స్మార్ట్‌ఫోన్ యుగం వచ్చాక ఎక్కడికైన వెళ్లినా..ఏదైన వింత చోటు కనిపించినా.. వెంటనే ఫోన్‌కి పనిచెప్పేస్తారు. సెల్ఫీలు దిగేయడం, సోషల్ మీడియాలో పోస్ట్ చేసేయడం చేస్తోంది నేటి యువత. ఒకప్పటిలా కెమెరామెన్‌తో ఫోటోలు తీయించుకునే పనే లేదు. నచ్చిన యాంగిల్స్‌లో మనకు మనమే ఫోటోలు తీసేసుకుంటున్నారు. అయితే ఈ సెల్ఫీలు మోజు నేటిది మాత్రం కాదు. వందేళ్ల ఏళ్ల క్రితమే దీనికి క్రేజ్ ఉంది. పైగా నాటి కాలంలోనే వాళ్లు సెల్ఫీలు తీసుకుని సంబరపడ్డారు కూడా.
ప్రపంచంలోనే తొలి సెల్ఫీని అక్టోబర్ 1839లో రాబర్ట్ కార్నెలియస్ తీశారు. ఆయన డాగ్యురోటైప్ టెక్నిక్‌ని ఉపయోగించారు. ఇది అయోడిన్-సెన్సిటైజ్డ్ సిల్వర్ ప్లేట్, పాదరసం ఆవిరిని ఉపయోగించే ప్రారంభ ఫోటోగ్రాఫిక్ ప్రక్రియ. ఆయన అమెరికాలోని ఫిలడెల్ఫియాలో తన ఇంటి పెరట్లో తన కుటుంబంతో కలిసి సెల్ఫీ దిగేందుకు దాదాపు మూడు నుంచి 15 నిమిషాల వ్యవధి తీసుకుంది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఆ ఫోటో వెనుక సవివరంగా వివరించాడు కూడా. ఈ ఫోటోనే 1839లో తీసిన సెల్ఫీ లైట్ పిక్చర్‌గా గిన్నిస్ రికార్డు నెలకొల్పింది.
అయితే మన ఇండియాలో తొలి సెల్ఫీ దిగింది రాజకుటుంబానికి చెందిన ఓ జంట. రాచరికపాలన సాగే త్రిపుర రాష్ట్రంలో సెల్ఫీ ఫోటోగ్రాఫ్ 1880లో దిగడం జరిగింది. మహారాజా బీర్ చంద్ర మాణిక్య అతని భార్య మహారాణి ఖుమాన్ చాను మన్మోహినీ దేవి ఇద్దరూ కలిసి సెల్ఫీ తీసుకున్నారు. మహారాజు మంచి ఫోటోగ్రఫీ ఔత్సాహికుడు. అతను అనేక ఫోటోగ్రఫీ ప్రదర్శనలు కూడా నిర్వహించాడు. అంతేగాదు ఆయన చనిపోయేంత వరకు ఫోటోగ్రాఫిక్ సోసైటీలో సభ్యుడు కూడా.
రాజు కారణంగా ఆ కళపై మహారాణి కూడా మక్కువ పెంచుకుంది. అలా ఆమె కూడా ఫోటోగ్రాఫర్‌గా మారడం జరిగింది. చెప్పాలంటే ఆ రోజుల్లో ఫోటోగ్రఫీ కళలో ప్రావీణ్యం పొందిన తొలి భారతీయ మహిళ ఆమెనే కావడం విశేషం. కాగా, త్రిపుర మహారాజు తీసుకున్న సెల్ఫీలో మహారాణితో కౌగిలించుకుని దిగినట్లుగా ఫోటో కనిపిస్తుంది. అంతేగాదు ఈ ఫోటోనే భారతదేశంలోని తొలి సెల్ఫీగా నిలిచింది కూడా.
(చదవండి: దీపికా పదుకొణె మెడలో సిక్కు మహారాజుల నాటి నెక్లెస్..!)
Comments
Please login to add a commentAdd a comment