండేది కాదు. ఆమె మేథమెటిక్స్‌లో దిట్ట. ఆ లెక్కలు కూడా నోటి మాటగా వివరించేది. కనపడకపోయినా నోట్స్ మీద రాసి చూపించేది. ట్యూషన్లు తిరిగి మొదలయ్యాయి.
చదువు కూడా కొనసాగించాలనుకుంటే అంధ విద్యార్థి కనుక ఇంటర్ సీటు ఇవ్వడానికి ఏ కాలేజీ ముందుకు రాలేదు. లక్నోలోని ‘డాక్టర్ శకుంతల మిశ్రా రిహాబిలిటేషన్ యూనివర్సిటీ’లో దివ్యాంగ విద్యార్థులను మామూలు విద్యార్థులతో కలిపి చదివిస్తారని తెలిసి అక్కడకు వెళ్లి అడ్మిషన్ తీసుకుంది. ‘అంత వరకూ జీవితంలో చూపు కోల్పోతాననే భయం ఉండేది. చూపు కోల్పోయాక ఇక భయం దేనికి. జీవితాన్ని హాయిగా జీవించాలి అనుకున్నాను. లోపాన్ని, వెలితిని పక్కకు పెట్టి సంతోషంగా జీవించాలనే దృష్టికోణం నాకు అలవడింది’ అంటుంది హిమానీ. డిప్లమా ఇన్ ఎడ్యుకేషన్ చేసి కేంద్రీయ విద్యాలయలో ప్రభుత్వ ఉద్యోగం తెచ్చుకుంది. ‘మా ఇంట్లో నాదే తొలి ప్రభుత్వ ఉద్యోగం’ అంటుందామె.
కౌన్ బనేగా కరోడ్‌పతిలో...
హిమానీకి ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’లో పాల్గొనాలని చిన్నప్పటి నుంచి కోరిక. అందుకోసం రిజిస్ట్రేషన్ చేసుకునేది. ప్రిపేర్ అయ్యేది. కాని ఈ సీజన్‌లో మాత్రం ఆమెకు చాన్స్ వచ్చింది. కోవిడ్ నిబంధనలు పాటిస్తున్న అమితాబ్ ఎవరి దగ్గరకూ రాకపోయినా ఆమెను చేయి పట్టుకుని నడిపించి హాట్‌సీట్‌లో కూచోబెట్టాడు. మంచినీళ్లు ఆఫర్ చేశాడు. అంతే కాదు కోటి రూపాయలు వస్తే ఎంతో సంతోషించాడు. ఆ ఎపిసోడ్‌లోనే హిమానీ తనకు గాయకుడు జుబిన్ నోటియాల్ ఇష్టమని చెప్తే జుబిన్ ముంబై నుంచి ప్రత్యేకంగా ఆగ్రా వచ్చి ఆమెను ఇంట్లో కలిసి గొప్ప సర్‌ప్రైజ్ ఇచ్చాడు.
ఇవాళ ఆమె స్ఫూర్తి
హిమానీ ఇప్పుడు ఎందరికో స్ఫూర్తిగా మారింది. కంటి ఎదుట పూర్తిగా చీకటే ఉన్నా ఆమె ఆత్మవిశ్వాసంతో నవ్వుతో అనుకున్నది సాధించడం అందరూ మెచ్చుకుంటున్నారు. ‘నా బహుమతి మొత్తం దివ్యాంగులకు ప్రభుత్వ ఉద్యోగాల కోసం కోచింగ్ ఇచ్చే సెంటర్ ఏర్పాటుకు వెచ్చిస్తాను’ అని హిమానీ చెప్పింది.
జీవితంలో కోటి రూపాయలు సంపాదించే అవకాశం చాలామందికి రావచ్చు. కాని జీవితం అంధకారమై భవిష్యత్తు ఒక ప్రశ్నగా మారినప్పుడు దానికి సమాధానం చెప్పగలగడం అనేక కోటిరూపాయలను తలదన్నడంతో సమానం అవుతుంది.
హిమానీ నిజంగా ఈ కాలపు ఒక గొప్ప సమాధానం.
Comments
Please login to add a commentAdd a comment