చలికి మరింత ముడుచుకుపోయే కాలం ఇది. ఈ సమయంలోనే ఆశలపల్లకి నీ.. ఆనందాల సంబరాన్నీ మోసుకువస్తుంది క్రిస్మస్. చల్లగా కొంచెం డల్‌గా ఉండే ఈ కాలంలో మంచి సువాసనలతో, కాంతిమంతమైన రంగులతో అలంకరించుకోవడం ఈ శుభదినాలలో చూస్తుంటాం. దాంట్లో భాగంగానే ఎన్నో అందమైన అలంకరణలు చోటుచేసుకుంటాయి ఇళ్లల్లో.. వాటిలో ప్రత్యేకంగా చెప్పుకునేవి ఎండు ఫలాలు. మసాలా దినుసులు, సువాసనలు వెదజల్లే ఆకులు. వీటిని కూడా కలుపుతూ హారంలా కట్టి, తోరణంలా అలంకరించి, వేలాడదీసి.. గొప్పగా అలంకరించుకుంటారు. ఎండిన నారింజ తొనలు, లవంగ మొగ్గలు, ఇలాయిచీలు, బిర్యానీ ఆకులు.. ఇలాంటివన్నీ ఈ అలంకరణలో చోటుచేసుకుంటాయి.
నారింజ తొనలు
► డైనింగ్ టేబుల్ ప్రత్యేక అలంకరణ కోసం కొన్ని పచ్చని ఆకులు, వాటి మధ్యన ఒకట్రెండు ఎండిన నారింజ తొనలను ఉంచవచ్చు. ఎండిన నారింజ తొనలు పచ్చని హరితాల మధ్య మరింత అందంగా కనిపిస్తాయి.
► ఆకులు పువ్వులతో చేసిన అందమైన పుష్పగుచ్ఛంపై కొన్ని నారింజ తొనలను డెకోరేట్ చేసి గోడలను అలంకరించుకోవచ్చు. హారంలా గుచ్చి, తోరణంలా గది గోడకు లేదా ఒక కార్నర్ ప్లేస్‌లో వేళ్లాడదీయవచ్చు.
దాల్చిన చెక్క.. లవంగ మొగ్గ
► ఎండిన కొమ్మను ఆకులు లేకుండా పూర్తిగా తీసేసి, ఆ కొమ్మకు నారింజ తొనలు, బిర్యానీ ఆకులు, కొన్ని దాల్చిన చెక్కలు, మరికొన్ని లవంగ మొగ్గలు.. హారంలా గుచ్చి డైనింగ్ రూమ్‌లో ఒక గోడకు వేలాడదీయవచ్చు. దీని వల్ల ఆ గదికి ప్రత్యేకమైన అందంతో పాటు మంచి సువాసన వస్తుంది. ఈ దండలను క్రిస్మస్ చెట్టుకు కూడా అలంకరిస్తుంటారు.
అందమైన బహుమతి
► ఎండిన నారింజ తొనలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకులు, చెక్కపూసలు, దారపు పోగులతో అల్లిన టాసెల్స్, రిబ్బన్లతో అందమైన అలంకరణ వస్తువును తయారుచేయవచ్చు. దీనిని ఇంట్లో అలంకరించుకోవచ్చు. ఆత్మీయులకు క్రిస్మస్ కానుకగానూ ఇవ్వచ్చు.
► అలంకరణలో వాడుకున్న ఈ దినుసులను ఆహారపదార్థాల్లోనూ ఉపయోగించుకోవచ్చు. అంటే, వీటి వల్ల ఇంటికి పండగ కళ రావడంతో పాటు ఆరోగ్యం కూడా చేకూరుతుందన్నమాట. ఈ అలంకరణ తయారీలో పిల్లలను పాలుపంచుకునేలా చేస్తే వారికి ఇదో అద్భుతమైన శిక్షణ అవుతుంది. కాలానుగుణంగా తీసుకునే దినుసులు, పదార్థాల పట్ల అవగాహన పెరుగుతుంది. ఆనందమూ కలుగుతుంది. ఇంటిల్లిపాదికి ఆరోగ్యమూ చేకూరుతుంది.
Comments
Please login to add a commentAdd a comment