Indian actress Rekha: పన్నీరద్దుకున్న పసిడి రేఖ | Indian Actress Rekha Inspirational Success Story, She Has Seen Many Highs And Lows | Sakshi
Sakshi News home page

Actress Rekha Success Story: పన్నీరద్దుకున్న పసిడి రేఖ

Published Thu, Oct 10 2024 12:39 AM | Last Updated on Thu, Oct 10 2024 12:41 PM

Indian actress Rekha success story

ఏజ్‌... సెవెంటీన్‌     లైఫ్‌... సెవెంటీ ఎంఎం స్క్రీన్‌

రేఖ... నేటితో 70 నిండి 71లోకి అడుగుపెడుతోంది. కాని మొన్న ఐఫా వేడుకలో  వేదిక మీద ఆమె చేసిన 15 నిమిషాల నృత్యం చూస్తే వయసు 17 దగ్గరే ఆగిపోయిందని అనిపించింది. రేఖ – ఎన్నో ఆటుపోట్లు జీవితపు ఎదురుదెబ్బలు ఎదుర్కొంది. కాని ముందుకు సాగడం సౌందర్య భరితంగా జీవించడమే జీవిత పరమార్థం అని నిరూపిస్తూనే ఉంది. కొంచెం కలత చెందితే విరక్తి అవతారం దాల్చే నేటి యువత రేఖ నుంచి ఎంత నేర్చుకోవాలి?

1993.
ఫిల్మ్‌ఫేర్‌ మేగజైన్‌ వారు చెన్నైలో జెమినీ గణేశన్‌కు లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు బహూకరిస్తున్నారు. వేడుకలో దక్షిణాది దిగ్గజాలంతా ఉన్నారు. ప్రతిష్టాత్మకమైన సందర్భం. జెమినీ గణేషన్‌ స్టేజ్‌ మీదకు వచ్చారు. మైక్‌లో వినిపించింది– ఇప్పుడు జెమినీ గణేశన్‌కు అవార్డు బహూకరించవలసిందిగా రేఖను ఆహ్వానిస్తున్నాము...
చప్పట్లు మిన్నంటాయి. రేఖ స్టేజ్‌ మీదకు వచ్చింది. జెమిని గణేశన్‌కు అవార్డు ఇచ్చింది. జెమిని మైక్‌ అందుకుని ‘నా కూతురు రేఖ చేతుల మీదుగా ఈ అవార్డు అందుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది’...

రేఖ ఊహ తెలిసినప్పటి నుంచి ఈ మాట కోసం ఎదురు చూస్తోంది. ‘రేఖ నా కూతురు’ అని జెమిని అనాలని ఎదురు చూసిన మాట. ఇంతకాలానికి విన్నమాట. రేఖ సంతోషంతో వెక్కివెక్కి ఏడ్చింది.
∙∙ 
స్త్రీకి మగవాడి తోడు ఉండాలని భారతీయ సంప్రదాయం అంటుంది. అలా తోడు ఉండక తప్పని పరిస్థితులు మన దేశంలో ఉంటాయి. రేఖకు బాల్యం నుంచి కూడా తండ్రి తోడు లేదు. తల్లి పుష్పవల్లి, తండ్రి జెమిని గణేశన్‌ వివాహ బంధంలో లేకుండానే రేఖను కన్నారు. రేఖ తన బాల్యంలో ‘అక్రమ సంతానం’ గా నింద అనుభవించింది. పుష్పవల్లిని భార్యగా, రేఖను కుమార్తెగా స్వీకరించడానికి జెమిని సిద్ధంగా లేడు. బతుకు గడవడానికి కుమార్తెను సినిమాల్లో ప్రవేశ పెట్టింది పుష్పవల్లి. 

కాని మద్రాసులో రేఖను హీరోయిన్‌గా చేయడానికి ఎవరూ సిద్ధంగా లేరు– జెమిని భయంతో. అదీగాక పుష్పవల్లికి నటిగా ఉన్న రోజుల్లో హిందీలో వెలగాలని ఆశ ఉండేది. ఆ ఆశను కనీసం కుమార్తె అయినా నెరవేర్చాలని కోరుకుంది. అప్పటికే ఆమెకు మద్రాసులో చాలా బాధలు ఉన్నాయి. అందుకని తన చెల్లెల్ని తోడు ఇచ్చి రేఖను బొంబాయి పంపింది. పద్నాలుగేళ్ల అమ్మాయి రేఖ. ఏమీ తెలియని రేఖ. బొంబాయిని చూసి బెంబేలెత్తిపోయిన రేఖ.

1970లో నవీన్‌ నిశ్చల్‌ పక్కన హీరోయిన్‌గా నటించిన ‘సావన్‌ భాదో’ సినిమా విడుదలైంది. బొంబాయి పత్రికలన్నీ రేఖను తెర మీద చూసి ఫక్కున నవ్వాయి. నల్లగా, లావుగా ఉన్న రేఖను గేలి చేశాయి. ‘అగ్లీ డక్‌లింగ్‌’ అని పేరు పెట్టాయి. ‘33 ఇంచుల నడుము హీరోయిన్‌’ అని ఎద్దేవా చేశాయి. రేఖకు ఇవన్నీ ఏమీ అర్థం కాలేదు– తాను సినిమాల్లో నటిస్తే ఇంటి దగ్గర కష్టాలు తీరుతాయి అన్న ఒక్క సంగతి తప్ప. పబ్లిసిటీ కోసం రేఖ చేత ఇంటర్వ్యూల్లో అవాకులు చవాకులు మాట్లాడించేవారు నిర్మాతలు. ‘ముద్దు సీన్లు నటించే’ అమ్మాయిగా రేఖకు పేరు పడింది. రేఖను ఎవరూ సీరియస్‌గా తీసుకోలేదు.

రేఖ బి–గ్రేడ్‌ సినిమాల్లో నటిస్తూ ఉంటే ఆ సమయానికి పరిచయమైన జితేంద్రలో ఆమె భవిష్యత్‌ భాగస్వామిని ఊహించుకుంది రేఖ. అయితే అతను రేఖతో స్నేహంగా ఉన్నా తన గర్ల్‌ఫ్రెండ్, ఎయిర్‌ హోస్టెస్‌ శోభనే వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. ఆ తర్వాత వినోద్‌ మెహ్రా ఆమెకు ఎంత దగ్గరయ్యాడంటే అతడిని పొందలేక రేఖ ఆత్మహత్యాయత్నం చేసిందన్న వార్తలు వచ్చాయి. తర్వాతి రోజుల్లో విలన్‌గా చేసిన కిరణ్‌ కుమార్‌ కూడా ఆమె బోయ్‌ ఫ్రెండ్‌గా ఉన్నాడు. ఈ దశలన్నీ దాటాక 1976లో ‘దో అంజానే’లో అమితాబ్‌తో కలిసి నటించాక రేఖ జీవితం మారిపోయింది. 

జీవితాన్నీ, కెరీర్‌నీ సీరియస్‌గా తీసుకోవడం అమితాబ్‌ నుంచి రేఖ నేర్చుకుంది. ఆమె అమితాబ్‌ను పేరు పెట్టి ఎప్పుడూ పిలవదు. ‘ఓ’ (వారు/ఆయన) అంటుంది. పత్రికలు కూడా ‘ఓ’ అనే రాసేవి. అమితాబ్‌–రేఖల జోడి సూపర్‌ హిట్‌ అయ్యింది. ఆలాప్, ఖూన్‌ పసీనా, మొకద్దర్‌ కా సికిందర్, మిస్టర్‌ నట్వర్‌లాల్, రామ్‌ బలరామ్,  సుహాగ్, సిల్‌సిలా. ఆమ్‌స్టర్‌ డామ్‌ డచ్‌ తులిప్‌ పూల మధ్య రేఖ, అమితాబ్‌ల మధ్య సాగే ‘దేఖా ఏక్‌ ఖ్వాబ్‌ తో ఏ సిల్‌సిలే హుయే’ పాట హిందీ సినిమాలకు సంబంధించి అత్యంత రొమింటిక్‌ గీతంగా నేటికీ అభిమానులను సంపాదించుకుంటూనే ఉంది.

ప్రతికూలతలను రేఖ అనుకూలంగా మార్చుకుంటూ పోరాటం సాగిస్తూ వచ్చింది. ఒక నటికి దేహానికి మించిన పెట్టుబడి లేదని, దాని పోషణ ప్రథమమని గ్రహించిన మొదటి హీరోయిన్‌ రేఖ. ఇందుకు అమితాబ్‌ గైడెన్స్‌ ఉపయోగపడింది. బరువు తగ్గడం ఒక వ్రతంగా పెట్టుకున్న రేఖ నెలల తరబడి కేవలం యాలకులు కలిపిన పాలు తాగి బతికింది. 

బాలీవుడ్‌లో ఆమె వల్లే యోగా, ఏరోబిక్స్‌ పరిచయం అయ్యాయి. మేకప్‌ రహస్యాలు నటికి తెలిసి ఉండాలని లండన్‌ వెళ్లి మేకప్‌ కోర్సు చేసి వచ్చిందామె. ఇప్పుడు బాలీవుడ్‌లో ఎలా కనపడాలో, ఎలా ముందుకు సాగాలో, ఎలా ఇమేజ్‌ను పెంచుకుంటూ వెళ్లాలో ఆమెకు తెలుసు. అంతవరకూ సినిమా స్టిల్స్‌ మాత్రమే పత్రికలకు అందేవి. రేఖ ప్రత్యేకంగా ఫొటో షూట్స్‌ చేసి ఆ స్టిల్స్‌ పత్రికలకు ఇచ్చేది. ఇది బొత్తిగా కొత్త. అందువల్ల ఆమె ఎప్పుడూ కవర్‌ గర్ల్‌గా నిలిచేది. ఆ తర్వాత హీరో హీరోయిన్లు ఆ ట్రెండ్‌ను ఫాలో అవక తప్పలేదు. 

రేఖ కేవలం ఒక గ్లామర్‌ డాల్‌ కాదు ఆమె మంచి నటి అని చెప్పే సినిమా వచ్చింది. ‘ఘర్‌’. గుల్జార్‌ దర్శకత్వంలో 1978లో వచ్చిన ఈ సినిమా రేఖలోని సమర్థమైన నటిని ప్రేక్షకులకు చూపింది. ఈ సినిమాలోని పాటలన్నీ పెద్ద హిట్‌. ఆ తర్వాత హృషికేశ్‌ ముఖర్జీ దర్శకత్వంలో వచ్చిన ‘ఖూబ్‌సూరత్‌’ (1980) రేఖను యూత్‌కు బాగా దగ్గర చేసింది. దాంతోపాటు ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు తెచ్చి పెట్టింది. అదే సంవత్సరం విడుదలైన ‘ఉమ్రావ్‌ జాన్‌’ రేఖ ఒక ఉత్కృష్టమైన నటిగా ప్రపంచానికి చాటింది. ఈ సినిమాకు జాతీయ ఉత్తమ నటి పురస్కారం దక్కాక ఇక రేఖ గురించి విమర్శకులు ఎప్పుడూ తక్కువ చేసే పరిస్థితి రాలేదు. రేఖ ఇప్పుడు అన్ని విధాలుగా పరిపూర్ణమైన నటి.

రేఖను చాలా తెలివితేటలతో, గ్లామర్‌తో, పరిశ్రమతో ఇండస్ట్రీలో నిలిచింది తప్ప నిజానికి ఇండస్ట్రీ ఆమె టాలెంట్‌ను ఎప్పుడూ పూర్తిగా ఉపయోగించుకోలేదు. పెద్ద నిర్మాణ సంస్థలూ పెద్ద దర్శకులు ఆమెను సపోర్ట్‌ చేయలేదు. శ్యామ్‌ బెనగళ్‌ ‘కలియుగ్‌’ (1981), గిరిష్‌ కర్నాడ్‌ ‘ఉత్సవ్‌’ (1984), ఆస్థా (1997) రేఖకు చెప్పుకోవడానికి మిగిలాయి. ఆ తర్వాత ఆమె యాక్షన్‌ సినిమాలకు మళ్లి ‘ఖూన్‌ భరీ మాంగ్‌’, ‘ఫూల్‌ బనే అంగారే’ వంటి సినిమాలు చేసి ‘లేడీ అమితాబ్‌’ అనిపించుకునే వరకూ వెళ్లింది. ఒక దశలో ఆమె అమితాబ్‌లాగా కాస్ట్యూమ్స్‌ కూడా ధరించేది.

రేఖ అన్‌స్టాపబుల్‌. అన్‌లిమిటెడ్‌. ఆమె ‘కల్‌ హోన హో’,‘క్రిష్‌’ వంటి సినిమాల్లో తల్లి/బామ్మ పాత్రలు పోషించినా ప్రేక్షకులు ఎప్పుడూ నల్లజుట్టు రేఖనే ఇష్టపడ్డారు. ఆమె తన ఆకృతిని, ఫిట్‌నెస్‌ని 70 ఏళ్ల వయసు వచ్చినా ఎప్పుడూ కోల్పోలేదు. నేటికీ ఆమె ప్రత్యేకమైన ఫొటోషూట్స్‌ చేస్తూ కవర్‌గర్ల్‌ గానే ఉంది. ఇలా హాలీవుడ్‌ నటీమణులకు చెల్లిందిగానీ మన దేశంలో రేఖకు మాత్రమే సాధ్యమైంది. 
రేఖ గొప్ప డాన్సర్‌. పాటలు బాగా పాడుతుంది. కవిత్వం రాస్తుంది. ఆమెలో ఏదో ఆకర్షణ ఉంది. ‘నేను ప్రేమిస్తే సంపూర్ణంగా ప్రేమిస్తాను’ అనే రేఖ ప్రేక్షకులకు కూడా అంతే సంపూర్ణంగా ప్రేమ అందించడం వల్లే నేటికీ నిలబడి ఉంది.
ఈ గొప్ప యోధ, కళాకారిణి తెలుగువారి అమ్మాయి కూడా కావడం తెలుగువారు గర్వపడాల్సిన విషయం.
రేఖకు జన్మదిన శుభాకాంక్షలు.              

రేఖ టాప్‌ 10 సాంగ్స్‌
1. తేరే బినా జియా జాయేనా – ఘర్‌
2. ఆజ్‌కల్‌ పావ్‌ జమీ పర్‌ – ఘర్‌
3. సున్‌ దీదీ సున్‌ తేరేలియే – ఖూబ్‌సూరత్‌
4. సలామే ఇష్క్‌ మేరీ జాన్‌ – ముకద్దర్‌ కా సికిందర్‌
5. దిల్‌ చీజ్‌ క్యా హై – ఉమ్రావ్‌ జాన్‌
6. ఛోటి సి కహానీ సే బారిషోంకే పానీ సే – ఇజాజత్‌
7. పర్దేశియా ఏ సచ్‌ హై పియా – మిస్టర్‌ నట్వర్‌లాల్‌
8. మన్‌ క్యూ బెహకా రే బెహకా – ఉత్సవ్‌
9. గుమ్‌ హై కిసీ కే ΄్యార్‌ మే – రామ్‌పూర్‌ కా లక్ష్మణ్‌
10. ఏ కహా ఆగయే హమ్‌ – సిల్‌సిలా
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement