మిత్రులు సాధించిన విజయమిది.. స్టార్టప్‌ కంపెనీ సూపర్‌ సక్సెస్‌ | Home Essentials Startup Ecosoul Company Sucess Story | Sakshi
Sakshi News home page

Ecosoul Company Sucess Story: అంత ఈజీ కాదు,ఎవరూ ఇన్వెస్ట్‌ చేయడానికి ముందుకు రాలేదు

Published Sat, Aug 12 2023 10:32 AM | Last Updated on Sat, Aug 12 2023 10:59 AM

Home Essentials Startup Ecosoul Company Sucess Story - Sakshi

వ్యాపారం చేయాలంటే అదే పనిగా  కంప్యూటర్‌ ముందు కూర్చుంటే సరిపోదు. నాలుగు గోడలు దాటి బయటి ప్రపంచంలోకి రావాలి. జనవాణి వినాలి. సృజనాత్మక వ్యూహాలు రూపొందించుకోవాలి. ఈ మిత్రులు అదే చేశారు. ‘ఎకోసోల్‌ హోమ్‌’తో ఘన విజయం సాధించారు...

సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనే కలతో మూడు సంవత్సరాల క్రితం రాహుల్‌ సింగ్, ప్రియాంకలు బోస్టన్‌ నుంచి నోయిడాకు వచ్చారు. ‘ఇదేమిటీ వింత’ అన్నట్లుగా చూశారు చుట్టాలు పక్కాలు. ‘ఇటు నుంచి అటు వెళతారుగానీ, అటు నుంచి ఇటు రావడం ఏమిటి?’ అనేది వారి ఆశ్చర్యంలోని సారాంశం. ‘రిస్క్‌ చేస్తున్నారు. అమెరికాలో సంపాదించిన డబ్బులను వృథా చేయడం తప్ప సాధించేది ఏమీ ఉండదు’ అన్నారు కొందరు. అయితే ఆ ప్రతికూల మాటలేవీ ఈ దంపతులపై ప్రభావం చూపలేకపోయాయి.

ఇండియాకు రావడానికి ముందు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి వారికి బోలెడు సమయం దొరికింది. ‘మనం తీసుకున్న నిర్ణయం సరిౖయెనదేనా?’ నుంచి ‘ఎలాంటి వ్యాపారం చేయాలి...’ వరకు ఎన్నో విషయాలు మాట్లాడుకున్నారు.వ్యాపారమైనా సరే... అది కొత్తగా, సృజనాత్మకంగా, సమాజానికి ఎంతో కొంత ఉపయోగపడేలా ఉండాలనుకున్నారు. అలా వారి ఆలోచనలో నుంచి పుట్టిందే... ఎకోసోల్‌ హోమ్‌. అరవింద్‌ గణేషన్‌తో కలిసి రాహుల్‌ సింగ్‌ మొదలు పెట్టిన ఈ ఎకో–ఫ్రెండ్లీ హోమ్‌ ఎసెన్షియల్స్‌ కంపెనీ సూపర్‌ సక్సెస్‌ అయింది.

రాహుల్, అరవింద్‌లు అమెరికాలోని  ఇ–కామర్స్‌ కంపెనీ ‘వేఫేర్‌’లో పని చేశారు. ‘వేఫేర్‌లో పనిచేసిన అనుభవం మాకు ఎంతగానో ఉపయోగపడింది. వినియోగదారుల ఆలోచన ధోరణి ఎలా ఉంటుంది? ఏది చేయాలి? ఏది చేయకూడదు? అనే విషయంలో స్పష్టత రావడానికి ఆ అనుభవం ఉపయోగపడింది. పర్యావరణ హితానికి సంబంధించిన వస్తువులకు డిమాండ్‌ పెరుగుతున్నట్లు విషయాన్ని గ్రహించాం. ఆ సమయంలోనే ఎకోసోల్‌ కంపెనీ ఆలోచన వచ్చింది’ అంటున్నాడు ఎకోసోల్‌ హోమ్‌ కో–ఫౌండర్‌ అరవింద్‌ గణేశన్‌. ‘అవగాహన కలిగించేలా, అందుబాటులో ఉండేలా, అందంగా ఉండేలా మా ఉత్పత్తులు ఉండాలనే లక్ష్యంతో బయలుదేరాం.

ప్లాస్టిక్‌ వల్ల జరిగే హాని గురించి చాలామందికి అవగాహన ఉంది. అయితే దీనికి ప్రత్యామ్నాయం కావాలనుకున్నప్పుడు ధరలు ఆకాశంలో ఉండకూడదు. అందుకే మా వస్తువులకు అందుబాటులో ఉండే ధరలు నిర్ణయించాం’ అంటాడు రాహుల్‌ సింగ్‌. ఒకవైపు కోవిడ్‌ కల్లోలం భయపెడుతున్నా మరో వైపు ఇండియా, చైనా, థాయిలాండ్, మెక్సికోలలో తమ ఉత్పత్తులకు సంబంధించి సప్లై చైన్‌ను నిర్మించుకోవడానికి రంగంలోకి దిగారు. అయితే అది అంత తేలికైన విషయం కాదని అర్థమైంది. రా మెటీరియల్‌ నుంచి ట్రాన్స్‌పోర్టేషన్‌ వరకు అడుగడుగునా సవాళ్లు ఎదురయ్యాయి.

ఒక్కొక్క సవాలును అధిగమిస్తూ 
2021లో తాటి ఆకులతో తయారుచేసిన ప్లేట్లతో సహా 20 ఉత్పత్తులను విక్రయించడం మొదలు పెట్టారు. మనం రోజూ వినియోగించే ప్లాస్టిక్‌ ఫోర్క్‌లు, కప్‌లు, స్ట్రాలు, ప్లేట్స్‌... మొదలైన వాటికి పర్యావరణహిత ప్రత్యామ్నాయాలు ఇందులో ఉన్నాయి. కంపెనీ నిర్మాణ సమయంలో వివిధ జిల్లాలకు చెందిన రైతులతో కలిసి పనిచేశారు రాహుల్, అరవింద్‌లు. వారు ఎన్నో అద్భుతమైన సలహాలు ఇచ్చారు. ‘తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటే అడుగు తీసి అడుగు వేస్తే ఎన్నో కొత్త విషయాలు తెలుసుకోవచ్చు’ అంటారు రాహుల్, అరవింద్‌.

కిచెన్,డైనింగ్, టేబుల్‌టాప్, బాత్, పర్సనల్‌ కేర్‌....మొదలైన విభాగాల్లో 42 రకాలైన ఉత్పత్తులను అందిస్తోంది ఎకోసోల్‌ హోమ్‌. ప్రపంచవ్యాప్తంగా పలుదేశాల్లో అయిదు వేల స్టోర్‌లు ఉన్నాయి. రాబోయే రోజుల్లో పదివేల స్టోర్స్‌ లక్ష్యంగా నిర్ణయించుకున్నారు.‘మా ప్రయాణం నల్లేరు మీద నడక కాదు. కంపెనీ ప్రారంభంలో వెంచర్‌ క్యాపిటల్స్‌ను సంప్రదించినప్పుడు ఎవరూ ఇన్వెస్ట్‌ చేయడానికి ఆసక్తి చూపలేదు. ఒక రిటైలర్‌ మాత్రం లక్ష రూపాయల చెక్‌ ఇచ్చాడు. అది మాకు ఎంతో విశ్వాస్వాన్ని ఇచ్చింది’ అంటూ గతాన్ని గుర్తు చేసుకున్నారు రాహుల్, అరవింద్‌లు.     

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement