![Humanoid Robots Special Story In Sakshi Funday](/styles/webp/s3/article_images/2020/09/13/robo-3.jpg.webp?itok=AhNwfMe0)
రోబో ఆక్ట్రాయిడ్, ఎరికా
మనుషులు బొత్తిగా రోబోల్లా తయారైపోతున్నారనే నిష్ఠూరం పాతదే! ఇప్పుడు రోబోలు అచ్చం మనుషుల్లా తయారైపోతున్నాయి. మనుషులు చేసే పనులను ఇవి చకచకా చేసేయగలవు. అంతేకాదు, మనుషులతో మనుషుల్లా మాట్లాడగలవు. మనుషుల హావభావాలను అర్థం చేసుకుని, వాటికి అనుగుణంగా తగిన హావభావాలను ప్రదర్శించగలవు.
మనుషులను పోలిన రోబోలను ‘హ్యూమనాయిడ్ రోబో’లంటున్నారు. తొలినాటి హ్యూమనాయిడ్ రోబోలకు స్థూలంగా మనుషుల మాదిరిగా ఒక తల, రెండు చేతులు, రెండు కాళ్లు, శరీరం ఉండేవి. చూడగానే అవి రోబోలని చిన్నపిల్లలు కూడా చటుక్కున గుర్తించగలిగేలా ఉండేవి. రోబోల తయారీ మరింత ఆధునికతను సంతరించుకుంది. ఇటీవలి కాలంలో తయారవుతున్న హ్యూమనాయిడ్ రోబోలు ముమ్మూర్తులా మనుషుల్లాగానే కనిపిస్తున్నాయి. మనిషిని, రోబోను పక్కపక్కనే ఉంచి ఫొటో తీస్తే ఎవరు మనిషో, ఎవరు రోబోనో గుర్తించడం అంత తేలిక కాదు. మనుషులను పోలిన హ్యూమనాయిడ్ రోబోల కథా కమామిషూ సంక్షిప్తంగా...
జపాన్‌లోని ఒసాకా యూనివర్సిటీకి చెందిన రోబోటిక్స్ లాబొరేటరీ డైరెక్టర్ ప్రొఫసర్ హిరోషి ఇషిగురో అచ్చంగా తన నకలులాగే కనిపించే రోబోను 2010లో రూపొందించారు. ఫొటోలో చూస్తే ప్రొఫెసర్ హిరోషికి కవల సోదరునిలా కనిపించే ఈ రోబో అంతర్జాతీయంగా వార్తలకెక్కింది. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్స్ (ఐఈఈఈ) విడుదల చేసిన టాప్–10 క్రీపీయెస్ట్ రోబోల జాబితాలో ఇది తొమ్మిదో స్థానంలో నిలిచింది. అయితే, ఇదంత భయంగొలిపేది కాదని, సహజంగా అనిపించే చర్మం, చిన్న పిల్లాడి సైజులో ఉండటంతో పిల్లలతో ఆడుకున్నట్లే దీంతోనూ కబుర్లు చెప్పుకుంటూ ఆడుకోవచ్చని ప్రొఫెసర్ హిరోషి చెబుతుండటం విశేషం.
మనిషిలాంటి తొలి రోబో ‘ఆక్ట్రాయిడ్’
అచ్చంగా మనుషులనే పోలిన రోబోల తయారీ ప్రారంభమై నిండా రెండు దశాబ్దాలైనా పూర్తి కాలేదు. అయితే, వీటి తయారీలో గడచిన ఒకటిన్నర దశాబ్దాల్లోనే గణనీయమైన పురోగతి కనిపిస్తోంది. ఈ పురోగతి శరవేగంగా సాగుతోంది. రానున్న రోజుల్లో అన్ని రకాలుగా మనుషులకు దీటైన రోబోలను తయారు చేయడం సాధ్యమేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చూడటానికి అచ్చంగా మనిషిలాగానే కనిపించే తొలి రోబోను జపాన్‌లోని ఒసాకా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు 2003లో తయారు చేశారు. ‘ఆక్ట్రాయిడ్’ పేరుతో తయారు చేసిన ఈ రోబో అచ్చంగా జపనీస్ అమ్మాయిలా కనిపిస్తుంది. మనిషి శరీరంపై చర్మాన్ని పోలిన సిలికాన్ చర్మాన్ని అమర్చడంతో ఫొటోలో చూస్తే, ఇది మనిషిలాగానే కనిపిస్తుంది. ఇందులో ఏర్పాటు చేసిన సెన్సర్ల వల్ల మనిషి ఊపిరి తీసుకుంటున్నప్పుడు ఛాతీ కదలికలు ఎలా ఉంటాయో, దీనిలోనూ అలాంటి కదలికలే ఉంటాయి.
భుజం తట్టడం, తలపై నిమరడం, షేక్‌హ్యాండ్ ఇవ్వడం వంటి మనుషుల స్పర్శకు అనుగుణంగా ఇది స్పందిస్తుంది. పలకరింపుగా చిరునవ్వులు చిందిస్తుంది. మనుషులు రోజువారీగా మాట్లాడుకునే మాటల్లో 42 మాటలు మాట్లాడుతుంది. శరీరం దిగువభాగం కదలికలు మాత్రం చాలా పరిమితం. దీనిలోని కృత్రిమ మేధ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) మనుషులు మాట్లాడే మాటల్లో కొన్ని పదాలను, వాక్యాలను గుర్తించగలుగుతుంది. మాట్లాడటంలోను, కదలికల విషయంలోను తేడాల ద్వారా మాత్రమే ఎవరైనా దీనిని రోబోగా పోల్చుకోగలుగుతారు. నిశ్శబ్దంగా నిల్చున్నట్లుగా ఉంటే మాత్రం రోబోనో, మనిషో గుర్తించడం కష్టమే! ‘ఆక్ట్రాయిడ్’కు ముందు తయారైన హ్యూమనాయిడ్ రోబోలు అన్నీ ఆకృతిలో మనిషిని పోలి ఉన్నా, వాటికి చర్మం వంటి ఆచ్ఛాదన ఉండేది కాదు. లోహపు తల, చేతులు, కాళ్లు, శరీరంతో చూడగానే ఇవి రోబోలేననిపించేవి.
మనుషుల్లాంటి మరికొన్ని రోబోలు
మనుషుల్లా కనిపించే రోబోల్లో కొన్ని ఇప్పటికే ప్రపంచ ప్రఖ్యాతి పొందాయి. వాటిలో కొన్నింటి గురించి చెప్పుకుందాం. హాంకాంగ్‌కు చెందిన ‘హాన్సన్ రోబోటిక్స్’ సంస్థ 2015లో ‘సోఫియా’ అనే రోబోను రూపొందించింది. బ్రిటిష్ నటి ఆడ్రీ హెప్‌బర్న్ పోలికలతో రూపొందించిన ఈ రోబో ఇదివరకటి వాటి కంటే మరింత అధునాతనమైనది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో, అధునాతనమైన సెన్సర్లతో పనిచేసే ‘సోఫియా’ దాదాపు మనిషిలాగానే కనిపిస్తుంది. పరిచితమైన గొంతులను, ముఖాలను గుర్తిస్తుంది. ఎదుట ఉన్న మనుషులతో సూటిగా కళ్లలోకి చూస్తూ మాట్లాడగలుగుతుంది.
భావోద్వేగాలను తెలిపేందుకు అరవైరకాల ముఖకవళికలను సందర్భోచితంగా ప్రదర్శిస్తుంది. ఇవన్నీ ఒక ఎత్తయితే, సెలబ్రిటీల మాదిరిగా ‘సోఫియా’ ప్రముఖ టీవీ చానళ్లకు ఇంటర్వ్యూలు కూడా ఇవ్వడం విశేషం. సీబీఎస్ చానల్‌లో ‘60 మినిట్స్ విత్ చార్లీ రోజ్’, ఐటీవీలో ‘గుడ్ మార్నింగ్ బ్రిటన్ విత్ పీర్స్ మోర్గాన్’, ఎన్‌బీసీ చానల్‌లో ‘టునైట్ షో విత్ జిమ్మీ ఫాలన్’ వంటి టీవీ షోల్లో ‘సోఫియా’ ప్రదర్శన చూసిన ప్రేక్షకులు అవాక్కయ్యారు.
జపాన్‌లోని ఒసాకా యూనివర్సిటీ, క్యోటో యూనివర్సిటీలకు చెందిన శాస్త్రవేత్తలు రెండేళ్ల కిందట ‘ఎరికా’ అనే రోబోను రూపొందించారు. మనిషి గొంతుతో మాట్లాడే సామర్థ్యం, మనుషులను గుర్తించే సామర్థ్యం, మనుషుల హావభావాలకు అనుగుణంగా స్పందించగల సామర్థ్యం దీని ప్రత్యేకతలు. దాదాపు పాతికేళ్ల జపనీస్ అమ్మాయిలా కనిపించే ‘ఎరికా’ ప్రపంచంలోనే అత్యంత అందమైన రోబోగా వార్తలకెక్కింది. ‘ఎరికా’ త్వరలోనే ‘బి’ అనే హాలీవుడ్ సైన్స్‌ఫిక్షన్ మూవీలో ఒక కీలక పాత్రలో నటించనుంది.
హాంకాంగ్‌కు చెందిన శాస్త్రవేత్త రిక్కీ మా 2016లో స్వయంకృషితో తన ఇంట్లోనే అచ్చం మనిషిలాంటి రోబోను తయారు చేశాడు. హాలీవుడ్ నటి స్కార్లెట్ జోహాన్సన్ పోలికలతో తీర్చిదిద్దిన ఈ రోబోకు ‘మార్క్–1’ అని పేరు పెట్టాడు. త్రీడీ ప్రింటర్ ద్వారా ముద్రించిన అస్థిపంజరానికి సిలికాన్‌తో రూపొందించిన చర్మం సహా అన్ని హంగులూ సమకూర్చి రిక్కీ మా దీనిని తయారు చేశాడు. మనుషుల మాదిరిగానే ఇది కాళ్లు, చేతులు, మెడ, నడుము కదిలించగలదు. ముఖంలో రకరకాల భావోద్వేగాలను పలికించగలదు.
‘రోబో’ భావన ఈనాటిది కాదు
అచ్చం మనుషుల్లానే పనిచేసే మరమనుషులు ఉండాలనే భావన ఈనాటిది కాదు. మనుషుల్లో ఇలాంటి ఆలోచనలు క్రీస్తుపూర్వం నాటి నుంచే ఉండేవి. ఇలాంటి భావన తొలిసారిగా చైనీస్ తావో తత్వ గ్రంథం ‘లీజీ’లో కనిపిస్తుంది. ఈ గ్రంథం క్రీస్తుపూర్వం మూడో శతాబ్ది నాటిది. క్రీస్తుశకం 50 నాటికి చెందిన గ్రీకు గణితవేత్త, ఇంజనీరు ‘హీరో ఆఫ్ అలెగ్జాండ్రా’ ఒక కాల్పనిక గ్రంథంలో విందుకు హాజరైన అతిథుల గ్లాసుల్లో మరమనిషి వైన్ నింపే దృశ్యాన్ని వర్ణించాడు. క్రీస్తుశకం పదమూడో శతాబ్దిలో అరేబియాకు చెందిన బహుముఖ ప్రజ్ఞశాలి అల్ జజారీ తన రచనల్లో మరమనుషులతో కూడిన బ్యాండ్ పార్టీని వర్ణించాడు.
అక్కడితోనే ఆగిపోకుండా, చేతులు కడుక్కునేందుకు మనుషుల శిల్పాలతో కూడిన ఆటోమేటిక్ యంత్రాన్ని రూపొందించాడు. తర్వాత ఏనుగు బొమ్మను రూపొందించి, దానిపై ఏర్పాటు చేసిన మావటి బొమ్మ గంటలు కొట్టేలా ఒక మర గడియారాన్ని కూడా రూపొందించాడు. అల్ జజారీ చేసిన ఆ ప్రయత్నాలను రోబోటిక్స్‌లో తొలి ముందంజగా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత క్రీస్తుశకం పదిహేనో శతాబ్దిలో సుప్రసిద్ధ ఇటాలియన్ చిత్రకారుడు, బహుముఖ ప్రజ్ఞశాలి లియొనార్డో డావిన్సీ మనిషిని పోలిన ఆటోమేటిక్ యంత్రాన్ని కవచం ధరించిన సైనికుని ఆకారంలో రూపొందించాడు.
మర మనుషుల తయారీకి సంబంధించి శతాబ్దాల కిందటే అనేక ప్రయోగాలు జరిగినా, ఎంతో కాల్పనిక సాహిత్యం వెలువడినా అప్పటి రచనల్లో ఎక్కడా ‘రోబో’ అనే మాట కనిపించదు. వందేళ్ల నుంచి మాత్రమే ‘రోబో’ అనే మాట వాడుకలోకి వచ్చింది. తొలిసారిగా చెక్ రచయిత కారెల్ చాపెక్ 1921లో తాను రాసిన ‘రోసుమ్స్ యూనివర్సల్ రోబోస్’ నాటకం ద్వారా ‘రోబో’ అనే మాటను ప్రాచుర్యంలోకి తెచ్చాడు. చెక్, పోలిష్ భాషల్లో ‘రోబోటా’ అనే పదం దీనికి మూలం. ఆ రెండు భాషల్లోనూ ‘రోబోటా’ అంటే కాయకష్టం, దుర్వినియోగం అనే అర్థాలు ఉన్నాయి. జర్మన్ దర్శకుడు ఫ్రిజ్ ల్యాంగ్ 1927లో తీసిన ‘మెట్రోపోలిస్’ సినిమాలో ‘మెషినెన్‌మెన్ష్’ (మరమనిషి) పాత్రలో బ్రిగిట్ హెల్మ్ నటించింది. వెండితెరపై రోబో పాత్ర కనిపించడం ప్రపంచంలో అదే మొదటిసారి. ఆ తర్వాత చాలా భాషల్లో చాలా సినిమాల్లో రోబోల్లాంటి యంత్రాలూ కనిపించాయి. రోబోల పాత్రల్లో కొందరు నటీ నటులూ కనిపించారు.
హ్యూమనాయిడ్ రోబోల భవితవ్యం
దాదాపు నాలుగు దశాబ్దాల కిందట– 1982లో ‘బ్లేడ్ రన్నర్’ అనే హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమా విడుదలైంది. ఆ సినిమాలో 2019 నాటికి మనుషులను పోలిన రోబోలు అన్ని రంగాలకూ విస్తరించి పని చేస్తుంటాయి. భూమ్మీదనే కాదు, భూమికి దూరంగా గ్రహాంతరాల్లో కూడా ఇవి రకరకాల పనులు చేస్తుంటాయి. ఆ సినిమాలో కృత్రిమ పక్షులు, జంతువులు కూడా కనిపిస్తాయి. ఆ సినిమాలో ఊహించిన స్థాయికి రోబోటిక్స్ రంగం ఇంకా చేరుకోలేదు. అయితే, దాదాపు మనుషులను పోలి ఉండే రోబోలను తయారు చేయడంలో మాత్రం విజయం సాధించింది. మనుషులకు పూర్తి ప్రత్యామ్నాయం కాగల హ్యూమనాయిడ్ రోబోలను సృష్టించే దిశగా ప్రయోగాలు జరుపుతోంది.
మనుషులు చేయగలిగే పనుల్లో కొన్ని ప్రమాదకరమైనవి, మరికొన్ని ఇబ్బందికరమైనవి ఉంటాయి. వీటిని ఇప్పటి వరకు మనుషులే చేస్తూ వస్తున్నారు. ఉదాహరణలు చెప్పుకోవాలంటే... పూడుకుపోయిన అండర్‌గ్రౌండ్ డ్రైనేజీలను శుభ్రపరచడం, బాంబులను నిర్వీర్యం చేయడం, ప్రమాదకరమైన గనుల లోలోపలి ప్రదేశాలకు వెళ్లడం వంటివి. హ్యూమనాయిడ్ రోబోలను మనుషులకు దీటుగా తయారు చేయగలిగితే, ఇలాంటి పనుల్లో వాటిని విజయవంతంగా ఉపయోగించుకునేందుకు వీలు ఉంటుంది. హ్యూమనాయిడ్ రోబోల ప్రయోజనానికి ఇదొక కోణమైతే, మరో మానవీయ కోణం కూడా ఉంది. ప్రపంచవ్యాప్తంగా చాలామంది వృద్ధులు ఒంటరిగా ఉంటున్నారు. వారికి తోడుగా ఉంటూ, వారికి అవసరమైన సేవలు చేయడానికి కూడా ఇవి ఉపయోగపడతాయి.
ఇలాంటివి తోడుగా ఉంటే ఒంటరి వృద్ధులకు తమతో ఒక మనిషి తోడుగా ఉన్న భావనే కలుగుతుంది. సంగీతాన్ని పలికించే రోబోలు, వివిధరకాల సంగీత వాద్య పరికరాలను నైపుణ్యంతో వాయించగలిగే రోబోలను ఇప్పటికే శాస్త్రవేత్తలు తయారు చేశారు. త్వరలోనే వినోద రంగంలోనూ రోబోలు ప్రేక్షకులను అలరించే అవకాశాలు లేకపోలేదు. కృత్రిమ మేధతో, తగిన భాషా నైపుణ్యాలతో రూపొందే రోబోలు భవిష్యత్తులో టీవీ చానళ్లలో న్యూస్‌రీడర్లకు ప్రత్యామ్నాయంగా మారే అవకాశాలు ఉన్నాయని, అలాగే యుద్ధరంగంలో సైనికులకు ప్రత్యామ్నాయం కాగలిగే అవకాశాలూ ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రానున్న కాలంలో హ్యూమనాయిడ్ రోబోల పాత్ర ఏ స్థాయిలో ఉంటుందో కచ్చితమైన అంచనా వేయడం కష్టమే అయినా, ఇవి మరింతగా మనుషులు పోషించే పాత్రల్లో ఒదిగిపోతాయని మాత్రం చెప్పవచ్చు.
రజనీకాంత్ రోబో ప్రేరణతో రశ్మి
భారతీయ శాస్త్రవేత్తలు కూడా హ్యూమనాయిడ్ రోబోల తయారీ దిశగా ప్రయోగాలు సాగిస్తూ వస్తున్నారు. రాంచీకి చెందిన కంప్యూటర్ ప్రోగ్రామర్ రంజిత్ శ్రీవాస్తవ రెండేళ్ల కిందట దేశంలోనే తొలిసారిగా అచ్చం మనిషిలా కనిపించే హ్యూమనాయిడ్ రోబోను విడుదల చేశారు. దీని తయారీకి ఆయన దాదాపు రెండేళ్లు శ్రమించారు. రశ్మి పేరిట రూపొందించిన ఈ రోబో నాలుగు భాషలు– హిందీ, ఇంగ్లిష్, భోజ్‌పురి, మరాఠీ భాషల్లో మాట్లాడగలదు. ఎదుట ఉన్న మనుషులు మాట్లాడే దిశగా మెడను తిప్పగలదు. ముఖ కవళికల్లో కళ్లు, కనుబొమలు, పెదవుల కదలికల్లో భావోద్వేగాలను వ్యక్తం చేయగలదు. ‘రశ్మి’ తయారీకి రజనీకాంత్ ‘రోబో’ సినిమా ప్రేరణగా నిలవడం విశేషం. రజనీకాంత్ ‘రోబో’ సినిమా చూసి వచ్చాక రంజిత్ శ్రీవాస్తవ కుమారుడు తనకు అలాంటి రోబో కావాలని మారాం చేశాడు. కొడుకు కోరికను సవాలుగా తీసుకున్న రంజిత్, తనకు ఎలాంటి లాబొరేటరీ లేకున్నా, సాంకేతిక బృందం సహకారం లేకున్నా పట్టుదలతో ‘రశ్మి’ రోబోను తయారు చేసి కొడుకు కోరికను తీర్చడమే కాదు, రోబోటిక్స్‌లో మన దేశం మరో మైలురాయిని అధిగమించేందుకు దోహదపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment